ఆ నలుగురిలో పై చేయి సాధించేది ఎవరో?
మామూలుగా ఏదైనా పెద్ద సినిమా రిలీజైతే ఆ సినిమాకు వారం ముందు, వారం తర్వాత మరో పెద్ద సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ అంతగా ఆసక్తి చూపించరు.
By: Tupaki Desk | 2 Jun 2025 2:21 PM ISTమామూలుగా ఏదైనా పెద్ద సినిమా రిలీజైతే ఆ సినిమాకు వారం ముందు, వారం తర్వాత మరో పెద్ద సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ అంతగా ఆసక్తి చూపించరు. కానీ ప్రస్తుత రోజుల్లో రిలీజ్ డేట్స్ పెద్ద సమస్యగా మారిన తరుణంలో మేకర్స్ కు మరో దారి కనిపించడం లేదు. అందుకే ఈసారి జూన్ లో టాలీవుడ్ నుంచి ప్రతీ వారం ఓ పెద్ద సినిమా రిలీజ్ కు రెడీ అయింది.
అందులో మొదటిగా జూన్ 5న కమల్ హాసన్ థగ్ లైఫ్ రిలీజ్ కాబోతుంది. మామూలుగా అయితే కమల్ సినిమాలకు ఇక్కడ పెద్దగా బజ్, హైప్ ఉండవు. కానీ ఈసారి కమల్ హాసన్, మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేయడంతో ఈ సినిమాను స్పెషల్ గా తీసుకుని మరీ కమల్ తెలుగులో కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు. కేవలం ఈవెంట్స్ కు హాజరవడమే కాకుండా తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ థగ్ లైఫ్ పై హైప్ ను పెంచాడు.
థగ్ లైఫ్ సినిమా రిలీజైన వారానికి అంటే జూన్ 12న పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలవనప్పటికీ, బ్రో సినిమా తర్వాత రెండేళ్లకు పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటూ, పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న మొదటి సినిమా కావడంతో వీరమల్లుకు మంచి బజ్ వచ్చేస్తుంది.
వీరమల్లు రిలీజ్ తర్వాత మరో వారానికి తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో చేసిన కుబేర ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగార్జున ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయడంతో పాటూ ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించడంతో జూన్ 20న రానున్న ఈ సినిమాపై ఆల్రెడీ మంచి బజ్ నెలకొంది. కుబేరతో పాటూ అదే రోజున మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 8 వసంతాలు కూడా రిలీజవుతోంది. 8 వసంతాలు పెద్ద సినిమా కాకపోయినా మైత్రీ నిర్మాతలు కావడంతో ఈ సినిమాను తక్కువ అంచనా వేయడానికి లేదు.
ఇక జూన్ ఆఖరి వారంలో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన కన్నప్ప సినిమా జూన్ 27న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ముకేష్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ తో పాటూ కాజల్ అగర్వాల్ లాంటి భారీ క్యాస్టింగ్ కూడా ఉంది. ఇలా జూన్ నెలలో ప్రతీ వారం స్టార్ హీరో నుంచి ఓ క్రేజీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి పవన్ కళ్యాణ్, కమల్ హాసన్, ధనుష్, మంచు విష్ణులలో జూన్ నెల విన్నర్ గా ఎవరి సినిమా నిలుస్తుందో చూడాలి.
