Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లో సరికొత్తగా నాన్న ఎమోషన్!

టాలీవుడ్ లో సెంటిమెంట్ కథలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా నాన్న ఎమోషన్ అనేది వెండి తెరపై ఎప్పటికీ వాడిపోని ఎవర్‌గ్రీన్ ఫార్ములా.

By:  Srikanth Kontham   |   23 Jun 2026 10:00 PM IST
టాలీవుడ్‌లో సరికొత్తగా నాన్న ఎమోషన్!
X

టాలీవుడ్ లో సెంటిమెంట్ కథలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా నాన్న ఎమోషన్ అనేది వెండి తెరపై ఎప్పటికీ వాడిపోని ఎవర్‌గ్రీన్ ఫార్ములా. గతంలో ఎన్నో చిత్రాలు తండ్రీకొడుకులు - తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంతో ఇచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. కాల‌క్ర‌మంలో ల‌వ్..యూత్ పుల్ కాన్సెప్ట్ లు పెరిగిపోవ‌డంతో డాడ్ ఎమోష‌న్ దూర‌మైంది. కానీ ఈ మ‌ధ్య కాలంలో మ‌ళ్లీ నాన్న సెంటిమెంట్ అక్క‌డక్క‌డా క‌నిపిస్తోంది. కాక‌పోతే ఈసారి ఇదే సెంటిమెంట్ కు హై-వోల్టేజ్ మాస్ యాక్షన్‌ జోడించి సరికొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి- మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న కొత్త ప్రాజెక్ట్ భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

'వాల్తేరు వీర‌య్య' హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా రొటీన్ ఫైట్లు, ఎలివేషన్లతో సాగే యాక్షన్ చిత్రం మాత్రమే కాదు. కూతురి కోసం ఒక తండ్రి చేసే పవర్‌ఫుల్ ఎమోష‌న్ పోరాటంగా బాబీ మలుస్తున్నారు. మెగాస్టార్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు తోడు కూతురి సెంటిమెంట్ కూడా తోడైతే థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఖాయం. అలాగే మాస్ మహారాజా రవితేజ సైతం డిఫరెంట్ ఎమోషనల్ జర్నీకి శ్రీకారం చుట్టారు. ప్రతిభావంతుడైన దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో రవితేజ న‌టిస్తోన్న 'ఇరుముడి' చిత్రం పూర్తిగా ఎమోషన్స్ బేస్డ్ కథాంశంతో తెరకెక్కుతోంది.

ఎప్పుడూ ఎనర్జిటిక్ పాత్రల్లో కనిపించే రవితేజ ఇందులో కూతురికి ఇచ్చిన మాట కోసం తన ప్రవర్తనను, జీవితాన్ని మార్చుకునే బాధ్యతాయుతమైన తండ్రి పాత్రలో సరికొత్తగా కనిపించనున్నారు. యాక్షన్ లవర్స్‌ను మెప్పిస్తూనే ఫ్యామిలీ ఆడియన్స్‌ను కన్నీళ్లు పెట్టించేలా చిత్రంలోని తండ్రీకూతుళ్ల బాండ్ ఉండబోతోందని సమాచారం.

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ క్రేజ్ ఉన్న స్టార్ హీరో సూర్య కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. క్లాస్ - ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ సినిమాలో సూర్య సింగిల్ పేరెంట్గా కనిపించబోతున్నారనే క్రేజీ టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. సమాజంలో ఒంటరి తండ్రి పిల్లల పెంపకంలో ఎదుర్కొనే సవాళ్లు, ఆ క్రమంలో వచ్చే యాక్షన్ డ్రామాను ఈ చిత్రంలో ఎంతో హృద్యంగా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ అగ్ర హీరోలు ఈ తరహా కథలను ఎంచుకోవడం వెనుక బలమైన మార్కెట్ వ్యూహం కూడా ఉంది. కేవలం రొటీన్ యాక్షన్, ఫైట్లు, లవ్ స్టోరీలతో వచ్చే కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులు ఓటీటీల కాలంలో పెద్దగా ఆదరించడం లేదు. అదే బలమైన కుటుంబ సెంటిమెంట్, నాన్న ఎమోషన్ గనక కథలో ఉంటే, అది మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా థియేటర్లకు పెద్ద ఎత్తున రప్పిస్తుంది. ఈ ఫార్ములా సినిమాకు సుదీర్ఘమైన బాక్సాఫీస్ రన్‌ను , భారీ వసూళ్లను అందించడానికి ప్రధాన వనరుగా మారుతోంది.