Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురికీ ఇప్పుడు విష‌మ ప‌రీక్షేనా?

దీని నుంచి త‌ప్పించుకుని మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్‌లోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో త‌న రెగ్యుల‌ర్ పంథాకు పూర్తి భిన్నంగా వ‌రుణ్ తేజ్ ఓ హార‌ర్ థ్రిల్ల‌ర్‌ని ఎంచుకున్నాడు.

By:  Srikanth Kontham   |   7 Feb 2026 7:00 AM IST
ఆ ముగ్గురికీ ఇప్పుడు విష‌మ ప‌రీక్షేనా?
X

టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో ముగ్గురు మాత్రం ప్ర‌స్తుతం కెరీర్‌లో విష‌మ ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. సినీ నేప‌థ్యం నుంచి వ‌చ్చినా..న‌ట‌వార‌స‌త్వంలో భాగంగా ఇద్ద‌రు హీరోలు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారే కానీ త‌మ ఫ్యామిలీ లెగ‌సీని అనుకున్న స్థాయిలో కంటిన్యూ చేయ‌లేక‌పోతున్నారు. మ‌రో హీరో ప్రొడ‌క్ష‌న్ వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చినా ప్ర‌స్తుతం హీరోగా స్ట్ర‌గుల్‌ని ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఈ ముగ్గురు వేరు వేరుగా త‌మ పంథాకు భిన్న‌మైన క‌థ‌ల‌తో సినిమాలు చేస్తున్నారు. వాటితో మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌ని ఇద్ద‌రు హీరోలు ప్ర‌య‌త్నిస్తుంటే మ‌రో హీరో రీసెంట్‌గా వంద కోట్ల క్ల‌బ్‌లో చేరినా ఆ క్రేజ్‌ని నిల‌బెట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాడు.

ఆ ముగ్గ‌రు హీరోలు మ‌రెవ‌రో కాదు ఒక‌రు మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మ‌రోక‌రు అక్కినేని ఫ్యామిలీ నుంచి అరంగేట్రం చేసిన అక్కినేని నాగ‌చైత‌న్య‌. వీరిద్ద‌రికీ పూర్తి భిన్నంగా ప్రొడ్యూస‌ర్ స్ర‌వంతి ర‌వికిషోర్ క్యాంప‌స్ నుండి వ‌చ్చిన రామ్ పోతినేని. ఈ ముగ్గ‌రు హీరోల్లో అత్య‌ధికంగా రిస్క్‌లో ఉన్న హీరో వ‌రుణ్ తేజ్‌. గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో వ‌రుణ్ కెరీర్ సాగుతూ వ‌స్తోంది. `ఫిదా` త‌రువాత సోలోగా ఏది చేసినా ఫ‌లించ‌డం లేదు. వ‌రుస డిజాస్ట‌ర్లే ఎదుర‌వుతున్నాయి.

దీని నుంచి త‌ప్పించుకుని మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్‌లోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో త‌న రెగ్యుల‌ర్ పంథాకు పూర్తి భిన్నంగా వ‌రుణ్ తేజ్ ఓ హార‌ర్ థ్రిల్ల‌ర్‌ని ఎంచుకున్నాడు. త‌ను న‌టిస్తున్న లేటెస్ట్ హార‌ర్ థ్రిల్ల‌ర్ `కొరియ‌న్ క‌న‌క‌రాజు`. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌కుడు. రితికా నాయ‌క్ హీరోయిన్‌. యువీ క్రియేష‌న్స్‌తో పాటు ఈ మూవీని ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ల‌పై నిర్మిస్తున్నారు. ఓ కొరియ‌న్ థ్రిల్ల‌ర్ ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. స‌మ్మ‌ర్‌లో ఇది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీనిపైనే వ‌రుణ్ తేజ్ ఆశ‌లు పెట్టుకున్నాడు.

`తండేల్‌` వంటి ల‌వ్‌స్టోరీతో ఫ‌స్ట్ టైమ్ రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన నాగ‌చైత‌న్య త‌న త‌దుప‌రి మూవీతో పాన్ ఇండియా వైడ్‌గా అంత‌కు మించి అనే స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఇందులో కోసం త‌ను కూడా త‌న పంథాకు పూర్తి భిన్నంగా సాగే మిస్టిక్ థ్రిల్ల‌ర్‌ని ఎంచుకున్నాడు. `విరూపాక్ష‌` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని ద‌క్కించుకున్న కార్తీక్ దండు దీనికి ద‌ర్శ‌కుడు. ట్రెజ‌ర్ హంట్ నేప‌థ్యంలో సాగే ఈ మూవీలో మీనాక్షీ చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. చైతూ సినిమాల్లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడ‌ట‌.

రీసెంట్‌గా `ఆంధ్రా కింగ్ తాలూకా` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు హీరో రామ్‌. క‌థ‌, క‌థ‌నాలు బాగానే ఉన్నా సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఉపేంద్ర కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ మూవీలో రామ్ ఆయ‌న అభిమానిగా క‌నిపించాడు. సినిమాపై భారీ న‌మ్మ‌కం పెట్టుకుని ఓ పాట కూడా రాసిన రామ్ సినిమా ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయే స‌రికి కొంత డిసప్పాయింట్ అయ్యాడ‌ట‌. ఈ సారి ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాల‌నే ల‌క్ష్యంతో మిస్టిక్ థ్రిల్ల‌ర్ స్టోరీతో ఓ సినిమాకు శ్రీ‌కారం చుడుతున్నాడ‌ట‌. దీంతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్‌లోకి రావాల‌నే రామ్ ప్ర‌య‌త్నం ఫలిస్తుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.