కేన్స్ 2025లో టాలీవుడ్ ఎక్కడ?
ప్రతిష్ఠాత్మక కేన్స్ 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కేన్స్ నగరం రంగుల హరివిల్లులా మారింది.
By: Tupaki Desk | 17 May 2025 9:47 AM ISTప్రతిష్ఠాత్మక కేన్స్ 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కేన్స్ నగరం రంగుల హరివిల్లులా మారింది. అక్కడ దేశ విదేశాల నుంచి స్టార్ల సందడి కనిపిస్తోంది. వరుసగా సినిమాల ప్రీమియర్లతో వేదిక ఎంతో వైభవంగా మారింది. రెండు వారాల పాటు సాగే ఈ ఉత్సవాలకు చాలా దేశాల నుంచి సినీప్రముఖులు విచ్చేసి ఇక్కడ ప్రచార హంగామా సృష్టిస్తున్నారు.
అయితే కేన్స్ 2025 లో టాలీవుడ్ సందడి అస్సలు కనిపించడం లేదు. మన స్టార్లు కానీ టెక్నీషియన్లు కానీ కేన్స్ లో సందడి చేస్తున్నట్టు లేదు. ఇలాంటి చోట ఏడాది కాలంగా రూపొందించిన మన సినిమాలేవీ ప్రీమియర్లకు పనికి రానివా? అనే సందేహం తలెత్తింది. అసలు తెలుగు చిత్రసీమ నుంచి ప్రముఖులు ఎవరూ ఈ ఉత్సవాల్ని తిలకించేందుకు అయినా వెళ్లలేదా? ఇప్పటివరకూ కనీసం ఒక సౌత్ స్టార్ ఫోటో కూడా ఇంటర్నెట్ లో కనిపించలేదు.
మనవాళ్లు ఎవరూ ఎందుకు వెళ్లలేదు? సౌత్ స్టార్ల ప్రాతినిధ్య కనిపించలేదేమిటీ? ఈసారి కేన్స్ 2025 సంబరాల్లో బాలీవుడ్ నుంచి 4 సినిమాలు ప్రీమియర్ వేస్తున్నారు. అందులో జాన్వీ మూవీ కూడా ఉంది. అనుపమ్ ఖేర్ లాంటి ఔత్సాహిక ఫిలింమేకర్ తన సినిమాని కూడా కేన్స్ లో ప్రీమియర్ చేసారు. ఐశ్వర్యారాయ్, ఆలియాభట్, అతిథీరావు హైదరీ, జాన్వీ కపూర్ లాంటి కొందరు మాత్రమే కేన్స్ కి ఎటెండవ్వడం ఆశ్చర్యపరిచింది. చివరికి కాపీ క్యాట్ సినిమాగా పాపులరైన లాపాటా లేడీస్ నటి కూడా కేన్స్ లో సందడి చేసింది.
ఈసారి సౌత్ నుంచి ప్రతిష్ఠాత్మక ఈవెంట్ లో ప్రాతినిధ్యం లేదు. నిజానికి ఆస్కార్ లు, గోల్డెన్ గ్లోబ్ లు, క్రిటిక్స్ అవార్డులు, గ్రామీలు సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాల కోసం అందరి దృష్టిలో పడాలంటే కేన్స్ వెళ్లాలి. ప్రపంచ దేశాల అవార్డుల కోసం ప్రయత్నించే సినిమాలకు కేన్స్ వేదికగా బోలెడంత ప్రచారం దక్కుతుంది. కానీ తెలుగు నుంచి కనీసం ఒక్క సినిమా కూడా లేదు. మనవాళ్లు అసలు ఈ ఉత్సవాలను పట్టించుకున్నట్టే లేదు. బాహుబలి లాంటి సినిమాతో రాజమౌళి కేన్స్ లో బోలెడంత ఉత్సాహం పెంచగలిగాడు. కానీ ఈసారి అతడు కూడా కేన్స్ లో కనిపించలేదు. కనీసం తీరిక సమయం ఉన్న చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు కేన్స్ ని పట్టించుకోకపోవడం వివస్మయపరుస్తోంది.
