Begin typing your search above and press return to search.

బాలీవుడ్ సూపర్‌స్టార్‌ని రౌండప్ చేసిన టాలీవుడ్ ట్యాలెంట్!

టాలీవుడ్ సాధిస్తున్న విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే కాకుండా.. గ్లోబల్ మార్కెట్‌లోనూ తెలుగు చిత్రసీమ హ‌వా అమాంతం పెరుగుతోంది.

By:  Sivaji Kontham   |   2 May 2026 8:15 AM IST
బాలీవుడ్ సూపర్‌స్టార్‌ని రౌండప్ చేసిన టాలీవుడ్ ట్యాలెంట్!
X

టాలీవుడ్ సాధిస్తున్న విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే కాకుండా.. గ్లోబల్ మార్కెట్‌లోనూ తెలుగు చిత్రసీమ హ‌వా అమాంతం పెరుగుతోంది. ఈ క్రమంలో మన టాలీవుడ్ నిర్మాతల లక్ష్యాలు ఇప్పుడు బాలీవుడ్ అగ్ర హీరోల వైపు మళ్లుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నేరుగా హిందీ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌తో సినిమాలు చేసేందుకు సిద్ధమవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వందల కోట్ల బడ్జెట్‌తో కూడిన ఈ ప్రాజెక్టుల విషయంలో మనవాళ్లు ఎక్కడా తగ్గడం లేదు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు ఇప్పటికే `జెర్సీ` హిందీ వెర్షన్‌తో బాలీవుడ్ అడుగులు వేయగా.. మైత్రీ మూవీ మేకర్స్ `జాట్`(స‌న్నీడియోల్) సినిమాతో అక్కడ మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు వీరిద్దరూ సల్మాన్ ఖాన్ కాల్షీట్లను దక్కించుకోవడం విశేషం. దిల్ రాజు తన కాంపౌండ్ దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి సల్మాన్‌తో ఒక ఫ్యామిలీ డ్రామా కం యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం 2027 ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ కూడా సల్మాన్ ఖాన్‌తో మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమయ్యారు. తెలుగు మూలాలున్న సంచలన దర్శకులు రాజ్ అండ్ డీకే కాంబినేషన్‌లో సల్మాన్ ఖాన్‌ను ఒక స‌`సూపర్ హీరో`గా చూపించేందుకు మైత్రీ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ భారీ పెట్టుబడులు పెడుతున్నారు. హిందీ నిర్మాత అతుల్ అగ్నిహోత్రితో కలిసి వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సల్మాన్ లాంటి మాస్ హీరోను మొదటిసారి సూపర్ హీరో పాత్రలో చూపించాలనే మన తెలుగు కుర్రాళ్ల ఆలోచన ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నిజానికి సల్మాన్ ఖాన్ తన వరుస ప్రాజెక్టుల కోసం దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ వంటి టాలీవుడ్ నిర్మాతలతో పాటు రాజ్ అండ్ డీకే వంటి తెలుగు దర్శకులకు కమిట్ అవ్వడం గమనిస్తే.. మన ప్రతిభపై బాలీవుడ్ స్టార్లకు ఉన్న నమ్మకం అర్థమవుతోంది. ఇక్కడి కమర్షియల్ సినిమా మేకింగ్ శైలిపై సల్మాన్ భాయ్ వంటి వారు చాలా ఎక్కువ నమ్మకంతో ఉన్నారు. కేవలం పాన్ ఇండియా మార్కెట్లోనే కాకుండా.. గ్లోబల్ మార్కెట్లోనూ దుమ్ము దులిపే సత్తా తెలుగు మేకర్స్‌కు ఉందని ఈ క్రేజీ కాంబినేషన్లు నిరూపిస్తున్నాయి.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. థియేటర్ల రెంట్ - పర్సంటేజీ విధానంలో విభేదాల కారణంగా దిల్ రాజు వర్సెస్ మైత్రీ అధినేతల మధ్య కొంత పోటాపోటీ వ్య‌వ‌హారం నడుస్తోంది. ఈ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాకముందే..సల్మాన్ ఖాన్ ఆ ఇరు కాంపౌండ్లతో కలిసి పని చేయడం ఫిలిం సర్కిల్స్‌లో ఉత్కంఠను పెంచుతోంది. ఏదేమైనా.. బాలీవుడ్ సూపర్‌స్టార్ చుట్టూ టాలీవుడ్ ప్రతిభ చేరడం అనేది తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్‌కు నిదర్శనం. తెలుగు చిత్ర‌సీమ దిగ్గ‌జ నిర్మాత‌లు, ఫిలింమేక‌ర్స్ బాలీవుడ్ స్టార్ల‌తో సినిమాలు చేస్తూ టాలీవుడ్ పేరును గ్లోబ‌ల్ మార్కెట్లో మార్మోగేలా చేయ‌డం నిజంగా ఆహ్వానించ‌ద‌గిన‌ ప‌రిణామం. ఇది హిందీ స్టార్ల‌కు కూడా సౌత్ మార్కెట్ లో రేంజును పెంచుతుంది.