ఆ సాంగ్స్ చేయనున్న స్పెషల్ భామలెవరో
ఇండియన్ సినిమాలో సాంగ్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులోనూ స్పెషల్ సాంగ్స్ కు ఇంకాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
By: Tupaki Desk | 30 Jun 2025 6:00 PM ISTఇండియన్ సినిమాలో సాంగ్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులోనూ స్పెషల్ సాంగ్స్ కు ఇంకాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. స్టార్ హీరోల సినిమాల్లో ఈ స్పెషల్ సాంగ్స్ ను భారీ ఖర్చు పెట్టి మరీ తెరకెక్కిస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో సెట్స్ పై పలు భారీ సినిమాలుండగా, వాటిలో ఐటెం సాంగ్స్ చోటు చేసుకున్నాయి. త్వరలోనే ఆ సాంగ్స్ ను మేకర్స్ షూట్ చేయనున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో సెట్స్ పై ఉన్న విశ్వంభర, డ్రాగన్, ది రాజాసాబ్, అఖండ2 సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఉండగా, వాటిని మేకర్స్ త్వరలోనే షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా ఇప్పటికే రిలీజవాల్సింది కానీ వీఎఫ్ఎక్స్ కారణంగా రిలీజ్ లేటైంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండగా ఆ సాంగ్ కు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నట్టు తెలుస్తోంది. విశ్వంభర సినిమా మొత్తానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఈ స్పెషల్ సాంగ్ కోసం మాత్రం భీమ్స్ ను రంగంలోకి దించారు మేకర్స్. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో చిరూతో కలిసి ఎవరు కాలు కదపనున్నారనేది మాత్రం ఇంకా తెలీలేదు. కన్నడ నటి నిష్విక నాయుడుతో పాటూ మరో ఇద్దరు పేర్లు ప్రచారంలో ఉండగా, త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్సుంది. ఈ స్పెషల్ సాంగ్ ను కూడా పూర్త చేశాక విశ్వంభర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాలని చూస్తున్నారట మేకర్స్.
ఇక ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉందని సమాచారం. ముందుగా ఈ స్పెషల్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ హిట్ సాంగ్ ను రీమేక్ చేద్దామనుకున్నారట కానీ తర్వాత వద్దని కొత్త సాంగ్ తోనే ముందుకెళ్తున్నారని తెలుస్తోంది. గతంలో ఈ స్పెషల్ సాంగ్ కోసం నయనతారను అనుకున్నారు కానీ షూటింగ్ లేటవడంతో అన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఈ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారట. అయితే ఆ హీరోయిన్ ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు.
అఖండకు సీక్వెల్ గా వస్తోన్న అఖండ2లో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉందని అంటున్నారు. బోయపాటి ఈ సాంగ్ ను చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారని తెలుస్తోంది. అయితే ఈ స్పెషల్ సాంగ్ తో బాలయ్యతో కలిసి డ్యాన్స్ చేయనున్న భామ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ అవలేదు. వచ్చే నెల నుంచి సాంగ్స్ షూటింగ్ జరగనుండగా, సెప్టెంబర్ 25న అఖండ2 ప్రేక్షకుల ముందుకు రానుంది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉందని సమాచారం. మామూలుగా అయితే ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు తన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ను పెట్టలేదు. కానీ ఈసారి ఎన్టీఆర్ డ్యాన్స్ ను, మాస్ లో అతని క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ ను రష్మిక లేదా కేతిక శర్మలో ఎవరో ఒకరితో చేయించాలని చూస్తున్నారట. మొత్తానికి టాలీవుడ్ లో సెట్స్ పై ఉన్న భారీ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కన్ఫర్మ్ అయినప్పటికీ ఆ సాంగ్స్ లో నటించే భామలు మాత్రం ఇంకా ఫైనల్ అవకపోవడం విశేషం.
