జూలై బాక్స్ ఆఫీస్ బరిలో క్రేజీ చిత్రాలు!
చలనచిత్ర పరిశ్రమలో ఏటా కొన్ని సీజన్లు బాక్సాఫీస్ వద్ద అత్యంత కీలకంగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో జూలై నెల టాలీవుడ్‌లో సరికొత్త సంచలనాలకు వేదిక కాబోతోంది.
By: Srikanth Kontham | 15 Jun 2026 7:52 PM ISTచలనచిత్ర పరిశ్రమలో ఏటా కొన్ని సీజన్లు బాక్సాఫీస్ వద్ద అత్యంత కీలకంగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో జూలై నెల టాలీవుడ్‌లో సరికొత్త సంచలనాలకు వేదిక కాబోతోంది. విభిన్న కథాంశాలు, విలక్షణమైన జోనర్లు, విజువల్ వండర్స్ ..సరికొత్త వారసుల ఎంట్రీలతో ఈ నెలలో థియేటర్ల వద్ద భారీ సమరమే జరగబోతోంది. ఒకరితో ఒకరు పోటీ పడుతూ క్రేజీ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో నిలవడానికి సిద్ధమవుతున్నాయి. ఈ బాక్సాఫీస్ రేసు జూలై మొదటి వారంలోనే అత్యంత ఆసక్తికరంగా ప్రారంభం కానుంది. జూలై 3న టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా వెంకటేష్ మహా కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న `రావు బహదూర్` చిత్రం థియేటర్లలోకి రాబోతోంది.
అదే రోజున ఈ చిత్రానికి పోటీగా అభిషేక్ నామ భారీ బడ్జెట్‌తో నిర్మించిన మైథలాజికల్ విజువల్ ఎఫెక్ట్స్ వండర్ `నాగబంధం` కూడా విడుదలవుతుంది. స్టార్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్ర పంపిణీ హక్కులను సొంతం చేసుకోవడం తో అంచనాలను మరింత పెంచింది. ఇక జూలై రెండో వారం స్టార్ వారసుల సందడితో భారీ అంచనాలతో మరింత హీటెక్కనుంది. జూలై 10న అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటిస్తోన్న `లెనిన్` చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమా కంటే ఒక రోజు ముందే అంటే జూలై 9న ఘట్టమనేని కుటుంబ వారసుడిగా జయకృష్ణ వెండితెరకు పరిచయమవుతున్న `శ్రీనివాస మంగాపురం` ప్రేక్షకుల ముందుకు రానుంది.
బ్యాక్-టు-బ్యాక్ ఇద్దరు స్టార్ కిడ్స్ బాక్సాఫీస్ వద్ద తలపడటంతో ట్రేడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు ఏ చిత్రానికైనా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో అఖిల్ నటిస్తోన్న `లెనిన్` ఆయన కెరీర్‌కు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారగా.. జయకృష్ణ తన తొలి చిత్రంతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. జూలై హంగామా ఇంతటితో ముగిసిపోలేదు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం మరికొందరు యువ హీరోలు కూడా ఇదే నెలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లైన్లో ఉన్నారు.
విలక్షణమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ నటిస్తున్న `ఎపిక్` చిత్రంతో పాటు.. యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న `చెన్నై లవ్ స్టోరీ` కూడా జూలై రేసులోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి కూడా తోడైతే జూలై బాక్సాఫీస్ మరింత క్రేజీగా మారడం ఖాయం. మొత్తంగా జూలై నెలలో ప్రేక్షకులకు థియేటర్లలో విందు భోజనం లభించబోతోంది. ఒకవైపు మైథలాజికల్ విజువల్ ఎఫెక్ట్స్, మరోవైపు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ డ్రామాలు.. ఇంకోవైపు స్టార్ వారసుల చిత్రాలు ..లవ్ స్టోరీలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఈ భారీ క్లాష్‌లో ఏ చిత్రం బాక్సాఫీస్ విజేతగా నిలుస్తుందో? ప్రేక్షకులు ఏ జోనర్‌కు పట్టం కడతారో ఆసక్తికరంగా మారింది.
