Begin typing your search above and press return to search.

టాలీవుడ్ సమస్యలు.. 27 మందితో కమిటీ

ముఖ్యంగా సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల నిర్వహణలో ఎదురువుతున్న ఇబ్బందులు, పర్సంటేజీల విధానంపై శుక్రవారం జరిగిన సమావేశంలో చర్చించినట్లు కళ్యాణ్ తెలిపారు.

By:  Tupaki Desk   |   31 May 2025 12:11 AM IST
టాలీవుడ్ సమస్యలు.. 27 మందితో కమిటీ
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న కీలక సమస్యలు, ప్రస్తుత పరిణామాలపై విశాఖపట్నంలో సినీ రంగ ప్రముఖులు సమావేశమయ్యారు. నగరంలోని దొండపర్తిలో సుమారు రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. వారితో పాటు పలు థియేటర్ల యజమానులు కూడా వచ్చారు.

శుక్రవారం ఉదయం జరిగిన భేటీలో నిర్మాతలు స్రవంతి రవికిశోర్, సుధాకర్ రెడ్డి, భరత్ భూషణ్, అశోక్ కుమార్, సి. కళ్యాణ్ సహా మరికొందరు నిర్మాతలు హాజరయ్యారు. అయితే సమావేశం అనంతరం ప్రొడ్యూసర్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మీటింగ్ లో చర్చించిన అంశాలు మీడియాకు వివరించారు.

ముఖ్యంగా సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల నిర్వహణలో ఎదురువుతున్న ఇబ్బందులు, పర్సంటేజీల విధానంపై శుక్రవారం జరిగిన సమావేశంలో చర్చించినట్లు కళ్యాణ్ తెలిపారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించామని నిర్మాత వెల్లడించారు.

డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సంఘాలకు చెందిన సభ్యులతోనే కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ప్రొడ్యూసర్ కళ్యాణ్ తెలిపారు. ఒక్కో సంఘం నుంచి తొమ్మిది మంది చొప్పున.. అలా మొత్తం 27 మంది సభ్యులతో కమిటీ ఉంటుందని చెప్పారు. కమిటీలో ఉన్న పేర్లను ప్రభుత్వానికి చెబుతామని అన్నారు.

కమిటీకి సంబంధించిన వివరాలతో పాటు పాలుపంచుకునే సభ్యుల పేర్లు సోమవారం మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత సమస్యలు, థియేటర్ల నిర్వహణ, పర్సంటేజీలపై చర్చ జరిగిందని వెల్లడించారు. నిరంతరం తనిఖీల్లో భాగంగానే ఇప్పుడు సినిమా హాళ్లలో తనిఖీలు జరుగుతున్నాయని తెలిపారు కళ్యాణ్.

వాటిలో అసాధారణమేమి లేదని అన్నారు. నెలా నెలా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం ఉంటుందని తెలిపారు. అయితే నిర్మాత కళ్యాణ్ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కమిటీ ఏర్పాటుతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న టికెట్ రేట్లు, పైరసీ, ఓటీటీల ప్రభావం వంటి పలు సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.