వేతన పెంపులో మెలిక.. దిగొచ్చేది లేదన్న ఫెడరేషన్
ఒకట్రెండు రోజులుగా ఫెడరేషన్ తో ఛాంబర్ వర్గాలు చర్చలు జరుపుతున్నాయి. ఎట్టకేలకు నిర్మాతలు కొంత దిగి వచ్చి 15శాతం పెంపునకు అంగీకరించారు.
By: Tupaki Desk | 10 Aug 2025 1:54 AM ISTకార్మిక సమ్మె కారణంగా గత కొద్ది రోజులుగా టాలీవుడ్ షూటింగులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 30 శాతం వేతన పెంపును తక్షణం అమల్లోకి తేకపోతే బంద్ కొనసాగుతుందని కార్మిక సమాఖ్య భీష్మించుకు కూచుంది. నిర్మాతలు ఓవైపు ఫెడరేషన్ తో మంతనాలు సాగిస్తున్నా కానీ, కార్మికులు దిగి రాలేదు. మెగాస్టార్ చిరంజీవితోను నిర్మాతలు మంతనాలు సాగించారు. ఆయన ఒక పరిష్కారం వెతుకుదామని అన్నారు.
ఒకట్రెండు రోజులుగా ఫెడరేషన్ తో ఛాంబర్ వర్గాలు చర్చలు జరుపుతున్నాయి. ఎట్టకేలకు నిర్మాతలు కొంత దిగి వచ్చి 15శాతం పెంపునకు అంగీకరించారు. రోజుకు 2000 వేతనం అందుకునే కార్మికులకు పెంపు వర్తించదు.. 1000-1200 రేంజులో అందుకునే కార్మికులకు తొలి దఫా 15 శాతం వేతనం పెంచుతామని, రెండో విడతలో 5శాతం, మూడో విడతలో 5శాతం వేతనాలు పెంచుతామని నిర్మాతలు అంగీకరించారు. అయితే 30 శాతం పెంపునకు సుముఖంగా లేమని నిర్మాతలు ప్రకటించారు. చిన్న సినిమాలకు ఇవేవీ వర్తించవని కూడా వెల్లడించారు. ఆ మేరకు మీడియా సమావేశంలో దీనిని అధికారికంగా ప్రకటించారు.
అయితే తాము నిర్మాతలు పేర్కొన్న వేతన సవరణకు అంగీకరించలేదని ఫెడరేషన్ అధ్యక్షుడు అనీల్ వల్లభనేని పేర్కొన్నారు. చర్చలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన అన్నారు. కార్మిక యూనియన్లను విభజించి పాలించారని, ఒక్కొక్కరికి ఒక్కోలా వేతన సవరణ గురించి మాట్లాడటం నచ్చలేదని అనీల్ అన్నారు. తాము వారు చెప్పిన దానికి అంగీకరించలేదని, చర్చలు విఫలమయ్యాయని అన్నారు.
