Begin typing your search above and press return to search.

టాలీవుడ్ టాప్-10 కమెడియన్లు వీళ్లే!

నవ్వడం ఒక 'భోగం'.. నవ్వించడం ఒక 'యోగం'.. నవ్వకపోవడం ఒక 'రోగం' అన్నారో మహాకవి

By:  Tupaki Desk   |   22 April 2024 5:01 PM GMT
టాలీవుడ్ టాప్-10 కమెడియన్లు వీళ్లే!
X

నవ్వడం ఒక 'భోగం'.. నవ్వించడం ఒక 'యోగం'.. నవ్వకపోవడం ఒక 'రోగం' అన్నారో మహాకవి. సృష్టిలో ఉన్న జీవులన్నింటిలోనూ హాయిగా నవ్వగలిగే వరం ఒక్క మనిషికి మాత్రమే సొంతం. అయితే నవరసాల్లో ఒకటైన హాస్యాన్ని పండించి, ఇతరులను నవ్వించడం అంత ఈజీ కాదు. అలాంటి నవ్వించే పాత్రలను మన తెలుగు సినిమాల్లో ఎందరో ప్రతిభావంతులైన హాస్యనటులు సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఎవరి శైలిలో వాళ్ళు ఆడియన్స్ ను నవ్విస్తున్నారు.

తెలుగులో ఉన్నంత మంది కమెడియన్లు మరే ఇతర ఇండస్ట్రీలలో లేరనే చెప్పాలి. ఎంతమంది ఉన్నా సరే ఎవరికి వారు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఒకప్పుడు బ్రహ్మానందం, బాబూ మోహన్, అలీ, సునీల్, కృష్ణ భగవాన్ లాంటి వారు కొన్నేళ్లపాటు స్టార్ కమెడియన్లుగా రాణించారు. ఈతరం హాస్యనటులు వచ్చిన తర్వాత మెల్లి మెల్లిగా వాళ్ళ హవా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ లో అనేక మంది నటీనటులు తమ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. కామెడీతో పాటు అన్ని రకాల పాత్రల‌ను పోషిస్తున్నారు. వారిలో కొందరు హీరోలుగానూ అలరించే ప్రయత్నం చేస్తున్నారు. మన ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తున్న టాప్-5 కమెడియన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1. వెన్నెల కిషోర్:

టాలీవుడ్ కమెడియన్లలో వెన్నెల కిషోర్ టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు. 'వెన్నెల'తో హాస్య నటుడిగా తెరంగేట్రం చేసిన కిషోర్.. తన మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని, తన కామెడీ టైమింగ్ తో డిఫరెంట్‌ మేనరిజమ్స్‌ తో అనతికాలంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగారు. ప్రెజెంట్ చేతినిండా ఆఫర్స్ తో ఆయన కెరీర్ మంచి జోరులో వుంది. పెద్ద హీరోల సినిమాల్లో నవ్వించే పాత్రలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిన కిశోర్.. దానికి తగ్గట్టుగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే టాక్ ఉంది. మధ్యలో అప్పుడప్పుడు హీరోగానూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన 'చారీ 111' సినిమా థియేటర్లలో ప్లాప్ అయినా, ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

2. ప్రియదర్శి పులికొండ:

‘పెళ్లి చూపులు’ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రియదర్శి.. వరుస అవకాశాలు అందుకున్నాడు. తక్కువ కాలంలోనే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కమెడియన్స్ లో ఒకరిగా మారాడు. 'మల్లేశం', 'బలగం' లాంటి సినిమాల్లో హీరోగా నటించి నవ్వించడమే కాదు ఏడిపించడం కూడా వచ్చని నిరూపించాడు. తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన కామెడీ పాత్రలను వదిలిపెట్టకుండా ఇటీవల ‘సేవ్ టైగర్స్’ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న ప్రియదర్శి.. ‘ఓం భీమ్ భుష్’ తో మంచి హిట్టు కొట్టాడు. ఇప్పుడు హీరోగా న‌భా న‌టేష్ తో కలిసి 'డార్లింగ్' అనే మూవీ చేస్తున్నాడు.

3. రాహుల్ రామకృష్ణ:

'అర్జున్ రెడ్డి' లో హీరో ఫ్రెండ్ పాత్రలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్న రాహుల్ రామకృష్ణ.. కమెడియన్ రోల్స్ తో పాటుగా అన్ని రకాల పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. కథానాయకుడిగా ‘నెట్’ ‘ఇంటింటి రామాయణం’ వంటి పలు ఓటీటీ సినిమాలు చేసాడు. 'విమానం' మూవీతో అలరించాడు. ఈ మధ్యనే ‘ఓం భీమ్ భుష్’ చిత్రంలో బ్యాంగ్ బ్రోస్ లో ఒకడిగా నవ్వులు పూయించాడు.

4. సత్య:

టాలీవుడ్ బిజీ కమెడియన్లలో సత్య కూడా ఒకరు. చేతినిండా చిత్రాలతో, ఏడాది పొడవునా షూటింగ్ లతో తీరిక లేకుండా గడుపుతున్నారు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నవ్వించాలంటే సత్య ఉండాల్సిందే. కేవలం అతని కామెడీతో బయటపడిన చిత్రాలు ఉన్నాయి. రీసెంట్ గా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' మూవీలో అదరగొట్టాడు. కోవిడ్ టైములో 'వివాహ భోజనంబు' సినిమాతో హీరోగా అలరించాడు.

5. శ్రీనివాస్ రెడ్డి:

తన కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్విస్తున్న శ్రీనివాస్ రెడ్డి సైతం మంచి అవకాశాలు అందుకుంటున్నారు. స్టార్ కమెడియన్‌గా రాణిస్తున్న సమయంలోనే , హీరోగా ‘గీతాంజలి’ ‘ఆనందోబ్రహ్మ’ ‘జయమ్ము నిశ్చయంబురా’ లాంటి చిత్రాలతో హిట్లు అందుకున్నాడు. ఓవైపు కామెడీ పాత్రలు పోషిస్తూనే, మరోవైపు ఛాన్స్ వచ్చినప్పుడు ప్రధాన పాత్రలు చేస్తున్నాడు. ఇటీవల 'గీతాంజలి' సీక్వెల్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు.

6. అభినవ్ గోమఠం:

తనదైన కామెడీ టైమింగ్ తో ఇండస్ట్రీలో ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న అభినవ్ గోమఠం.. 'మస్త్ షేడ్స్ ఉన్నాయి రా' చిత్రంతో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ తో పాటుగా, ఆహాలో 'మై డియర్ దొంగ' అనే ఓటీటీ మూవీతో ఆకట్టుకున్నాడు.

7. హర్ష చెముడు (వైవా హర్ష):

యూట్యూబ్ నుంచి బిగ్ స్క్రీన్ మీదకు వచ్చిన వైవా హర్ష.. తక్కువ టైంలోనే కమెడియన్ గా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ మధ్యనే హీరో రవితేజ నిర్మాణంలో ‘సుందరం మాస్టర్’ సినిమాతో హీరోగా మారాడు. గత శుక్రవారం 'పారిజాత పర్వం' అంటూ ప్రేక్షకులను పలకరించాడు.

8. సప్తగిరి:

నెల్లూరు, చిత్తూరు జిల్లాల యాసలో కామెడీ చేస్తూ ప్రేక్షకులు ఎంటర్టైన్ చేసే హాస్యనటుడు సప్తగిరి. ఎన్నో సినిమాల్లో తన కామెడీ టైమింగ్ తో నవ్వించిన ఆయన.. కథానాయకుడిగా కొన్ని సినిమాలు చేసారు. అటు కమెడియన్ గా నటిస్తూనే, ఇటు హీరోగా సినిమాలు చేస్తున్నారు.

9. సుదర్శన్:

నెల్లూరు యాసలో డైలాగులు చెబుతూ, తన నేచురల్‌ యాక్టింగ్ తో నవ్వించే కమెడియన్ సుదర్శన్. ఎలాంటి చిన్న పాత్ర ఇచ్చినా తన ప్రత్యేకతను చాటుకునే సుదర్శన్.. 'ఏక్ మిని కథ' లాంటి ఎన్నో చిత్రాల్లో అదరగొట్టాడు. గతేడాది 'సామజవరగమన' సినిమాతో అలరించాడు.

10. మహేష్ ఆచంట:

‘జబర్దస్త్’ కామెడీ షోతో వెలుగులోకి వచ్చిన మహేష్ ఆచంట, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రంగస్థలం’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. మధ్యలో ‘నేను నా నాగార్జున’ అంటూ హీరోగానూ ట్రై చేసాడు.

వీరితో పాటుగా ప్రవీణ్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, షకలక శంకర్, ఆటో రాంప్రసాద్, ధనరాజ్ లాంటి కమెడియన్లు కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. సత్యం రాజేష్, సుహాస్, సుడిగాలి సుధీర్ లాంటి హాస్యనటులు ప్రస్తుతం హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. డైరెక్టర్ గా మారిన జబర్దస్త్ వేణు అప్పుడప్పుడు సినిమాల్లో కామెడీ వేషాలు వేస్తున్నారు.