పర్సంటేజ్ సిస్టమ్..థియేటర్లు వెలవెల!
ఈ విధానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తెగేసి చెప్పింది. దీంతో ఇండస్ట్రీలోని నిర్మాతల్లో భారీ చీలిక ఏర్పడింది.
By: Ravindar Gorantla | 21 April 2026 6:00 AM ISTటాలీవుడ్‌లో కొత్త పంచాయితీ మొదలైంది. గత కొన్నేళ్లుగా థియేటర్లు రెంటల్ పద్దతిలో నడుస్తున్నాయి. అయితే ఈ పద్దతికి బ్రేక్ ఇచ్చి పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేస్తున్నారు తెలంగాణలో ఇదే ఇప్పుడు చిలికి చిలికి పెను తుఫానుగా మారి ఇండస్ట్రీకి చరమగీతం పాడేలా కనిపిస్తోందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్ల రాకతో సింగిల్ స్క్రీన్‌లు ప్రమాదంతో పడ్డాయి. వాటిని రక్షించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణలో థియేటర్ రెంటల్ సిస్టమ్ ప్లేస్‌లో ఏప్రిల్ నుంచి పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
అయితే ఇది అనుకున్నంతగా ఫలితాలని అందించకపోగా ఇండస్ట్రీ మనుగడకు పెను సవాల్‌గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి వారం 60 శాతం, రెండవ వారం 50 శాతం, మూడవ వారం 40 శాతం డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబిటర్‌కు పర్సెంటేజ్ ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే పెద్ద సినిమాల నిర్మాతలు దీనిపై ఇప్పటికే విముఖతని వ్యక్తం చేసి పర్సంటేజ్ విధానంలో ఎగ్జిబిటర్లకు డబ్బులు ఇవ్వడం కుదరదని చెప్పేశారు. ప్రధానంగా యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈ విధానాన్ని ఖండించింది.
ఈ విధానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తెగేసి చెప్పింది. దీంతో ఇండస్ట్రీలోని నిర్మాతల్లో భారీ చీలిక ఏర్పడింది. హైదరాబాద్‌లోని ప్రధానమైన 23 థియేటర్లు పర్సంటేజ్ విధానానికి మొగ్గుచూపడంతో అసలు సమస్య మొదలైంది. కారణం ఏంటంటే ఇటీవల విడుదలైన సినిమాల్లో అత్యధిక శాతం పేలవమైన ప్రదర్శనతో నష్టాలని మిగిల్చాయి. అంతే కాకుండా పెట్టిన పెట్టుబడిని కూడా తిరిగి రాబట్టలేకపోయాయి. అక్కడి నుంచే అసలు సమస్య స్టార్ట్ అయింది.
ఈ మధ్య విడుదలైన సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లలో జనం భారీగా కనిపించారు. అయితే సినిమా రిలీజ్ రోజున మాత్రం అందులో సగం జనం కూడా థియేటర్లలో కనిపించకపోవడం అందరిని షాక్ కు గురి చేస్తోంది. ఇంతకు ముందు సినిమా రిలీజైన మూడు లేదా నాలుగు రోజులు థియేటర్లు ప్రేక్షకుల కిటకిటతో కళకళ లాడేవి. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించకపోవడంతో అంతా అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఫస్ట్ డేకే ప్రేక్షకులు థియేటర్లలో కనిపించని పరిస్థితులు ఎదురవుతున్నాయి.
థియేటర్లలో పరిస్థితి ఇలా ఉంటే పర్సంటేజ్ విధానం వల్ల ఎగ్జిబిటర్లకు ఒరుగుతున్నది ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది. పెద్ద సినిమాల నిర్మాతలు పర్సంటేజీ విధానాన్ని వ్యతిరేకిస్తుంటే..చిన్న సినిమాలకు టికెట్‌లు తెగని పరిస్థితులు కనిపిస్తుంటే ఎగ్జిబిటర్లు ఈ పర్సంటేజీ విధానాన్ని ఎందుకు అమలు చేయాలనుకుంటున్నారు? శాశ్వతంగా థియేటర్లని మూయించే పరిస్థితులని తేవాలనుకుంటున్నారా? అదే జరిగితే ఇండస్ట్రీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
