Begin typing your search above and press return to search.

నాగార్జున స‌క్సెస‌య్యారు.. మ‌హేష్‌కి ఆ ఛాన్సుందా?

ఇప్పుడు తన అన్న ర‌మేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని కోసం మహేష్ బాబు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది ఆసక్తికరంగా మారింది.

By:  Sivaji Kontham   |   14 July 2026 8:00 PM IST
నాగార్జున స‌క్సెస‌య్యారు.. మ‌హేష్‌కి ఆ ఛాన్సుందా?
X

టాలీవుడ్‌లో నటవారసుల గురించి ఎప్పుడూ ఆసక్తికర చ‌ర్చ సాగుతూనే ఉంటుంది. అయితే వారికి సరైన మార్గదర్శకత్వం అందించి నిలబెట్టడం వెనుక సీనియర్ హీరోల కృషి ఎంతో అవసరం. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇద్దరు నయా వారసులను వెన్నంటి నడిపిస్తూ.. వారి కెరీర్‌ను గాడిలో పెట్టే బాధ్యతను ఇద్దరు టాప్ స్టార్లు తమ భుజాన వేసుకున్నారు. అందులో ఒకరు కింగ్ నాగార్జున కాగా.. మరొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. అఖిల్ అక్కినేని 'లెనిన్' విషయంలో నాగార్జున అనుసరించిన వ్యూహం విజయవంతం కాగా.... ఇప్పుడు తన అన్న ర‌మేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని కోసం మహేష్ బాబు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది ఆసక్తికరంగా మారింది.

అఖిల్ అక్కినేని కెరీర్‌ను మలుపు తిప్పిన `లెనిన్` వెన‌క నాగార్జున కృషి ఎంతో దాగి ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ సెలెక్షన్ దగ్గర నుండి మేకింగ్, ప్రమోషన్స్ వరకు ప్రతి విభాగంలోనూ తండ్రి నాగార్జున ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సినిమా అవుట్‌పుట్‌ విషయంలో నాగార్జున ఇన్వాల్వ్‌మెంట్ అఖిల్‌కు ఒక నమ్మకాన్ని ఇచ్చింది. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను మెప్పించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సాధించింది. దీంతో తన కొడుకు అఖిల్ విషయంలో నాగార్జున చేసిన ప్రయత్నం వంద శాతం విజయవంతమైందని చెప్పవచ్చు.

ఇదే తరహాలో ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తున్న 'శ్రీనివాస మంగాపురం' సినిమాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యతను మహేష్ భుజాన వేసుకున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ అద్భుతంగా ఉందంటూ లవ్- హార్ట్ ఎమోజీలతో ట్వీట్ చేసి చిత్ర బృందంలో జోష్ నింపారు. ద‌ర్శ‌కుడు అజయ్ భూపతి కూడా వేదికలపై ఈ సినిమా కంటెంట్‌పై ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న జయకృష్ణ ఈ చిత్రంలోని భారీ యాక్షన్ సీన్స్‌లోనూ అదరగొట్టాడని టాక్ నడుస్తోంది.

కథాంశాల విషయానికి వస్తే.. 'లెనిన్', 'శ్రీనివాస మంగాపురం' రెండు చిత్రాలు ప్రేమ, యాక్షన్ కలగలిపిన కథలైనప్పటికీ వీటి నేపథ్యం , ఎమోష‌న‌ల్ డెప్త్ చాలా విభిన్నంగా ఉన్నాయి. `లెనిన్` చిత్రం రాయలసీమ ముఠా గొడవలు, కుటుంబ వైరాగ్యాలు, పొలిటికల్ ఫ్రిక్షన్ మధ్య సాగే ఒక అనాథ పోరాటం. ఇందులో లవ్ ట్రాక్ కంటే హీరో లెగసీని కాపాడుకునే క్రమంలో జరిగే ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇదొక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా.

మరోవైపు 'శ్రీనివాస మంగాపురం' పూర్తిగా తిరుపతి పరిసర ప్రాంతాల నేపథ్యంలో సాగే ఒక పవిత్రమైన.., అదే సమయంలో అత్యంత ఉద్వేగభరితమైన ప్రేమకథ. వాసు బాబు, మంగ అనే ఇద్దరు స్నేహితులు ప్రేమికులుగా మారడం.. వారి సంతోషకరమైన జీవితంలోకి వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు) రూపంలో ఒక బలమైన శత్రువు రావడం వంటి అంశాలతో ఈ కథ సాగుతుంది. తన ప్రేమ కోసం ఊరు విడిచి పోకుండా నిలబడి పోరాడే కథానాయకుడి ప్రయాణం ఇందులో హైలైట్ కానుంది. ఓవరాల్‌గా 'లెనిన్' రాయలసీమ గరుకుదనాన్ని చూపిస్తే... 'శ్రీనివాస మంగాపురం' తిరుపతి టెంపుల్ టౌన్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ యాక్షన్‌తో అల‌రించ‌నుంది. మరి నాగార్జున సాధించిన ఈ వారసుడి సక్సెస్ ఫార్ములాను జయకృష్ణ కోసం మహేష్ బాబు కూడా రిపీట్ చేయగలరో లేదో జూలై 30న విడుదల కాబోతున్న సినిమా ఫలితాన్ని బట్టి తేలిపోనుంది.