2027 సమ్మర్ సీజన్‌పై కన్నేసిన స్టార్ హీరోలు!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మునుపెన్నడు లేని విధంగా ఓ ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది. సాధారణంగా స్టార్స్ అంతా సంక్రాంతి , దసరా సీజన్లను మాత్రమే టార్గెట్ చేస్తుంటారు.
By: Srikanth Kontham | 23 April 2026 10:47 PM ISTటాలీవుడ్ ఇండస్ట్రీలో మునుపెన్నడు లేని విధంగా ఓ ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది. సాధారణంగా స్టార్స్ అంతా సంక్రాంతి , దసరా సీజన్లను మాత్రమే టార్గెట్ చేస్తుంటారు. ఆరెండు సీజన్లు రిలీజ్ కు సరైన సమయంగా భావించి కొత్త చిత్రాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈనేపథ్యంలో ముండే రిలీజ్ తేదీల్ని ఆ సీజన్లలో లాక్ చేస్తుంటారు. ఇప్పటి వరకూ అదే సన్నివేశం కనిపించింది. అయితే ఈసారి ఏడాదిన్నర ముందే 2027 వేసవి కాలాన్ని లాక్ చేస్తుండటం విశేషం. పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ మార్కెట్‌పై కన్నేసిన హీరోలు ప్రేక్షకులకు ఓ అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
2027 సమ్మర్ హాలిడేస్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో భారీ బడ్జెట్ సినిమాలు క్యూ కడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద పోరు రసవత్తరంగా మారేలా ఉంది. ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న `స్పిరిట్` చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. `యానిమల్` వంటి సంచలనం తర్వాత వంగా చేస్తోన్న సినిమా కావడం అందులోనూ ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండటంతో 2027 సమ్మర్ సీజన్‌కు సరైన ఆరంభమే.
అలాగే సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియాలో `వారణాసి` ఎలాంటి అంచనాలతో రూపొందుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ గ్లోబల్ అడ్వెంచర్ కూడా వేసవి రేసులో నిలిచింది. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హాలీవుడ్ స్థాయి మేకింగ్ , విజువల్స్ ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టకోనుంది. ఏప్రిల్ నెల సెలవుల సీజన్‌ను ఈ సినిమా ఖాతాలో వేసుకునే అవకాశం మెండుగా కనిపిస్తోంది. అలాగే మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే కాంబినేషన్ జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా కూడా డేట్‌ను ఖరారు చేసుకుంది.
ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను జూన్ 11, 2027న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. `సలార్` , `దేవర` లాంటి విజయాల తర్వాత వీరిద్దరి కలయికలో రిలీజ్ అవుతోన్న సినిమా కావడంతో సమ్మర్ ముగింపులో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయంగా అభిమానులు భావిస్తున్నారు. జూన్ నెలలో ఇంత పెద్ద సినిమా రావడం ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్సీ 17 పైనే అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. `రంగస్థలం` వంటి క్లాసిక్ తర్వాత ఇద్దరు మళ్ళీ కలుస్తుండటంతో ఎలాంటి కథతో వస్తున్నారు? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను కూడా 2027 సమ్మర్ టార్గెట్ గా ప్లాన్ చేస్తున్నారా? అన్న చర్చ ఇప్పటికే మొదలైంది. `పెద్ది` హిట్ అయితే పాన్ ఇండియాలో రామ్ చరణ్ మార్కెట్ మరింత సుస్తిరం కానుంది. దీంతో అటుపై రిలీజ్ అయ్యే సినిమా బాక్సాఫీస్ టార్గెట్ 2000 కోట్లకు పైగానే ఉంటుందన్ బజ్ అప్పుడే మొదలైపోయింది. ఇంకా ఈ సమ్మర్ రేసులో చాలా చిత్రాలు నిలిచే అవకాశం ఉంది.
