Begin typing your search above and press return to search.

టాలీవుడ్ రెమ్యునరేషన్ వార్.. ఐదుగురు తప్ప మిగతా వాళ్లకి కష్టమేనా?

టాలీవుడ్‌లో ఒకప్పుడు సినిమా అంటే కేవలం ఎమోషన్. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారింది.

By:  M Prashanth   |   28 April 2026 4:43 PM IST
టాలీవుడ్ రెమ్యునరేషన్ వార్.. ఐదుగురు తప్ప మిగతా వాళ్లకి కష్టమేనా?
X

టాలీవుడ్‌లో ఒకప్పుడు సినిమా అంటే కేవలం ఎమోషన్. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారింది. ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు పక్కా బిజినెస్ ప్లాన్ లా తయారయ్యాయి. ఒక హీరో పారితోషికం ఎంత ఉండాలనేది ఇప్పుడు ఆయన క్రేజ్‌ను బట్టి కాదు, సినిమా తెచ్చే వసూళ్లను బట్టి నిర్మాతలు లెక్కలు వేస్తున్నారు. ఓటిటి డీల్స్ తగ్గడం, థియేట్రికల్ రిస్క్ పెరగడంతో ఇండస్ట్రీలో ఒక కొత్త రకమైన చర్చ మొదలైంది. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్.. ఈ ఐదుగురు తప్ప మిగిలిన హీరోలందరూ తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

భారీ లాభాలు వస్తాయి.. కాబట్టి..

ఈ 'బిగ్ 5' హీరోలకు ఉన్న ప్రధాన బలం పాన్ ఇండియా మార్కెట్. ‘RRR’ తర్వాత ఎన్టీఆర్, చరణ్ రేంజ్ మారిపోయింది. ‘పుష్ప 2’తో అల్లు అర్జున్ హిందీ బెల్ట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయగా, బాహుబలి, కల్కి లాంటి సినిమాలతో ప్రభాస్ వెయ్యి కోట్ల క్లబ్‌లో పాగా వేశారు. ఇక రాజమౌళి సినిమాతో మహేష్ గ్లోబల్ మార్కెట్ మీద కన్నేశారు. వీళ్ల సినిమాలకు రిలీజ్‌కు ముందే డిజిటల్, శాటిలైట్ రూపంలో భారీ లాభాలు వస్తాయి. కాబట్టి వీళ్ల రెమ్యునరేషన్ ఎంత ఉన్నా నిర్మాతలకు అది భారం కావడం లేదు. కానీ మిగిలిన హీరోల దగ్గరకు వచ్చేసరికి లెక్కలు పూర్తిగా మారుతున్నాయి.

అసలు విషయం ఏంటంటే, మిడిల్ రేంజ్ హీరోల మార్కెట్ ఇప్పుడు తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. విజయ్ దేవరకొండ, నితిన్, వరుణ్ తేజ్ లాంటి హీరోల గత కొన్ని సినిమాల ఫలితాలు నిర్మాతలను ఆలోచనలో పడేశాయి. ఒక హీరోకి రూ. 25 కోట్లు ఇచ్చి, మొత్తం బడ్జెట్ రూ. 100 కోట్లు పెడితే.. అది రికవరీ అవ్వడం ఇప్పుడు గగనమైపోయింది. థియేటర్లలో జనం వచ్చి టికెట్ కొంటేనే సినిమా సేఫ్ అనే పరిస్థితి వచ్చింది. అందుకే నిర్మాతలు ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్ కంటే కంటెంట్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాలని ఫిక్స్ అవుతున్నారు.

సీనియర్లు కూడా తగ్గుతున్నారు..

సీనియర్ స్టార్ల విషయంలో కూడా ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి వారు మార్కెట్ ను బట్టి తమను తాము అప్‌డేట్ చేసుకుంటున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి హిట్లు ఉన్నా, ‘భోళా శంకర్’ వంటి పరాజయాల తర్వాత చిరంజీవి తన ప్రాజెక్టుల బడ్జెట్ విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నారు. బాలకృష్ణ కూడా కథకు ప్రాధాన్యత ఇస్తూ, లాభాల్లో వాటా తీసుకునే పద్ధతికి మొగ్గు చూపుతున్నట్లు టాక్. పవన్ కళ్యాణ్ సినిమాలకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినా, గ్రౌండ్ లెవల్ రిజల్ట్ ను బట్టి నిర్మాతలు బడ్జెట్ ను కంట్రోల్ చేస్తున్నారు.

నాగార్జున కూడా పక్కా ప్లానింగ్ తోనే వెళుతున్నాడు. అనవసర పాన్ ఇండియా హడావుడి చేయకుండా ముందు నిర్మాత సేఫ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

మరోవైపు నాని లాంటి హీరోలు ‘మినిమం గ్యారెంటీ’ ట్యాగ్‌తో సేఫ్ గా ఉన్నారు. ‘దసరా’, ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలతో నాని తన మార్కెట్ ను నిలబెట్టుకున్నారు. ఆయన సినిమా అంటే కనీసం రూ. 50 కోట్ల షేర్ వస్తుందనే నమ్మకం బయ్యర్లలో ఉంది. అందుకే ఆయన రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ అందరూ నాని లాగా సక్సెస్ ట్రాక్ లో లేకపోవడమే ఇక్కడ సమస్య. నితిన్, శర్వానంద్ లాంటి హీరోలు కూడా ఇప్పుడు రిస్క్ తగ్గించుకోవడానికి చిన్న బడ్జెట్ సినిమాల వైపు చూస్తున్నారు.

ఇండస్ట్రీకి మంచిదే..

నిజానికి ఇది ఇండస్ట్రీకి ఒక రకంగా మంచిదే. 2022 నుంచి 2024 మధ్య ఓటిటి పుణ్యమా అని అందరూ రెమ్యునరేషన్స్ పెంచేశారు. ఇప్పుడు ఓటిటి సంస్థలు కూడా కంటెంట్ క్వాలిటీ ఉంటేనే కొంటున్నాయి. దీనివల్ల హీరోలు కూడా కేవలం రెమ్యునరేషన్ మీద కాకుండా స్క్రిప్ట్ సెలక్షన్ మీద దృష్టి పెడుతున్నారు. బలగం, మ్యాడ్, కోర్ట్ లాంటి చిన్న సినిమాలు భారీ లాభాలు తీసుకురావడంతో నిర్మాతలు ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో మంచి కథల కోసం వెతుకుతున్నారు. స్టార్ హీరోల ప్యాన్ ఇండియా ప్రాజెక్టులు ఒకవైపు.. చిన్న బడ్జెట్ సినిమాలు మరోవైపు అన్నట్లుగా మార్కెట్ విడిపోయింది.

ఫైనల్ గా రెమ్యునరేషన్ తగ్గించుకోవడం అనేది హీరోల క్రేజ్ డ్యామేజ్ అయ్యేదేమి కాదు. పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు అది బిజినెస్ లో ఒక భాగం మాత్రమే. ప్రొడ్యూసర్ సేఫ్ గా ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. బిగ్ 5 స్టార్స్ తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను సృష్టించుకున్నారు. మిగిలిన వారు కూడా కంటెంట్ తో నాని లాగా బయ్యర్లలో నమ్మకాన్ని కలిగించాలి. అప్పుడు మాత్రమే రూ. 100 కోట్ల బడ్జెట్ అనేది భయం కాకుండా ఒక అవకాశంగా మారుతుంది. మరి మన స్టార్స్ ఏ విదంగా అడుగులు వేస్తారో చూడాలి.