Begin typing your search above and press return to search.

సింగిల్ థియేట‌ర్ల‌పై బాంబ్ వేయ‌బోతున్నారా?

థియేట‌ర్ల‌ను అద్దె విధానంలో లీజుల‌కు కాంట్రాక్టులు కుదుర్చుకోవ‌డం లేదా లాభాల్లో షేరింగ్ విధానంలో న‌డిపించ‌డం అనే రెండు ప‌ద్ధ‌తులు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   12 May 2025 10:32 AM IST
Share-Based Model vs Lease System Sparks Heated Debate in Telugu Film Industry
X

థియేట‌ర్ల‌ను అద్దె విధానంలో లీజుల‌కు కాంట్రాక్టులు కుదుర్చుకోవ‌డం లేదా లాభాల్లో షేరింగ్ విధానంలో న‌డిపించ‌డం అనే రెండు ప‌ద్ధ‌తులు ఉన్నాయి. చాలా కాలంగా లీజు విధానం అమ‌ల్లో ఉంది. అయితే దీనిని షేర్ విధానంలోకి మార్చాల‌ని ప‌లువురు బ‌డా ఎగ్జిబిట‌ర్ల నుంచి రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతున్న‌ట్టు తెలిసింది. డి.సురేష్ బాబు- ఏషియ‌న్ నారంగ్- శిరీష్ వంటి ప్ర‌ముఖుల చేతుల్లోనే ఎక్కువ‌గా థియేట‌ర్లు ఉన్నాయి. వీరంతా ఏక‌మై షేర్ విధానాన్ని అమ‌లు చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు తెలిసింది. నైజాంలో ఈ విధానాన్ని అమ‌లు చేయ‌డం ద్వారా ఆంధ్రాలోను ఒత్తిడి పెంచే వ్యూహం అనుసరిస్తున్న‌ట్టు గుస‌గుస వినిపిస్తోంది.

అయితే మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్ల‌కు ఇప్ప‌టికే షేర్ విధానం అమ‌ల్లో ఉంది. అందువ‌ల్ల మాల్స్ - మ‌ల్టీప్లెక్సుల్లో ఈ స‌మ‌స్య లేదు. కానీ సింగిల్ స్క్రీన్ల విష‌యంలోను అదే విధానాన్ని అమ‌ల్లోకి తేవాల‌నుకోవ‌డమే ఆలోచింప‌జేస్తోంది. ఇది నిర్మాత‌ల‌కు ఎంత‌మాత్రం గిట్టుబాటు కాని వ్య‌వ‌హారం అని విశ్లేషిస్తున్నారు. షేర్ బేసిస్ లో సింగిల్ థియేట‌ర్ల‌ను ఇవ్వ‌డం అనేది కుద‌ర‌ద‌ని వారు ప్ర‌తిఘ‌టిస్తున్నార‌ట‌.

అయితే ఈ కొత్త విధానాన్ని అమ‌లు చేయాల‌నుకోవ‌డానికి ఒక ప్ర‌త్యేక కార‌ణం ఉంద‌ని చెబుతున్నారు. త్వ‌ర‌లోనే బ‌డా బాబుల చేతుల నుంచి సింగిల్ స్క్రీన్లు స్వేచ్ఛ‌గా వోన‌ర్ల చేతికి రానున్నాయి. ఇప్ప‌టికే కుదుర్చుకున్న ఒప్పందాలు ముగిసే స‌మ‌య‌మిది. అందుకే ఇప్పుడు షేరింగ్ విధానం కావాల‌ని అడుగుతున్నార‌ట‌. తిరిగి కాంట్రాక్టులు పున‌రుద్ధ‌రించే ముందే ఈ కొత్త విధానం అనుస‌రించాల‌ని ఒత్తిళ్లు తెస్తున్నార‌ట‌. దీనికి ప‌రిష్కారం కోసం ఛాంబ‌ర్ ఆధ్వ‌ర్వ్యంలో ఈనెల 18న ఒక స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో అన్నిటినీ చ‌ర్చిస్తారు. కానీ ఎగ్జిబిట‌ర్ కం నిర్మాత‌గా ఉన్న దిల్ రాజు ఎలాంటి ప‌రిష్కారం సూచిస్తారో చూడాల‌ని అంతా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఆయ‌న ఎగ్జిబిట‌ర్ల‌కు అండ‌గా నిలుస్తారా? లేక నిర్మాత‌ల‌కు అండ‌గా నిలుస్తారా? అన్నది చ‌ర్చ‌గా మారింది.