Begin typing your search above and press return to search.

జాన‌ర్ ట్రెండ్ మారిన వేళ‌!

టాలీవుడ్ ఇప్పుడు ఎంతో అప్ డేట్ గా ఉంది. మునుప‌టిలా మ‌సాలా కంటెంట్ ని వ‌దిలేసి కొత్త‌గా ట్రై చేస్తున్నారు

By:  Tupaki Desk   |   10 April 2024 7:01 AM GMT
జాన‌ర్ ట్రెండ్ మారిన వేళ‌!
X

టాలీవుడ్ ఇప్పుడు ఎంతో అప్ డేట్ గా ఉంది. మునుప‌టిలా మ‌సాలా కంటెంట్ ని వ‌దిలేసి కొత్త‌గా ట్రై చేస్తున్నారు. వ‌స్తే స‌క్సెస్ వ‌స్తుంది లేదంటే వైఫ‌ల్యం ఎదుర‌వుతుందని దైర్యంగా ముందుకు క‌దులుతున్నారు. సేఫ్ జోన్ వ‌దిలేసి రిస్క్ కి ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌డం లేదు. కొత్త కుర్రాళ్లు కొత్తగా ట్రై చేసి ఎలా స‌క్సెస్ అవుతున్నారో క‌నిపిస్తూనే ఉంది. అలాగే స్టార మేక‌ర్స్ లో సైతం భారీ మార్పులే క‌నిపిస్తున్నాయి. టాలీవుడ్ పాన్ ఇండియాకి క‌నెక్ట్ అయిన నేప‌థ్యంలో మేము సైతం అంటూ అప్డేట్ అయి ముందుకొస్తున్నారు.

టాలీవుడ్ జాన‌ర్ ట్రెండ్ ని మార్చ‌డంలో మా వంతు ప్ర‌య‌త్నం ఉంటుంద‌ని క్రియేటివ్ గా ముందుకెళ్తున్నారు. ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ములా ధ‌నుష్..నాగార్జున‌ల‌తో `కుభేర` అనే చిత్రాన్ని పాన్ ఇండియాలో తెర‌కెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ముంబై గ్యాంగ్ స్ట‌ర్ నేప‌థ్యంతో తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది. శేఖ‌ర్ క‌మ్ములా ఇలాంటి జాన‌ర్ లా సినిమా చేస్తార‌ని ఎప్పుడైనా ఎవరైనా ఊహించారా? క‌నీసం ఊహ‌కి కూడా రానిది. ఎప్పుడు క్లాస్ స్టోరీల‌తో క‌నిపించే క‌మ్ములా ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? అని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్న త‌రుణం ఇది.

ఇక చందు మొండేటి అంటే హార‌ర్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రాలు గుర్తొస్తాయి. వాటిలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడాయ‌న పాన్ ఇండియా సినిమా కోసం ట్రెండ్ మార్చారు. యువ సామ్రాట్ నాగ చైత‌న్య‌తో `థండే`ల్ అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఉత్త‌రాంద్ర మ‌త్స‌కారుల జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌లు ఆధారంగా ఓ అంద‌మైన‌..అద్భుత‌మైన ప్రేమ క‌థ‌ని చూపించ‌బోతున్నారు. ఇది ఆయ‌న శైలికి భిన్న‌మైన సినిమా. అలాగే కొర‌టాల శివ అంటే ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ క్లాసిక్ స్టైల్ ఉంది.

క్లాస్ గా క‌థ రాసుకుని మాస్ గా చూపించ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. అలాంటి శివ కూడా `దేవ‌ర‌`తో త‌న‌లో మాస్ యాంగిల్ ఎంత భ‌యంక‌రంగా ఉంటుందో చూపిస్తున్నాడు. ఇది మ‌త్స్య‌కార నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మే. ఈ క‌థ‌కి వాస్త‌వ ఆధారాలున్నాయనే ప్ర‌చారం సాగుతోంది. ఇటీవ‌లే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో హ‌నురాఘ‌వ‌పూడి కూడా ఓ సినిమా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. సీతారామంతో హ‌ను మేకింగ్ స్టైల్ మారి పోయింది.

ఎమోష‌న్ హైలైట్ చేసి భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ప్ర‌భాస్ తో ర‌జాక‌ర్ బ్యాక్ డ్రాప్ లో ఓ అంద‌మైన ల‌వ్ స్టోరీకి అద్భుత‌మైన యాక్ష‌న్ జోడిస్తున్నాడు. ఓ రేంజ్ యాక్ష‌న్ సినిమా చేయ‌డం హ‌నుకి ఇదే తొలిసారి. ల‌వ్ స్టోరీలంటే ఆయ‌న‌కు కొట్టిన పిండి అయినా...యాక్ష‌న్ అన్న‌ది తెలియ‌ని జోన‌ర్. ఇలా ఇండ‌స్ట్రీలో న‌యా మేక‌ర్స్ అంతా కొత్త‌గా ట్రై చేస్తున్నారు.