Begin typing your search above and press return to search.

2025: రాబోయే సినిమలైనా కిక్కిచ్చేనా..?

ఈ స్థితిలో నేటి నుండి మొదలుకానున్న సెకండాఫ్‌పై ఎగ్జిబిటర్లు, ట్రేడ్ వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   1 July 2025 10:45 AM IST
2025: రాబోయే సినిమలైనా కిక్కిచ్చేనా..?
X

తెలుగు చిత్రసీమలో ఈ ఏడాది మొదటి ఆరు నెలలు బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్స్ ఏమి రాలేదు. కొన్ని మాత్రమే ఓ మోస్తరుగా మంచి కలెక్షన్స్ అందుకోగా డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ వివాదాలతో ఇండస్ట్రీలో ఊహించని సమస్యలు ఎదురయ్యాయి. ఇక కొన్ని అంచనాలు మించి ఆకట్టుకున్నా… చాలా సినిమాలు నిరాశనే మిగిల్చాయి. పెద్ద సినిమాలెక్కడ? ఫెస్టివల్ సీజన్ అసలు ఏమీ తీసుకురాలేదన్న చర్చ నడిచింది. కానీ ఇప్పుడు టాలీవుడ్‌ ఫుల్ ఫోకస్ మొత్తం రెండో భాగంపైనే ఉంది. ఎందుకంటే నిజమైన బాక్సాఫీస్ గేమ్ ఇప్పుడు మొదలుకానుంది.

జనవరిలో సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. ఫిబ్రవరిలో మాత్రం తండేల్ ఒక్కటే నిలిచింది. మార్చిలో కోర్ట్ మరియు మ్యాడ్ స్క్వేర్ ఆకట్టుకున్నా.. మిగతా సినిమాలన్నీ ఆవిరయ్యాయి. ఏప్రిల్‌లో హిట్ ఏదీ లేదు. మే నెలలో హిట్ 3: ది థర్డ్ కేస్, సింగిల్ సినిమాలు ఓ మోస్తరుగా నిలిచాయి. జూన్‌లో మాత్రం కుబేర కన్నప్ప సినిమాలు ఓ రేంజ్‌లో కలెక్షన్ల దూకుడు చూపించాయి.

అయితే ఫస్ట్ హాఫ్‌లో పెద్ద సినిమాలు తక్కువగా ఉండడం గమనార్హం. ప్రేక్షకులు ఎదురుచూస్తున్న భారీ సినిమాలు ఒక్కటి కూడా గత ఆరు నెలల్లో రాలేదు. ఈ స్థితిలో నేటి నుండి మొదలుకానున్న సెకండాఫ్‌పై ఎగ్జిబిటర్లు, ట్రేడ్ వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే భారీ స్టార్లతో రూపొందుతున్న పలు పాన్ ఇండియా చిత్రాలు జూలై నుంచి విడుదలకు సిద్ధమవుతున్నాయి.

హరి హర వీర మల్లు సినిమాను జూలై 24న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ మూవీ జూలైలో విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఉండగా.. ఇప్పుడు అది ఆగస్టుకు మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, నితిన్ - వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో వస్తున్న తమ్ముడు సినిమా జూలై 4న విడుదల కానుంది.

ఈ సినిమాలతో పాటు.. OG, అఖండ 2, మిరాయ్, విశ్వంభర, ద రాజా సాబ్ లాంటి భారీ చిత్రాలు కూడా రెండో భాగంలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో కొన్ని చారిత్రక అంశాలతో, మరికొన్ని పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్లుగా ఉండడం విశేషం. ప్రేక్షకులు ఇప్పటికే ఈ సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. పోస్టర్లు, టీజర్‌లు కూడా హైప్‌ను పెంచుతున్నాయి.

ఇక మొత్తంగా చూస్తే.. టాలీవుడ్‌కు 2025లో నిజమైన పరీక్ష ఇప్పుడు మొదలవుతోంది. మొదటి ఆరు నెలలు నిదానంగా సాగినా.. రెండో భాగం దూసుకెళ్తుందని ఆశిస్తున్నారు. వాస్తవానికి ఇండస్ట్రీ ఉత్సాహంగా ఉండాలంటే.. ఒక్కటి కాదు, వరుస విజయాలు అవసరం. అందుకు అవసరమైన కంటెంట్ ఈ రెండో భాగంలో కనిపిస్తోంది. మరి ఈసారి టాలీవుడ్ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.