ప్రేక్షకుడి ప్రశ్న: బాబూ ఎగ్జిబిటర్లూ-నిర్మాతలూ.. అసలు థియేటర్లలో కంటెంట్ ఏదీ?
టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. 2026 మే 15 నాటికి పరిశ్రమ ఒక విచిత్రమైన శూన్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది.
By: Sivaji Kontham | 15 May 2026 9:37 AM ISTటాలీవుడ్ ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే.. 2026 మే 15 నాటికి పరిశ్రమ ఒక విచిత్రమైన శూన్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. థియేటర్ల అద్దెలు, పర్సంటేజీ షేరింగ్‌లు అంటూ ఎగ్జిబిటర్లు, నిర్మాతలు వీధిన పడి గొడవ పడుతున్నారు కానీ అసలు థియేటర్లలో ఆడేందుకు సరైన సినిమాలే లేవన్న నిజాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది గడిచిన ఐదు నెలల్లో ప్రేక్షకులను మెప్పించే ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాకపోవడం శోచనీయం. కేవలం ఒకరితో ఒకరు ఘర్షణ పడటం లేదా పితలాటాలతో ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు తప్ప ప్రేక్షకులకు కావాల్సిన కంటెంట్‌ను అందించడంలో అందరూ విఫలమవుతున్నారు.
నిజానికి ఆడియన్స్‌కు రెంటల్ విధానం లేదా పర్సంటేజీ మోడల్‌తో అస్సలు సంబంధం లేదు. వారికి కావాల్సిందల్లా తమ ఫేవరెట్ హీరోలు నటించిన నాణ్యమైన సినిమాలు. ఈ మధ్య కాలంలో సినిమాల మేకింగ్ క్వాలిటీ కూడా దారుణంగా పడిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా క్రియేటివిటీని పక్కన పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పై అతిగా ఆధారపడటం వల్ల సినిమాలలోని సహజత్వం లోపించి.. కంటెంట్ పూర్తిగా నాశనమవతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. కేవలం ఏదో ఒక సినిమాని ప్రేక్షకులపై రుద్దేస్తామంటే ఇకపై కుదరదు.
ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. వారు కేవలం బాహుబలి, కేజీఎఫ్, సలార్, దురంధర్ వంటి భారీ విజువల్ వండర్స్ కోసం మాత్రమే థియేటర్ మెట్లు ఎక్కుతున్నారు. కంటెంట్ లో అసలేమీ సత్తా లేకపోయినా.. స్క్రీన్ మీద పాత్రధారులు మ్యాజిక్ చేయలేకపోయినా జనం ఓటీటీలకే పరిమితమవుతున్నారు. అగ్ర హీరోల నుండి పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్లు రావాల్సిన వేసవి సమయంలో పరిశ్రమలోని పెద్దలు పంపిణీ లెక్కల గురించి గొడవ పడటం చూస్తుంటే అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారనిపిస్తోంది.
మరి ఈ భారీ చిత్రాల కోసం ఎంతకాలం ఎదురు చూడాలి? రాజమౌళి ప్రతిష్టాత్మక `వారణాసి`, నాగ్ అశ్విన్ `కల్కి 2898 AD`, లేదా ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న `డ్రాగన్` వంటి సినిమాలు వచ్చే వరకు థియేటర్లు ఖాళీగా ఉండాల్సిందేనా? కనీసం రామ్ చరణ్ `పెద్ది` లేదా ప్రభాస్ `ఫౌజీ` అయినా విడుదలైతే బాక్సాఫీస్ వద్ద సందడి మొదలవుతుంది. ఈ లోపు చిన్న సినిమాలైనా మంచి ఎంగేజింగ్ కంటెంట్‌తో రావాలి కానీ నాసిరకం సినిమాలతో ప్రేక్షకులను విసిగిస్తే థియేటర్ల వ్యవస్థ మరింత సంక్షోభంలో పడుతుందనేది గ్రహించరా?
ఇప్పటికైనా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తమ వ్యక్తిగత పంతాలను వీడి మంచి సినిమాలు ఎలా అందించాలి? అనే దానిపై దృష్టి సారించాలి. వాళ్లలో వాళ్లే కొట్టుకుంటూ చర్చలు సాగదీయడం వల్ల సామాన్య ప్రేక్షకుడికి ఒరిగేదేమీ లేదు. సినిమా అనేది ఒక ఎమోషన్.. ఒక చక్కని ఎంటర్‌టైన్‌మెంట్. ఆ మౌలిక సూత్రాన్ని మరిచి కేవలం వ్యాపార లెక్కలు లాభాల చుట్టూ తిరిగితే.. భవిష్యత్తులో థియేటర్లకు వెళ్లే సంస్కృతి కనుమరుగయ్యే ప్రమాదం మరింత పెరుగుతుందని అంచనా. మంచి సినిమాలు వస్తున్న సమయంలో ఇలాంటి వివాదాలు పరిశ్రమకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని, టికెట్ ధరల్ని అందుబాటులో ఉంచకపోయినా ప్రమాదమేనని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు.
