APలో 'టాలీవుడ్'ని అభివృద్ధి చేయాలి: బాలకృష్ణ
ఇలాంటి సమయంలోనే ఐటి రంగం, పరిశ్రమల ఏర్పాటు, ఎగుమతి దిగుమతుల ప్రోత్సాహంతో పాటు, కళా రంగంపైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించనుంది.
By: Tupaki Desk | 31 Aug 2025 4:26 PM ISTఆంధ్రప్రదేశ్- తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ (టాలీవుడ్) ఆంధ్రప్రదేశ్ కి తరలి వెళ్లిపోతుందని ప్రచారం సాగింది. కానీ తెలంగాణ ప్రభుత్వాల సానుకూలత కారణంగా హైదరాబాద్ నుంచి పరిశ్రమ ఎటూ తరలి వెళ్లలేదు. అదే సమయంలో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌లో ఇతర పరిశ్రమల ఏర్పాటు కూడా కష్టసాధ్యంగా మారింది. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణం, విశాఖ సమీపంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాలు శరవేగంగా పూర్తవుతుండడం ఏపీకి ఆశావహ ధృక్పథాన్ని పెంచుతోంది. రానున్న మూడేళ్లలో మెజారిటీ నిర్మాణాలు పూర్తయితే, ఏపీకి స్థిరమైన రాజధాని, విమానాశ్రయ కనెక్టివిటీ ఉంటుందన్న చర్చ సాగుతోంది.
ఇలాంటి సమయంలోనే ఐటి రంగం, పరిశ్రమల ఏర్పాటు, ఎగుమతి దిగుమతుల ప్రోత్సాహంతో పాటు, కళా రంగంపైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కొత్త టాలీవుడ్ (సినీపరిశ్రమ) అభివృద్ధి కోసం సినీ పెద్దలతో భారీ సమావేశంలో చర్చోపచర్చలు సాగిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. మరో రెండు మూడు నెలల్లో ఇది సాధ్యమవుతుందని కూడా వెల్లడించారు. చర్చా సమావేశాల కోసం ఏపీ-ఎఫ్‌డిసి కూడా సన్నాహకాల్లో ఉందని తెలిసింది.
ఇప్పుడు ముఖ్యమంత్రి సీఎన్‌బి వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన మనసులోని మాటను బయటపెట్టారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ -యుకే ఆధ్యర్యంలో జరిగిన సన్మాన సభలో బాలకృష్ణ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఫిలింఇండస్ట్రీని డెవలప్ చేయాల్సి ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సహజ సౌందర్యాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణలోను అద్బుతమైన లొకేషన్లు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేయాలి. అలాగే ఏపీలోను ఉద్యోగ కల్పన కూడా అవసరం.. అందువల్ల కొత్త పరిశ్రమ అభివృద్ధి చెందాల్సి ఉందని బాలయ్య బాబు అభిప్రాయపడ్డారు.
కొత్త సినీపరిశ్రమ గురించి మనసులో మాటను చెప్పిన బాలయ్య బాబు, ``ఒకరికి లాభం ఒకరికి నష్టం వస్తుందని కాదు`` అంటూ ఈ వేదికపై తెలంగాణ మంత్రుల ముందు వివరణ ఇవ్వడం చర్చకు దారి తీసింది. తెలుగు చిత్రసీమ హైదరాబాద్ నుంచి కదిలి వెళితే తెలంగాణ రాష్ట్రానికి ఆ మేరకు నష్టం తప్పదు. దాదాపు 1800-2500 కోట్ల మేర రెవెన్యూ రకరకాల పన్నుల రూపేణా ప్రతియేటా టాలీవుడ్ నుంచి ప్రభుత్వానికి అందుతుందని ఒక అంచనా. ఆ మేరకు పరిశ్రమ వైజాగ్ లేదా అమరావతికి షిఫ్టయితే పన్నుల ఆదాయంతో పాటు రకరకాల మార్గాలలో ఏపీకి ఆదాయం పెరుగుతుంది. బహుశా ఇదే విషయమై ఆలోచిస్తే, అంత పెద్ద వేదికపై తెలంగాణ మంత్రుల సమక్షంలో ఇలాంటి ప్రకటన ఇబ్బందికరం అని భావించారో ఏమో కానీ, బాలయ్య కొంత తడబాటుగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఇక్కడ మరో ఆసక్తికర విషయం గమనించాల్సినది ఏమంటే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విరోచిత పోరాటం సాగించిన తెరాస అధినాయకులు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖకు టాలీవుడ్ తరలి వెళ్లిపోతుందని బలంగా నమ్మారు. దానిని వేదికలపై కూడా ప్రకటించారు. కానీ రకరకాల కారణాలతో మరో కొత్త టాలీవుడ్ ఏర్పాటుపై నాటి సీఎన్‌బి ప్రభుత్వం దృష్టి సారించలేకపోయింది. రెండు ప్రభుత్వాలు మారినా ఏపీలో టాలీవుడ్ నిర్మాణానికి తొలి అడుగు పడలేదు. కానీ సినీరాజకీయ పెద్దల మనసులో ఆలోచన ఉంది. ఇది ప్రత్యక్షంగా కార్యరూపం ఎప్పటికి దాలుస్తుందో ప్రస్తుతానికి సస్పెన్స్!!!
