Begin typing your search above and press return to search.

హీరోకి, నిర్మాతకు హక్కులున్నాయి.. మాకు మాత్రం లేవా?

తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలు మరోసారి టాలీవుడ్‌ లో చర్చనీయాంశంగా మారాయి.

By:  M Prashanth   |   13 May 2026 10:39 AM IST
హీరోకి, నిర్మాతకు హక్కులున్నాయి.. మాకు మాత్రం లేవా?
X

తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలు మరోసారి టాలీవుడ్‌ లో చర్చనీయాంశంగా మారాయి. నైజాంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పర్సంటేజీ విధానం అమలు చేయాలంటూ తెలంగాణ ఎగ్జిబిటర్లు హైదరాబాద్‌ లో కీలక సమావేశం నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సేవ్ సింగిల్ స్క్రీన్స్.. మాకు పర్సంటేజీ సిస్టమ్ కావాలనే నినాదంతో నిర్వహించిన ప్రెస్ మీట్‌ లో ఎగ్జిబిటర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న రెంటల్ విధానం వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు పేర్కొన్నారు. కరోనా తర్వాత ప్రేక్షకుల అలవాట్లు మారిపోయాయని, సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్లలో నిలవడం లేదని అన్నారు. దీంతో భారీ అద్దెలు, నిర్వహణ ఖర్చులు భరించడం కష్టమవుతోందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పర్సంటేజీ విధానం మాత్రమే సింగిల్ స్క్రీన్లను కాపాడగలదని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో నిర్మాత కమ్ ఎగ్జిబిటర్ శిరీష్ రెడ్డి చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇకపై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్లు పెంచే ఆలోచన లేదని, ప్రభుత్వం జీవో ఇచ్చినా కూడా ప్రేక్షకులపై అదనపు భారం వేయబోమని ఆయన హామీ ఇవ్వడం గమనార్హం. అసలు సమస్య టికెట్ రేట్లు కాదని, థియేటర్ల మనుగడేనని శిరీష్ రెడ్డి స్పష్టం చేశారు. "హీరోకి రెమ్యూనరేషన్ అడిగే హక్కు ఉంది. నిర్మాతకు సినిమాను తన రేటుకి అమ్ముకునే హక్కు ఉంది. డిస్ట్రిబ్యూటర్‌ కు కూడా తన వ్యాపారం చూసుకునే హక్కు ఉంది. మరి కోట్ల రూపాయలు పెట్టి థియేటర్లు నిర్మించిన ఎగ్జిబిటర్‌ కు మాత్రం హక్కులు ఉండకూడదా?" అంటూ ఆయన ప్రశ్నించిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది.

ఇంకా ఒక నిర్మాత గతంలో థియేటర్లు వర్కౌట్ కాకపోతే మూసుకోండి అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఇండస్ట్రీలో లేడు అని చెప్పడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ నిర్మాత ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయారని, సినిమాలు తీయడం మానేశారని శిరీష్ చెప్పారు. ఏ వ్యవస్థ అయిన సజావుగా నడవాలంటే అందరి వ్యాపారాలు సమానంగా సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎగ్జిబిటర్లు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. మల్టీప్లెక్సులలో ఇప్పటికే పర్సంటేజీ షేరింగ్ విధానం అమలులో ఉందని, కానీ తెలుగు రాష్ట్రాల సింగిల్ స్క్రీన్లకు మాత్రం అదే అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. పుష్ప వంటి భారీ హిట్ సినిమాలు ఇతర రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానంలోనే ప్రదర్శించారని, అక్కడ వర్కౌట్ అయిన మోడల్ ఇక్కడ ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు.

ఇటీవల సినిమాల రన్ కూడా తగ్గిపోవడం ఎగ్జిబిటర్లకు మరో పెద్ద సమస్యగా మారింది. దీంతో ఫిక్స్‌ డ్ రెంటల్ విధానం థియేటర్లకు భారంగా మారుతోందని వారు అంటున్నారు. ఏదేమైనా తెలంగాణ ఎగ్జిబిటర్లు ఇప్పుడు కేవలం డిమాండ్ చేయడం కాదు, మనుగడ కోసం పోరాడుతున్నామని చెబుతున్నారు. ఇక స్టార్ హీరోలు, పర్సంటేజ్ విధానానికి ఓకే చెప్పని నిర్మాతలు ఎలా స్పందిస్తారు? టాలీవుడ్‌ లో నిజంగానే కొత్త మార్పుకు నాంది అవుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.