సంక్రాంతికి ఏడాది ముందే చర్చలా? నష్టాలు వచ్చినా అదే తీరా?
ఆ సమయంలో తమ సినిమాలు రిలీజ్ చేయాలని అటు హీరోలు ఇటు మేకర్స్ పోటీ పడుతుంటారు. కొన్ని రోజుల ముందు నుంచే రిలీజ్ డేట్స్ కోసం కర్చీఫులు వేస్తుంటారు.
By: Tupaki Desk | 18 Jan 2026 11:38 AM ISTసంక్రాంతి.. టాలీవుడ్ కు పెద్ద పండుగ అన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తమ సినిమాలు రిలీజ్ చేయాలని అటు హీరోలు ఇటు మేకర్స్ పోటీ పడుతుంటారు. కొన్ని రోజుల ముందు నుంచే రిలీజ్ డేట్స్ కోసం కర్చీఫులు వేస్తుంటారు. అలా ఏటా వివిధ సినిమాలు థియేటర్స్ లో విడుదలవుతుంటాయి. ఈసారి సంక్రాంతికి కూడా ఐదు తెలుగు స్ట్రయిట్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి.
అయితే సంక్రాంతి విండోలో ఎప్పుడైనా మూడు లేదా నాలుగు చిత్రాలకు స్కోప్ ఉంటుంది. కానీ అంతకు మించి విడుదలైతే అన్నీ ఇన్నీ పాట్లు కావు. థియేటర్స్ విషయంలో కచ్చితంగా ఇబ్బంది వస్తుంది. దీంతో సినిమాల్లో కంటెంట్ ఉన్నా.. స్క్రీన్స్ అనుకున్న స్థాయిలో దొరక్కపోవడం వల్ల.. అంచనా వేసిన వసూళ్లు రావు. అది అందరికీ తెలిసిన విషయమే.
ఈసారి పొంగల్ కు అదే సినీ రిపీట్ అయింది. ఐదుగురు హీరోలు ఒకేసారి రావడంతో.. కొందరి చిత్రాలకు థియేటర్స్ అనుకున్న విధంగా దొరకలేదు. దీంతో కచ్చితంగా ఆయా సినిమాల నిర్మాతలకు దాని వల్ల నష్టం వాటిల్లుతుంది. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా కూడా మారింది. అంత పోటీ మధ్య రిలీజ్ చేయడం కన్నా.. తర్వాత విడుదల చేసి ఉంటే బాగుండేదని అనేక మంది అభిప్రాయం.
అయితే ఈ ఏడాది సంక్రాంతి సీజన్ కంప్లీట్ కూడా అవ్వలేదు.. అప్పుడే వచ్చి ఏడాది పొంగల్ సీజన్ కు పోటీ స్టార్ట్ అయింది. సంవత్సరం ముందే చర్చ ప్రారంభమైంది. ఈసారి నష్టం వాటిల్లిన విషయం తెలిసినా కూడా అప్పుడే మళ్లీ ఆరుగురు నిర్మాతలు తమ సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అందులో కొందరు ఇంకా షూటింగ్స్ కూడా స్టార్ట్ చేయకపోవడం గమనార్హం.
వచ్చే ఏడాది సంక్రాంతికి పోటీ పడుతున్నట్టు టాక్ వినిపిస్తున్న సినిమాలు ఇవే, చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 158, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న తేజ సజ్జా చిత్రం, శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న శర్వానంద్ చిత్రం, కమల్ హాసన్ నిర్మిస్తున్న రజనీకాంత్ తలైవర్ 173, వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబోలో రాబోయే చిత్రం, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఒక మూవీ.
అలా ఇప్పటికే లిస్ట్ లో ఆరు సినిమాలు చేరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకేసారి అన్ని సినిమాలు అంటే అసలు వర్కౌట్ అయ్యే విషయం కాదు. ఏడాది పొడవునా విడుదల చేయకుండా.. అంతా సంక్రాంతి సీజన్ నే క్యాష్ చేయాలనుకుంటున్నారని నెటిజన్లు అంటున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికి గందరగోళం ఏర్పడినా కూడా అదే తీరా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
