మంచు 'వార్' మళ్లీ స్టార్ట్.. మోహన్ బాబు ఇంటి వద్ద మనోజ్ ఆందోళన
తాజాగా జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటి వద్ద ఆయన ఆందోళనకు దిగారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు తెరవకపోవడంతో గేటు బయటే బైఠాయించారు.
By: Tupaki Desk | 9 April 2025 11:25 AM ISTటాలీవుడ్ ప్రముఖ మంచు ఫ్యామిలీ గొడవలు ఇంకా క్లియర్ అయినట్లు కనిపించడం లేదు. ఆ మధ్య గొడవలు, కేసులు, ఫిర్యాదులు, విమర్శలు, ప్రతి విమర్శలతో విషయం తారాస్థాయికి చేరగా.. కొద్ది రోజుల నుంచి కాస్త సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత ఇన్ డైరెక్ట్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోగా.. ఇప్పుడు మళ్లీ రచ్చకెక్కారు.
మోహన్ బాబు కుమారుడు, హీరో మంచు మనోజ్ కారు చోరీ అయిందని రీసెంట్ గా ఆయన డ్రైవర్.. నార్సింగి పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆ సమయంలో తన సోదరుడు విష్ణు 150 మందితో జల్ పల్లిలోని ఇంట్లోకి ప్రవేశించి తన వస్తువులు పగలగొట్టారని మనోజ్ ఆరోపించారు. కార్లు ఎత్తుకెళ్లిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.
అలాంటి పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నానని, కానీ అందుబాటులోకి రావడం లేదని తెలిపారు మనోజ్. తాజాగా జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటి వద్ద ఆయన ఆందోళనకు దిగారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా గేటు తెరవకపోవడంతో గేటు బయటే బైఠాయించారు.
ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు జరగకుండా మోహన్ బాబు ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మనోజ్ ఆందోళనకు దిగిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక ఫిర్యాదులో పలు విషయాలను పోలీసులకు తెలిపారు మనోజ్ డ్రైవర్. గత నాలుగు నెలలుగా మనోజ్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నానని, ముప్ప విల్లాస్ లోని ఆయన ఇంట్లోనే నివాసముంటున్నానని చెప్పారు. 1వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో మనోజ్ కారును గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారని డ్రైవర్ తెలిపారు. కారును చూసిన భద్రతా సిబ్బంది మనోజ్ నడుపుతున్నట్లు భావించి గేట్లు తెరవగా, వారు వెళ్లిపోయారని వెల్లడించారు.
అయితే ఏప్రిల్ 1వ తేదీన తన పాప పుట్టినరోజు సందర్భంగా జైపూర్ వెళ్లానని మనోజ్ తెలిపారు. తన కారుతో పాటు తన భార్య కార్లను ఎత్తుకెళ్లి రోడ్డు మీద వదిలేశారని మనోజ్ ఆరోపించారు. తన కారును దొంగిలించి విష్ణు ఇంట్లో ఎవరో పార్కింగ్ చేశారని అన్నారు. ఆ విషయాన్ని పోలీసులు గుర్తించి రికవరీ కోసం వెళ్లినప్పుడు దాన్ని మాదాపూర్ కు తరలించారని చెప్పారు. మరి ఈ విషయంలో చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
