Begin typing your search above and press return to search.

సమ్మర్ సీజన్ లో టెన్షన్.. తేల్చకపోతే భారీ నష్టం తప్పదా?

అయితే సమ్మర్ సీజన్‌ లోనే టాలీవుడ్‌ లో కొత్త సమస్య తలెత్తింది. థియేటర్ రెంట్ విధానం వర్సెస్ పర్సంటేజ్ విధానం అనే అంశంపై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య విభేదాలు తీవ్రంగా మారాయి.

By:  M Prashanth   |   14 April 2026 11:43 AM IST
సమ్మర్ సీజన్ లో టెన్షన్.. తేల్చకపోతే భారీ నష్టం తప్పదా?
X

టాలీవుడ్‌ కు సమ్మర్ సీజన్ ఎంతో కీలకం. వేసవి సెలవులు ఉండడంతో ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు వచ్చే సమయం ఇదే. అందుకే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆ సీజన్‌ ను టార్గెట్ చేస్తూ భారీగా సినిమాలు విడుదలకు ప్లాన్ చేస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదలై మంచి వసూళ్లు సాధిస్తుండగా, మరికొన్ని పెద్ద సినిమాలు వరుసగా రానున్నాయి.

అయితే సమ్మర్ సీజన్‌ లోనే టాలీవుడ్‌ లో కొత్త సమస్య తలెత్తింది. థియేటర్ రెంట్ విధానం వర్సెస్ పర్సంటేజ్ విధానం అనే అంశంపై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య విభేదాలు తీవ్రంగా మారాయి. ఆ వివాదం పరిష్కారం కాకపోతే సమ్మర్ సీజన్ మొత్తానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. కొంతకాలంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఆ అంశంపై చర్చలు జరుగుతున్నాయి.

సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం రెంట్ విధానం వల్ల నష్టాలు వస్తున్నాయని వాదిస్తోంది. అందుకే మల్టీప్లెక్స్‌ ల మాదిరిగా పర్సంటేజ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆ విధానం ప్రకారం తొలి వారం 60 శాతం, రెండో వారం 50 శాతం, మూడో వారం 40 శాతం వసూళ్లలో భాగస్వామ్యం ఇవ్వాలని ప్రతిపాదించారు. హైదరాబాద్‌ లోని కొన్ని థియేటర్లలో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉందని కూడా ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.

ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పద్ధతి అమలు అవుతుందని వారు వాదిస్తున్నారు. కానీ ఈ ప్రతిపాదనకు నిర్మాతల గిల్డ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పర్సంటేజ్ విధానం వల్ల తమకు నష్టం జరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. రెంట్ విధానంలోనే సినిమాలు ఇస్తామని స్పష్టంగా ప్రకటించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీకి సిద్ధంగా లేమని గిల్డ్ తేల్చిచెప్పింది.

ఇదిలా ఉండగా, గిల్డ్ వైఖరిపై తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారికంగా నిర్ణయాలు తీసుకునే సంస్థను పక్కనపెట్టి గిల్డ్ ఎలా స్పందిస్తుందంటూ ప్రశ్నించింది. ఈ వివాదంపై చర్చించేందుకు గిల్డ్‌కు అధికారం ఏమిటని కూడా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫిలిం చాంబర్, తెలుగు ఫిలిం చాంబర్‌కు లేఖ రాసి, ఏప్రిల్ 30లోగా తుది నిర్ణయం తీసుకోవాలని కోరింది.

అదే సమయంలో, పర్సంటేజ్ విధానం అమలు చేయకపోతే మే 1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్స్ హెచ్చరిక జారీ చేశారు. అయితే మే నెలలో భారీగా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ వివాదం కొనసాగితే ఆ సినిమాల రిలీజులు నిలిచిపోవచ్చు. దీంతో అన్ని చిత్రాల మేకర్స్ కు ఇది పెద్ద దెబ్బ అవుతుంది. అందుకే చర్చల్లో ఒక రాజీకి వస్తేనే పరిశ్రమకు ఊరట లభిస్తుంది. లేకపోతే సమ్మర్ సీజన్ మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉంది. మొత్తానికి.. టాలీవుడ్‌ లో రెంట్ వర్సెస్ పర్సంటేజ్ వివాదం త్వరగా పరిష్కారం కాకపోతే భారీ నష్టాలు తప్పవేమోనని టాక్ వినిపిస్తోంది.