ఇండస్ట్రీలో మోనోపలి అంటే ఏంటీ? దానివల్ల ఏం జరుగుతోంది?
టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాకు థియేటర్లు లభించని ప్రతిసారి వినిపించే పేరు మోనోపలి. చాలా మంది సినీ ప్రియులకు ఇదంటే ఏంటో తెలియదు.
By: Tupaki Desk | 27 Jun 2025 11:15 AM ISTటాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాకు థియేటర్లు లభించని ప్రతిసారి వినిపించే పేరు మోనోపలి. చాలా మంది సినీ ప్రియులకు ఇదంటే ఏంటో తెలియదు. అసలు ఏంటీ మోనోపలి?..దీని వల్ల ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? అన్నది గత కొంత కాలంగా వినిపిస్తూనే ఉంది. మోనోపలి అంటే గుత్తాధిపత్యం. విధ రంగాల్లో పాతుకు పోయిన వాళ్లు ఈ రంగంలో మేమే బాసులం..మాదే పెత్తనం అంతా.. మేము చెప్పినట్టే జరగాలి. ఇక్కడ మరొకరికి చోటు లేదు. కొత్తగా ఈ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలన్నా మా అనుమతి కావాల్సిందే.
దీన్ని అడ్డంపెట్టుకుని ఇక్కడ చాలానే జరుగుతుంటాయి. డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో ప్రధానంగా దీని డామినేషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంతే కాకుండా కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించే వారు అప్పటికే ఆధిపత్యాన్ని చేలాయిస్తున్న వారికి సలాం కొట్టాల్సిందే. లేదంటే ఇక్కడ నిలబడటం, మనుగడ సాగించడం కష్టం. అలా కాదు కూడదు.. అని శపథాలు చేసిన వారు అడ్రస్ లేకుండా పోయారు. పోతున్నారు కూడా.
మోనోపలి పేరుతో ఇండస్ట్రీలో చాలానే జరుగుతోంది. ఇక్కడ పేరున్న వాడిదే రాజ్యం..పెత్తనం. ఒక సినిమాకు థియేటర్లు కేటాయించాలన్నా మోనోపలి.. సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నా అక్కడా మోనోపలి ఉంటుంది. వీటన్నింటినీ తట్టుకుని నిలబడిన వాడే ఇక్కడ హీరో.. విన్నర్.. ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకోవాలనే పథకంలో భాగంగానే ఇది ఇక్కడ పుట్టుకొచ్చింది. ఇది ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు వివిధ రంగాల్లోనూ ఉంది. అయితే ఇండస్ట్రీలో మాత్రం దీని ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే `ఆ నలుగురు` అన్నది కూడా దీని నుంచే పుట్టుకొచ్చింది.
ఇది ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్లిందంటే సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్లకు రానంతగా పెరిగిపోయింది. థియేటర్లలో గుత్తాధిపత్యం, టికెట్ రేట్లు భారీగా పెంచడం, థియేటర్లలో లభించే తినుబండారాల రేట్లు చుక్కలు చూపించడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం బాగా తగ్గించారు. కోట్లు పెట్టి తీశాం.. నెలలు కష్టపడి తీశాం. థీయేటర్లలో మాత్రమే చూడండి. థియేటర్లకు రండి అని చెప్పే ఇండస్ట్రీ వర్గాలు, నిర్మాతలు, దర్శకులు, హీరోలు అదే ప్రేక్షకుడి కోసం మాత్రం ఫైట్ చేయరు. టికెట్ రేట్లు భారీగా పెంచేస్తారు..
థియేటర్లలో లభించే పాప్ కార్న్, పెప్సీ వంటి కూల్ డ్రింక్స్ రేట్లు కూడా భారీగా పెంచేసి సినిమా టికెట్‌ని మించి జేబులు ఖాలీ చేయిస్తున్నారు. అయినా సరే ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటారు. ఇలా ఇండస్ట్రీకి చెందిన ప్రతి కీలక రంగంలోనూ గుత్తాధిపత్యం పతాక స్థాయికి చేరుకుంది. ఎంతలా అంటే సినిమాని కిల్ చేసే అంతగా. అదే ఇప్పుడు ఇండస్ట్రీని కిల్ చేస్తోంది. ఇక మరో విషయంలోనూ ఇక్కడ గుత్తాధిపత్యానిదే పై చేయి. మంచి కథలు. ఇప్పటి వరకు వచ్చిన కథలేనా? బయటి ఇంతకు మించిన కథలు లేవా? అంటే ఎందుకు లేవు ఉన్నాయి. కానీ అవి వెలుగు చూడాలంటే అవకాశం ఇవ్వాలి.. కొత్త వాళ్లని ప్రోత్సహించాలి. సినిమా రిలీజ్‌కు థియేటర్లు కేటాయించాలి. అది చాలా తక్కువ స్థాయిలోనే జరుగుతోంది.
మారుతున్న పరిస్థితులు, సినిమా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లని దృష్టిలో పెట్టుకుని మోనోపలిని పక్కన పెడితే కొత్త టాలెంట్ కు గేట్లు తెరుచుకుంటాయి. కొత్త తరహా కథలు, సినిమాలు వెలుగు చూస్తాయి. కొత్త కొత్త హీరోలు, టాలెంటెడ్ ఆర్టిస్ట్‌లు, డైరెక్టర్లు, నిర్మాతలు పుట్టుకొస్తారు. అదే జరిగితే మళ్లీ తెలుగు సినిమా థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడే రోజులొస్తాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల ఆధిపత్యం కూడా పోయి మంచి సినిమాలకు ఆదరణ మొదలవుతుంది.
