ఘనంగా టాలీవుడ్ ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవం..
మన భారతీయులకు సినిమా, క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: Tupaki Desk | 26 Dec 2025 12:25 PM ISTమన భారతీయులకు సినిమా, క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఈ రెండింటికి విడదీయరాని బంధం కూడా ఏర్పడింది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న వంశీ చాగంటి ఈబిజీ గ్రూపు ఇర్ఫాన్ ఖాన్, హరి తో కలిసి ఈ టాలీవుడ్ ప్రో లీగ్ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు 2026 ఫిబ్రవరిలో జరగబోయే టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభ వేడుకలను హైదరాబాదులో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం హైదరాబాదులోనే నోవాటెల్ హోటల్లో ఘనంగా జరిగింది.
లెజెండ్రీ క్రికెటర్స్ కపిల్ దేవ్, సురేష్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్ ముఖ్య అతిథులుగా రాగా.. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఈ క్రికెట్ సమరం ఫిబ్రవరి 13, 14, 15, 21, 22 తేదీలలో ఐదు రోజులపాటు జరగనుంది. ముఖ్యంగా ఈ ప్రో లీగ్ లో ఏకంగా ఆరు టీంలు పాల్గొనబోతున్నాయి.
ఇటు ఫిలిం ఇండస్ట్రీలో 24 శాఖల్లో పని చేసే ప్రతి ఒక్కరు కలిసి క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుండి పుట్టింది ఈ టాలీవుడ్ ప్రో లీగ్ అని ఫౌండర్స్ లో ఒకరైన నటుడు వంశీ చాగంటి తెలిపారు. ఇకపోతే దీని ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తామని కూడా నిర్వాహకులు ఇర్ఫాన్ ఖాన్ , హరి స్పష్టం చేశారు. ఇక దీనిని తెలుగు సినిమా అలయ్ - బలయ్ గా ఫీల్ అవుతున్నానని నిర్మాత దిల్ రాజు కూడా తెలిపారు.
ఇకపోతే ఈ కార్యక్రమం అనంతరం వంశీ మాట్లాడుతూ.." ఈ ఐడియాను దిల్ రాజుకి చెప్పినప్పుడు మంచి ఐడియా వంశీ.. దీన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చెయ్యి.. నీ వెనుక నేనున్నాను. అంటూ నాకు అభయం ఇచ్చారు. ఇక ఈ ఐదు రోజులపాటు క్రికెట్ సమరం ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ పోటీల్లో ఆరు టీములు పాల్గొంటాయి. ఆ 6 టీం లకు టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఓనర్స్ గా వ్యవహరిస్తారు. అయితే ఆ నిర్మాణ సంస్థలు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా పెట్టాము" అంటూ వంశీ తెలిపారు. "ఇక మీ అందరి సహకారం ఇలాగే కొనసాగితే భారతదేశమంతటా ఇలాంటి లీగ్ లను మా కంపెనీ ఈబిజీ కొనసాగిస్తుంది అంటూ ఇర్ఫాన్ ఖాన్ తెలిపారు.
దిల్ రాజు మాట్లాడుతూ .. ఎలాగైనా సరే ఈ టాలీవుడ్ క్రికెట్ లీగ్ ను ముందుకు తీసుకెళ్లి సక్సెస్ చేస్తాను అని స్పష్టం చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమం లో ప్రో లీగ్ లోగో, జెర్సీలను విన్నర్స్ కప్పును కపిల్ , సెహ్వాగ్, సురేష్ రైనా, దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్, సోనుసూద్ , రాశిఖన్నా ఇర్ఫాన్ ఖాన్, హరి చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక అలాగే ఆశిష్ విద్యార్థి, మురళీ శర్మ , నిర్మాతలు రాజీవ్ రెడ్డి, టీజీ విశ్వప్రసాద్ , నాగవంశీ, దర్శకుడు శైలేష్ కొలను, ప్రశాంత్ వర్మ , అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు.
