Begin typing your search above and press return to search.

వీళ్లు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లేది ఎప్పుడో?

ఈ హీరోలంతా నెక్ట్స్ లెవెల్ సినిమాల‌తో సిద్ధ‌మ‌వుతుంటే మ‌న టైర్ 2 హీరోలు మాత్రం ఆవైపు అడుగులు వేయ‌డానికి ఆలోచిస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 April 2025 7:00 PM IST
వీళ్లు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లేది ఎప్పుడో?
X

ప్ర‌భాస్ -రాజ‌మౌళిల క‌ల‌యిక‌లో వ‌చ్చిన `బాహుబ‌లి` సిరీస్ వ‌ల్ల తెలుగు సినిమా స్వ‌రూప‌మే మారిపోయింది. మార్కెట్ స్థాయికి కూడా భారీగా పెర‌గ‌డం, చిన్న హీరోలకు కూడా మంచి డిమాండ్ ఏర్ప‌డ‌టంతో మ‌న హీరోల్లో చాలా మంది పాన్ ఇండియా సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టారు. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌, నాని, నిఖిల్ లాంటి హీరోలు ఇప్ప‌టికే పాన్ ఇండియా సినిమాల‌తో ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా ప్ర‌స్తుతం అవే సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

రామ్ చ‌ర‌ణ్ `ఉప్పెన‌` డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సాన‌తో పాన్ ఇండియా ఫిల్మ్ `పెద్ది` చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ `దేవ‌ర‌` సీక్వెల్‌తో పాటు బాలీవుడ్‌లో `వార్ 2`తో పాటు ప్ర‌శాంత్ నీల్ ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు. వీరి బాట‌లోనే నేచుర‌ల్ స్టార్ నాని `హిట్ 3`, ది ప్యార‌డైజ్ సినిమాల‌తో రెడీ అయిపోతున్నాడు. ఇక యంగ్ హీరో నిఖిల్ `స్వ‌యంభు`, `ది ఇండియా హౌస్‌` సినిమాల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భాస్ ఇప్ప‌టికే `ది రాజా సాబ్‌`, క‌ల్కి 2, స‌లార్ 2తో పాటు హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్ష‌న్‌లో `ఫౌజీ` మూవీ చేస్తున్నాడు.

ఈ హీరోలంతా నెక్ట్స్ లెవెల్ సినిమాల‌తో సిద్ధ‌మ‌వుతుంటే మ‌న టైర్ 2 హీరోలు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నితిన్‌, రామ్‌, శ‌ర్వానంద్‌,గోపీచంద్‌, రానా, విశ్వ‌క్‌సేన్ మాత్రం ఆవైపు అడుగులు వేయ‌డానికి ఆలోచిస్తున్నారు. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ మాత్రం ఓ అడుగు ముందే ఉన్నాడు. గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ష‌న్‌లో `కింగ్‌డ‌మ్‌` పేరుతో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉంది. `లైగ‌ర్‌` త‌రువాత పూర్తిగా సైలెంట్ అయిపోయిన విజ‌య్ ఈ సినిమాతో త‌న స‌త్తా చాటాల‌ని తిరిగి రేసులోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు.

ఇప్ప‌టికే విడుద‌లైన `కింగ్‌డ‌మ్‌` టీజ‌ర్ అంచ‌నాల్ని పెంచేసింది. ఈ మూవీని మే 30న రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే మెగా ప్రిన్స్‌గా పేరు తెచ్చుకున్న వ‌రుణ్ తేజ్ పాన్ ఇండియా క‌ల క‌ల‌గానే మిగిలిపోతోంది. ఆప‌రేష‌న్ వాలెంటైన్‌`, మ‌ట్కా సినిమాల‌పై ఆశ‌లు పెట్టుకున్నా నిరాశే ఎదురైంది. ప్ర‌స్తుతం ఓ హార‌ర్ థ్రిల్ల‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇదేనా వ‌రుణ్‌ని క‌రుణించాల‌ని మెగా ఫ్యాన్స్ ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఇక నితిన్ కు కూడా పాన్ ఇండియా క‌ల‌గానే మిగులుతోంది.

నిఖిత్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నా నితిన్ మాత్రం ఆ ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోతున్నాడు. దానికి కార‌ణం ఆశించిన స్థాయిలో త‌ను న‌టించిన సినిమాలు ఆడ‌క‌పోవ‌మే. ఇక ఇదే జాబితాలో శ‌ర్వానంద్ కూడా నిలుస్తూ పాన్ ఇండియా రేసులో ఇప్ప‌టికీ వెన‌క‌బ‌డే ఉన్నాడు. రామ్‌, గోపీచంద్‌, విశ్వ‌క్‌సేన్ లు కూడా నెక్స్ట్ లెవెల్ సినిమాల కోసం ప్ర‌య‌త్నించి చేతులు కాల్చుకున్న‌వారే. వీళ్లు నెక్స్ట్ లెవెల్ సినిమాలు ఎప్పుడు చేస్తారో వేచి చూడాల్సిందే.