'ఐక్యంగా ఉండాలనే ఆలోచన లేదు- కలిసి మాట్లాడాలంటే భయం'
సినిమా రంగానికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఇప్పటికే కల్యాణ్ గారు చెప్పాక పక్కింటికి వెళ్లినంత సులభంగా వెళ్లి పేపర్ పట్టుకొని టికెట్ ధరలు పెంచుకుని వస్తున్నారని అభిప్రాయపడ్డారు.
By: Tupaki Desk | 26 May 2025 11:00 PM ISTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగు సినీ ఇండస్ట్రీ మధ్య ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. సినీ ప్రతినిధులకు కనీస కృతజ్ఞతలు లేదని, అంతా కలిసి ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలని చెప్పినా సానుకూల స్పందన లేదని డిప్యూటీ సాబ్ పవన్ ఫైరయ్యారు. తనకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను తగిన విధంగా స్వీకరిస్తానని చెప్పారు.
ఇకపై ఎవరూ వ్యక్తిగతంగా రావొద్దని, ఏమున్నా ఆయా ప్రతినిధులతో చర్చిస్తానని తెలిపారు. దీంతో పవన్ చాలా హర్ట్ అయ్యారని క్లియర్ గా తెలుస్తోంది. దీంతో ఇండస్ట్రీ అంతా ఐక్యంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి సహా అంతా కలిసి చర్చించుకున్నాక రెస్పాండ్ అవ్వాలని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
కానీ ఇప్పటి వరకు అలా జరగలేదు. నిన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. పవన్ పేషీ నుంచి వచ్చిన ప్రకటన సమర్థనీయమని అన్నారు. ముఖ్యమంత్రిని కలవాల్సిందని తెలిపారు. ఇప్పుడు దిల్ రాజు.. ప్రెస్ మీట్ పెట్టి పలు వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదేనని అన్నారు. ఐక్యంగా ఉండాలనే ఆలోచన ఉండదని అన్నారు.
నిన్న అరవింద్ గారు, నేడు ప్రెస్ మీట్ పెట్టినట్లు చెప్పారు. కానీ ఇండస్ట్రీలో ఉన్న అందరం కలిసి కదా మీడియాతో మాట్లాడాల్సిందని వ్యాఖ్యానించారు. అంతా కలిసి మాట్లాడాలంటే తమకు భయమని అనడం గమనార్హం. ముఖ్యంగా.. ఎవరికి సినిమా వచ్చినప్పుడు వాళ్లు మేల్కొని, టికెట్ ధరలు పెంచుకునేందుకు పరిగెత్తుకుంటూ వెళ్తారని అన్నారు.
సినిమా రంగానికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఇప్పటికే కల్యాణ్ గారు చెప్పాక పక్కింటికి వెళ్లినంత సులభంగా వెళ్లి పేపర్ పట్టుకొని టికెట్ ధరలు పెంచుకుని వస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా, ప్రభుత్వాలే పరిష్కరించాలని అన్నారు. రెండు ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు అండగానే ఉన్నాయని వెల్లడించారు.
కాగా, ఎగ్జిబిటర్స్ తమ సమస్యకు దొరక్కపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని కొందరు అన్నారని, కానీ వెంటనే తాను వద్దని వారించానని చెప్పారు. కానీ థియేటర్స్ బంద్ అంటూ ప్రచారం జరిగింది. దీనిపై అటు ఎగ్జిబిటర్స్, ఇటు ఫిల్మ్ ఛాంబర్ రెస్పాండ్ అవ్వకపోవడం, ఖండించకపోవడం తప్పని దిల్ రాజు అన్నారు. అలా ఉంది ఇండస్ట్రీలో ఐక్యత అంటూ వ్యాఖ్యానించారు.
