Begin typing your search above and press return to search.

ఆ నిర్మాతల పేర్లు బయట పెడతా.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్

ఇప్పుడు థియేటర్స్ బంద్ వివాదంపై తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి, డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్ మాట్లాడగా, ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

By:  Tupaki Desk   |   8 Jun 2025 11:25 AM IST
ఆ నిర్మాతల పేర్లు బయట పెడతా.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇటీవల థియేటర్స్ బంద్ అంశం ఎలాంటి వివాదం రేపిందో అందరికీ తెలిసిందే. జూన్ 1వ తేదీన నుంచి థియేటర్స్ బంద్ అంటూ ప్రకటన రాగా.. ఆ తర్వాత లేదని అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంతలో ఏపీ డిప్యూటీ సాబ్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. తనను వ్యక్తిగతంగా ఎవరూ కలవద్దని తేల్చి చెప్పారు.

ఏం విషయమైనా ఫిల్మ్ ఛాంబర్ ద్వారా రావాలని తెలిపారు. తనకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను అదే విధంగా స్వీకరిస్తానని అన్నారు. అదే సమయంలో పవన్ హరిహర వీరమల్లు రిలీజ్ (ముందుకు అనుకున్న తేదీ) కు ముందే థియేటర్స్ బంద్ అంటూ ఎందుకు ప్రకటన వచ్చిందో విచారణ చేపట్టాలని ఏపీ మంత్రి దుర్గేష్ ఆదేశించారు.

ఆ తర్వాత పలువురు నిర్మాతలు స్పందించారు. ఇప్పుడు థియేటర్స్ బంద్ వివాదంపై తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి, డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్ మాట్లాడగా, ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. థియేటర్స్ బంద్ అంశాన్ని ఇద్దరు దర్శకులు, మరో ఇద్దరు నిర్మాతలు వివాదంగా మార్చారని శ్రీధర్ ఆరోపించారు.

త్వరలోనే వారి పేర్లను బయటపెడతానని, రిటర్న్ గిప్ట్ ఇస్తామని చెప్పారు. థియేటర్ల బంద్‌పై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తరపున ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు కూడా తాము ఎలాంటి లేఖ రాయలేదని తెలిపారు. అదే సమయంలో థియేటర్స్ పరిస్థితి, స్టార్ హీరోల కూడా మాట్లాడారు.

"కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ లో 6 థియేటర్లు మూతపడ్డాయి. 2025లో ఇప్పటి వరకు మూడు సినిమాలు మాత్రం హిట్ అయ్యాయి. అలాగైతే మేము ఎలా బతకాలి? సింగిల్ స్క్రీన్స్ ను అంతా బద్నాం చేస్తున్నారు. కానీ ఒక్కో హీరో సినిమాల మధ్య చాలా గ్యాప్ ఉంటుంది. ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు చేసేవాళ్లు"అని చెప్పారు.

"కానీ ఇప్పుడు ఏడాదికి ఒక్క మూవీ కూడా చేయడం లేదు. ఒక రకంగా థియేటర్స్ అలా అవ్వడానికి కారణం హీరోలు కూడా. హీరోలు రెండేళ్లకు ఒక్కో మూవీ చేస్తే థియేటర్లు ఎలా నడుస్తాయి? మా ఆస్తులు థియేటర్స్. కాబట్టి ఏమైనా చేసుకుంటాం. సింగిల్ స్క్రీన్స్ అయినా మల్టీప్లెక్స్ తరహాలోనే నడిపిస్తున్నాం"అని తెలిపారు.

"ప్రేక్షకుడికి తక్కువ ధరకే సినిమా చూపిస్తున్నాం. 80 రూపాయల్లోనే పాప్ కార్న్, 30 రూపాయలకే కూల్‌ డ్రింక్‌ కూడా అందిస్తున్నాం. కానీ తమను బద్నాం చేస్తున్నారు. హరిహర వీరమల్లు మూవీ వస్తుందని థియేటర్స్ ఖాళీగా వచ్చాం. ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడింది. మరి మా పరిస్థితి ఏంటి" అని శ్రీధర్ ప్రశ్నించారు.

అయితే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ కొత్త కార్యవర్గానికి మూడోసారి అధ్యక్షుడిగా సునీల్ నారంగ్‌, కార్యదర్శిగా శ్రీధర్‌ను ఎన్నికయ్యారు. దీంతో నూతన కార్యవర్గ సభ్యులను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తో పాటు పలువురు నిర్మాతలు, సినీ ప్రతినిధులు సన్మానించారు. ఆ సమయంలో శ్రీధర్.. మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.