Begin typing your search above and press return to search.

జులైలో యంగ్ హీరోలకు అస‌లైన ప‌రీక్ష‌!

బాక్సాఫీస్ వద్ద కూడా పెద్ద సినిమాల ఒత్తిడి లేకపోవడం వల్ల మంచి టాక్ వస్తే కలెక్షన్లను నిలబెట్టుకునే అవకాశాలు మరింత పెరిగాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   29 Jun 2026 4:44 PM IST
జులైలో యంగ్ హీరోలకు అస‌లైన ప‌రీక్ష‌!
X

జూలై నెల టాలీవుడ్‌కు ఆసక్తికరమైన బాక్సాఫీస్ సీజన్‌గా మారుతోంది. అగ్ర హీరోల సినిమాలు లేకపోవడంతో జూలై మొత్తం యంగ్ హీరోల చేతుల్లోకి వెళ్లినట్లైంది. ఒకవైపు కొత్త కథలతో వస్తున్న సినిమాలు, మరోవైపు విభిన్న జానర్ల మధ్య పోటీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇదే సమయంలో థియేటర్ బిజినెస్, డిస్ట్రిబ్యూషన్ మార్కెట్, యంగ్ హీరోల కెరీర్‌లకు కూడా ఈ నెల కీలకంగా మారనుంది. స్టార్ హీరోల సినిమాలు లేకపోవడం యంగ్ హీరోలకు అతిపెద్ద అవకాశంగా మారింది. సాధారణంగా భారీ సినిమాలు రిలీజైన‌ప్పుడు చిన్న, మధ్యస్థాయి సినిమాలకు స్క్రీన్లు దొరకడం కష్టమవుతుంది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. ఎక్కువ థియేటర్లు అందుబాటులో ఉండటంతో పాటు మీడియా దృష్టి కూడా ఈ యంగ్ హీరోల సినిమాలపైనే కేంద్రీకృతమవుతోంది. ఒక్కో సినిమా తన ప్రమోషన్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించుకునే అవకాశం దక్కుతోంది. బాక్సాఫీస్ వద్ద కూడా పెద్ద సినిమాల ఒత్తిడి లేకపోవడం వల్ల మంచి టాక్ వస్తే కలెక్షన్లను నిలబెట్టుకునే అవకాశాలు మరింత పెరిగాయి.

ఈసారి జూలైలో ప‌లువురు యంగ్ హీరోలు త‌మ ల‌క్ ను టెస్ట్ చేసుకోబోతున్నారు. స‌త్య‌దేవ్ రావు బ‌హ‌దూర్, విరాట్ క‌ర్ణ నాగ బంధం, అఖిల్ అక్కినేని లెనిన్, ఘ‌ట్ట‌మ‌నేని డెబ్యూ హీరో జ‌య‌కృష్ణ న‌టించిన శ్రీనివాస మంగాపురం, కిర‌ణ్ అబ్బ‌వ‌రం చెన్నై ల‌వ్‌స్టోరీ, సందీప్ కిష‌న్ సిగ్మా జులైలోనే రిలీజ్ కాబోతున్నాయి. మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఆయా సినిమాల జాన‌ర్లు. ఒక సినిమా విజువల్ ఫాంటసీ ప్రపంచాన్ని పరిచయం చేయడానికి సిద్ధమవుతుండగా, మరో సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. యాక్షన్ డ్రామాలు, థ్రిల్లర్ అంశాలు, అడ్వెంచర్ టచ్ ఉన్న కథలు కూడా వరుసగా రిలీజ్ కానున్నాయి. ఒకే తరహా సినిమాలు కాకుండా ప్రతి వారం భిన్నమైన అనుభూతిని అందించే ప్రయత్నం కనిపిస్తోంది. దీంతో ప్రేక్షకుల అభిరుచి ఏ జానర్ వైపు మొగ్గు చూపుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.

బాక్సాఫీస్ పరంగా కూడా జులై నెల సినిమాల రిజ‌ల్ట్స్ ఇండ‌స్ట్రీకి కీలకం. మిడ్ ఇయర్ సీజన్‌లో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం ఎగ్జిబిటర్లకు ఎంతో అవసరం. వరుసగా సినిమాలు మంచి రెస్పాన్స్ అందుకుంటే థియేటర్ ఆక్యుపెన్సీ పెరగడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఊరటనిస్తుంది. చిన్న, మధ్యస్థాయి సినిమాలు కూడా సరైన కంటెంట్‌తో మంచి క‌లెక్ష‌న్లు సాధించగలవనే నమ్మకాన్ని ఈ నెల మరింత బలపరచే అవకాశం ఉంది.

అదే సమయంలో ఈ రిలీజ్‌లు పలువురు యంగ్ హీరోల కెరీర్‌లను ప్రభావితం చేసే అవకాశమూ ఉంది. సరైన హిట్ అందుకుంటే మార్కెట్ విలువ పెరగడంతో పాటు వారి త‌ర్వాతి సినిమాల రెమ్యూన‌రేష‌న్ లోనూ మార్పు రావచ్చు. పెద్ద నిర్మాణ సంస్థల దృష్టి పడటమే కాకుండా పాన్ ఇండియా స్థాయి ప్రాజెక్టుల అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఒక స‌క్సెస్‌తో కెరీర్ దిశే మారిపోయిన ఉదాహరణలు టాలీవుడ్‌లో ఇప్పటికే చాలానే ఉన్నాయి. అందుకే ఈ జూలై రిలీజ్ సినిమాలు పలువురు యంగ్ హీరోల ఫ్యూచ‌ర్ ను డిసైడ్ చేసే కీలకమైన బాక్సాఫీస్ పరీక్షగా కూడా నిలవబోతోంది.