Begin typing your search above and press return to search.

జూన్‌లో కంటెంట్ ఉన్న సినిమాలు.. గెట్ రెడీ!

2025 సమ్మర్ సీజన్ టాలీవుడ్‌లో అనుకున్న స్థాయిలో రసవత్తరంగా సాగలేదు. పెద్ద సినిమాలు ఎన్నో వాయిదా పడ్డాయి, అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక్కటీ విడుదల కాలేదు.

By:  Tupaki Desk   |   15 May 2025 11:00 PM IST
జూన్‌లో కంటెంట్ ఉన్న సినిమాలు.. గెట్ రెడీ!
X

2025 సమ్మర్ సీజన్ టాలీవుడ్‌లో అనుకున్న స్థాయిలో రసవత్తరంగా సాగలేదు. పెద్ద సినిమాలు ఎన్నో వాయిదా పడ్డాయి, అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక్కటీ విడుదల కాలేదు. విశ్వంభర, రాజా సాబ్ లాంటి భారీ చిత్రాలు గ్రాఫిక్స్ వర్క్స్, షూటింగ్ ఆలస్యంతో వాయిదా పడ్డాయి. ఇక సమ్మర్ చివరి నెల అయిన జూన్‌లో మాత్రం కొన్ని పెద్ద ప్రాజెక్ట్‌లు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నెలలో పాన్ ఇండియా సినిమాల సందడి అభిమానులకు పండగలా ఉండనుంది.

జూన్ 5న కమల్ హాసన్ నటిస్తున్న ‘థగ్ లైఫ్’ విడుదల కానుంది. మణిరత్నం డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో శింబు, త్రిష, జోజు జార్జ్, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం తమిళ, తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ నిర్మాణంలో ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది.

జూన్ 13న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ కానుంది. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో మొదలైన ఈ సినిమాకు జ్యోతిక్రిష్ణ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. గ్రాండ్ గా రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, చారిత్రక నేపథ్యంలో సాగుతుంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా ఎన్నోసార్లు వాయిదా పడింది. ఇప్పుడు జూన్‌లో విడుదలకు సిద్ధమవుతుండగా, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జూన్ 20న రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటిస్తున్న ‘కుబేర’ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ధనుష్ ఓ బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నాడు. అదే రోజు ఆమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ కూడా రిలీజ్ కానుంది. ఆర్.ఎస్. ప్రసన్న డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా, స్పానిష్ చిత్రం ‘కాంపియోన్స్’ రీమేక్‌గా తెరకెక్కుతోంది.

జూన్ 27న మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా విడుదల కానుంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం శివ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా సాగుతుంది. అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమా విజువల్స్, భక్తి రసం అభిమానులను ఆకర్షించే అవకాశం ఉంది. మొత్తంగా, జూన్ నెల టాలీవుడ్‌లో సినిమా సందడితో నిండిపోనుంది. ‘థగ్ లైఫ్’, ‘హరిహర వీరమల్లు’, ‘కుబేర’, ‘సితారే జమీన్ పర్’, ‘కన్నప్ప’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి.