Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో సమ్మె.. ఆ మూవీ కోసమే చిరు ఎంట్రీ ఇచ్చారా?

అదే సమయంలో ఫిలిం ఛాంబర్.. ఫిలిం ఫెడరేషన్ కు లేఖ పంపింది. నాలుగు ప్రతిపాదనలు పంపింది.

By:  Tupaki Desk   |   19 Aug 2025 12:24 AM IST
టాలీవుడ్ లో సమ్మె.. ఆ మూవీ కోసమే చిరు ఎంట్రీ ఇచ్చారా?
X

టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె మొదలై రెండు వారాలు అయిపోయింది. ఇప్పుడు 15వ రోజుకు చేరింది. ఫిలిం ఫెడరేషన్ సభ్యులు, కార్మిక సంఘాల నేతలు, నిర్మాతలు మధ్య చర్చలు జరుగుతున్నా.. సఫలం కావడం లేదు. దీంతో సమ్మె కొనసాగుతూనే ఉంది. అన్ని సినిమాలు, వెబ్ సిరీసుల షూటింగ్స్ నిలిచిపోయాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉంది పరిస్థితి. దీంతో కొత్త చిత్రాల విడుదల తేదీలపై అందరి దృష్టి పడింది. వివిధ సినిమాల రిలీజ్ డేట్స్ వాయిదా పడతాయని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం షూటింగ్స్ నిర్వహిస్తున్న మేకర్స్ కు సమ్మె అడ్డుపడింది. అందుకే ఏం జరుగుతుందోనని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరోల చిత్రాల సంగతేంటోనని మాట్లాడుకుంటున్నారు. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి వద్దకు సమ్మె పంచాయతీ చేరిన విషయం తెలిసిందే. ఆదివారం నిర్మాతలతోపాటు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు, కార్మిక సంఘాల నేతలతో వేర్వేరుగా సమావేశమవుతారని సమాచారం అందింది.

దీంతో సమ్మె కొలిక్కి వస్తుందని.. సోమవారం షూటింగ్స్ మొదలవుతాయని అంతా అనుకున్నారు. దాదాపు అందరూ ఫిక్స్ కూడా అయిపోయారు. కానీ అలా ఏం జరగలేదు. ఇరువర్గాలకు ఆమోద మయ్యే నిర్ణయాలు కూడా వెలువడలేదు. దాంతోపాటు చిరంజీవిని కలిసి పెద్ద నిర్మాతల్లో సి కళ్యాణ్ తప్ప బడా ప్రొడ్యూసర్లు లేరు. చిన్న నిర్మాతలంతా నట్టి కుమార్ ఆధ్వర్యంలో చిరు కలిశారు. చిరంజీవి సమ్మె సమస్యలు పరిష్కరించబోతున్నారని చెప్పారు. అయినా ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు రాలేదు.

అదే సమయంలో ఫిలిం ఛాంబర్.. ఫిలిం ఫెడరేషన్ కు లేఖ పంపింది. నాలుగు ప్రతిపాదనలు పంపింది. వాటికి ఓకే అయితే.. నిర్మాతలు వేతనాలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నారని ఫెడరేషన్ కు ఛాంబర్ తెలిపింది. కానీ ఫెడరేషన్ నుంచి ఎలాంటి స్పందన ఇప్పటి వరకు రాలేదు. మొత్తానికి టాలీవుడ్ లో కార్మికుల సమ్మె మరింత జటిలమవుతుందనే చెప్పాలి. ఎవరి సమస్యలు వాళ్లవి.. కానీ ఎవరూ తగ్గకపోవడంతో సమ్మె కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో ఏ సమ్మె జరిగినా.. ఫిలిం ఛాంబర్ కీలక పాత్ర పోషించేది. ఫెడరేషన్ నాయకులతో సంప్రదింపులు జరిపేది. కానీ ఇప్పుడు లేఖ పంపినా.. క్లారిటీ మాత్రం లేదు. ఓవైపు ఛాంబర్ లేఖ పంపగా.. మరోవైపు చిరు ఇలాకాలో సమ్మె ఇష్యూ ఉంది.

అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున దిల్ రాజు.. ఇష్యూపై అందరితో మాట్లాడతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు దిల్ రాజు సైలెంట్ గా ఉన్నారు. ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని ప్రచారం జరుగుతోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను పరిష్కరించే విషయం చిరంజీవికి చేరిందని టాక్ వినిపిస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం.. సమ్మె విషయంలో తనను ఎవరూ కలవలేదని సోషల్ మీడియాలో తెలిపారు. 30 శాతం వేతనాల పెంపుపై తానేం హామీ ఇవ్వలేదని చెబుతూ.. జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఛాంబర్ దే తుది నిర్ణయం అన్నట్లు తెలిపారు. కానీ ఇప్పుడు ఆయన వద్దకు పంచాయతీ చేరడం గమనార్హం. ఇప్పుడు ఆ విషయంపై సోషల్ మీడియాలో మరో వార్త చక్కర్లు కొడుతోంది.

చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో వర్క్ చేస్తున్నారు. ఆ సినిమాకు మెగాస్టార్ కుమార్తె సుస్మిత నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు. దీంతో అందుకు తగ్గట్లే మేకర్స్ షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు షెడ్యూళ్లు కూడా పూర్తి చేశారు. కానీ ఇప్పుడు సమ్మె వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో సంక్రాంతికి రిలీజ్ అవుతుందో లేదోనని డిస్కషన్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికే సినిమా రిలీజ్ చేయాలని డైరెక్టర్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. లేకుంటే నష్టం వస్తుందని ఆయన చెబుతున్నారట. అందుకే పక్క స్టేట్స్ కు వెళ్లి షూటింగ్ చేద్దామని ఐడియా ఇచ్చారట.

అయితే చిరు మాత్రం దానికి నో చెప్పారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అందుకే సమ్మె పరిష్కరించడమే ఇప్పుడు రంగంలోకి దిగారని తెలుస్తోంది. తన సినిమా షూటింగ్‌ దెబ్బతినకుండా చూసుకోవటానికి మెగాస్టార్ ఎంట్రీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమో కాదో తెలియక పోయినా సోషల్ మీడియా డిస్కస్ చేసుకుంటున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.