Begin typing your search above and press return to search.

దేవుళ్ళు, దెయ్యాల చుట్టూ తిరుగుతున్న టాలీవుడ్!

దేవుళ్ళు, దైవత్వం, ఆధ్యాత్మికం.. ఇతిహాసాలు, పురాణాలు.. దెయ్యాలు, ఆత్మలు.. చేతబడులు, క్షుద్ర పూజలు.. బాణామతి, మూఢనమ్మకాలు.. మంత్రాలు, యంత్ర తంత్ర శక్తులు

By:  Tupaki Desk   |   28 Feb 2024 6:05 AM GMT
దేవుళ్ళు, దెయ్యాల చుట్టూ తిరుగుతున్న టాలీవుడ్!
X

దేవుళ్ళు, దైవత్వం, ఆధ్యాత్మికం.. ఇతిహాసాలు, పురాణాలు.. దెయ్యాలు, ఆత్మలు.. చేతబడులు, క్షుద్ర పూజలు.. బాణామతి, మూఢనమ్మకాలు.. మంత్రాలు, యంత్ర తంత్ర శక్తులు.. ఇప్పుడివే టాలీవుడ్ లో ప్రధాన కథా వస్తువులు. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించిన సినిమాలకి విశేషమైన ప్రేక్షకాదరణ దక్కుతుండటంతో, మన ఫిలిం మేకర్స్ అంతా వాటి స్ఫూర్తితోనే కథలు రాసుకుంటున్నారు. స్టార్ హీరోలు సైతం అలాంటి చిత్రాల్లో నటించడానికి ఆశక్తి కనబరుస్తున్నారు. 'అఖండ', 'కార్తికేయ 2' 'విరూపాక్ష' దగ్గర నుంచి.. 'మా ఊరి పొలిమేర 2', 'హను-మాన్', 'ఊరి పేరు భైరవకోన' వరకూ.. ఎన్నో తెలుగు సినిమాలు ఇలాంటి కాన్సెప్ట్స్ తోనే రూపొందాయి. ఈ క్రమంలో మరికొన్ని చిత్రాలు రాబోతున్నాయి.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన 'అఖండ' చిత్రంలో శివుడు, అఘోరాలు, దేవాలయాల పరిరక్షణ అనే అంశాలను ప్రస్తావించారు. శ్రీ కృష్ణుడు, కృష్ణతత్వం చుట్టూ అల్లుకున్న మిస్టరీల నేపథ్యంలో నిఖిల్ సిద్ధార్థ్, చందు మొండేటి కాంబినేషన్ లో 'కార్తికేయ 2' సినిమా రూపొందింది. సుకుమార్ నిర్మాణంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన 'విరూపాక్ష' మూవీలో చేతబడులు, క్షుద్ర పూజలను చూపించారు. సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మా ఊరి పొలిమేర' & 'మా ఊరి పొలిమేర 2' చిత్రాలను వశీకరణం, బ్లాక్ మ్యాజిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు.

కార్తికేయ నటించిన 'బెదురు లంక 2012' సినిమాలో మూఢనమ్మకాల నేపథ్యాన్ని ఫన్నీగా ప్రెజెంట్ చేసారు. రోజా పూలు శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్ కలిసి 'పిండం' అనే హారర్ మూవీతో భయపెట్టే ప్రయత్నం చేశారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా 'హను-మాన్' అనే పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ వచ్చింది. ఇండియన్ రియల్ సూపర్ హీరో హనుమంతుడి స్ఫూర్తితో రాసుకున్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కాంబోలో రూపొందిన సూపర్ నేచురల్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'ఊరి పేరు భైరవకోన' ఆడియన్స్ ను ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్ళింది.

‘లవ్ మీ’:

లేటెస్టుగా దిల్ రాజు ప్రొడక్షన్ లో ‘లవ్ మీ - ఇఫ్ యూ డేర్’ అనే సినిమాని అనౌన్స్ చేశారు. భీమవరపు అరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆశిష్ రెడ్డి, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లింప్స్ ను బట్టి చూస్తే, ఇదొక హారర్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. పీసీ శ్రీరామ్, ఎంఎం కీరవాణి లాంటి టాప్ టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అవడంతో అందరిలో ఆసక్తి రెట్టింపు అయింది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 27న ‘లవ్ మీ’ సినిమా రిలీజ్ కాబోతోంది.

'ఓం భీమ్ బుష్':

శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో 'ఓం భీమ్ బుష్' అనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ రాబోతోంది. హుషారు ఫేం శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రానికి 'నో లాజిక్‌ ఓన్లీ మేజిక్‌' అనేది ట్యాగ్ లైన్. ఇటీవలే ఈ మూవీ టీజర్ ను యూవీ క్రియేషన్స్ టీమ్ ఆవిష్కరించింది. గుప్త నిధుల నేపధ్యంలో హారర్, బ్లాక్ మ్యాజిక్ వంటి అంశాలను జోడిస్తూ ఈ సినిమా తీసినట్లు తెలుస్తొంది. ఇది మార్చి 22న ప్రేక్షకుల ముందుకి రానుంది.

'గీతాంజలి మళ్లీ వచ్చింది':

తెలుగు బ్యూటీ అంజలి ప్రధాన పాత్రలో 'గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది' అనే హార‌ర్ కామెడీ మూవీ వస్తోన్న సంగతి తెలిసిందే. 2014లో వచ్చిన 'గీతాంజ‌లి' సినిమాకి సీక్వెల్ గా.. రచయిత కోన వెంక‌ట్ ఈ క‌థ‌ రాసుకున్నారు. హారర్ అంశాలతో పాటుగా హాస్యం పుష్కలంగా ఉన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో విడుదల చేయనున్నారు.

'కల్కి 2898 AD':

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 AD'. ఇది హిందూ పురాణాల ఆధారంగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సైన్స్-ఫిక్షన్ డిస్టోపియన్ సినిమా. క్రీ.శ. 3102 మహాభారతంతో ప్రారంభమై 2898 AD లో ముగుస్తుందని, ఈ 6000 ఏళ్ల మధ్య జరిగే కథను చూపిస్తుందని దర్శకుడు వెల్లడించారు. ఇందులోని పాత్రలన్నీ ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయని, భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశామని చెప్పారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.

'భీమా' & 'గామి':

గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా' సినిమాలోనూ దేవుళ్ళు, ఆధ్యాత్మికం అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తుంది. 'శ్రీ మహా విష్ణువు ఆరో అవతారం పరశురాముడు.. పరమ శివుడే కొలువైన పరశురాముడి క్షేత్రం' అంటూ ఈ మధ్య వచ్చిన ట్రెయిలర్ ఆకట్టుకుంది. శివరాత్రి స్పెషల్ గా మార్చి 8న ఈ చిత్రం విడుదల కాబోతుంది. అదే రోజున విశ్వక్ సేన్ నటించిన 'గామి' సినిమా కూడా వస్తోంది. ఈ మిస్టికల్ అడ్వెంచర్ డ్రామాలో విశ్వక్ అఘోరాగా కనిపించనున్నారు.

ఇవే కాకుండా రానున్న రోజుల్లో మరికొన్ని మిస్టిక్ సినిమాలు, హారర్ చిత్రాలు, మైథలాజికల్ మూవీస్ రాబోతున్నాయి. 'మా ఊరి పొలిమేర' ప్రాంచైజీలో 3, 4, 5 భాగాలు వస్తాయని మేకర్స్ స్పష్టం చేశారు. 'జై హనుమాన్' మూవీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. 'మంగళవారం 2', విరూపాక్ష 2, అఖండ 2, కార్తికేయ 3 లాంటి సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.