టాలీవుడ్ రీరిలీజ్ లు.. చిన్న సినిమాలకు ప్రాబ్లం ఏంటి?
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా రీ రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగింది. ఒకప్పుడు పాత సినిమాలను టీవీల్లో లేదా ఓటీటీల్లో మాత్రమే చూసే అవకాశం ఉండేది.
By: M Prashanth | 6 Jun 2026 11:59 PM ISTటాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా రీ రిలీజ్ ట్రెండ్ బాగా పెరిగింది. ఒకప్పుడు పాత సినిమాలను టీవీల్లో లేదా ఓటీటీల్లో మాత్రమే చూసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తూ అభిమానులకు స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు మేకర్స్. కొన్ని రీ రిలీజ్ సినిమాలు కొత్త మూవీల రేంజ్ లో వసూళ్లు సాధించడంతో ఆ ట్రెండ్ మరింత పాపులర్ అయింది.
అయితే రీ-రిలీజ్ లకు పెరుగుతున్న ఆదరణ ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా చిన్న సినిమాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. కారణం.. జూన్ నెలలో కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే మూడు భారీ రీ రిలీజ్ లు ఉన్నాయి. జూన్ 10న నందమూరి బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి, జూన్ 12న సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్, జూన్ 13న ప్రభాస్ తొలి చిత్రం ఈశ్వర్ థియేటర్లలో మళ్లీ విడుదల కానున్నాయి.
ఆ మూడు సినిమాలకు ఆయా హీరోల అభిమానుల్లో మంచి క్రేజ్ ఉండటంతో థియేటర్లలో ప్రత్యేక షోలు ఉండే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిన్న సినిమాలకు మాత్రం ఇది సవాలుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు థియేటర్ యాజమాన్యాలు ఎక్కువ స్క్రీన్లు కేటాయిస్తుంటాయి. రీ రిలీజ్ అయినప్పటికీ అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉండటంతో థియేటర్లు కూడా వాటికే ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి ఉంటుంది.
దీంతో కొత్తగా వచ్చే చిన్న చిత్రాలకు సరిపడా థియేటర్లు దొరకకపోవచ్చని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మొదటి వారంలోనే ప్రేక్షకులను ఆకర్షించాల్సిన చిన్న సినిమాలకు స్క్రీన్ల కొరత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. థియేటర్లు తక్కువగా దొరికితే ప్రేక్షకులకు సినిమా చేరువ కావడం కూడా కష్టమవుతుంది.
మరోవైపు రీ రిలీజ్ ల చుట్టూ సోషల్ మీడియాలో భారీ ప్రమోషన్ జరుగుతోంది. ఫ్యాన్స్ ప్రత్యేక పోస్టర్లు, ట్రెండ్స్, సెలబ్రేషన్లతో సందడి చేస్తున్నారు. ఆ హడావుడి మధ్య కొత్త చిన్న సినిమాల ప్రమోషన్స్ పెద్దగా కనిపించకపోవచ్చని మూవీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దీంతో ప్రేక్షకుల దృష్టి కూడా ఎక్కువగా రీ రిలీజ్ లపైనే ఉండే అవకాశం ఉంటుంది. అయితే రీ రిలీజ్ ల వల్ల ఇండస్ట్రీకి లాభాలు కూడా ఉన్నాయని చెప్పాలి.
పాత క్లాసిక్ చిత్రాలను ఇప్పటి జనరేషన్ ఆడియెన్స్ థియేటర్లలో చూసే అవకాశం లభిస్తోందని, అంతే కాదు ఎక్స్ట్రా ఇన్ కమ్ కూడా వస్తోందని సినీ ప్రియులు పేర్కొంటున్నారు. కానీ అదే సమయంలో కొత్త సినిమాలకు ఇబ్బంది కలగకుండా విడుదల తేదీల విషయంలో బ్యాలెన్స్ గా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఏదేమైనా రీ రిలీజ్ ట్రెండ్ అభిమానులకు ఆనందాన్ని ఇస్తున్నా, వరుసగా పెద్ద సినిమాలు థియేటర్లలోకి రావడం చిన్న చిత్రాల అవకాశాలపై ప్రభావం చూపుతుందనే చర్చ జరుగుతోంది.
