ఏ నటుడికైనా టాలీవుడ్ ఇప్పుడు ఏకైక టార్గెట్!
కారణం ఏదైనా ఇప్పుడు ధనుష్, సూర్య, అజిత్ సహా చాలా మంది హీరోలు తెలుగు మార్కెట్ ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. దళపతి విజయ్ కూడా తెలుగు మార్కెట్ ని విడిచిపెట్టడం లేదు.
By: Tupaki Desk | 5 Sept 2025 8:45 AM ISTఅంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్‌కి పెరిగిన ఇమేజ్ గురించి ఇటీవల ఇతరులు ఎక్కువగా మాట్లాడుతున్నారు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ చిత్రాలు పాన్ వరల్డ్ లో సక్సెస్ సాధించడంతో ప్రతిదీ మారిపోయింది. ఒక రకంగా బాలీవుడ్, కోలీవుడ్ కంటే టాలీవుడ్ గురించి అంతర్జాతీయ మీడియా ఎక్కువగా ప్రచారం కల్పిస్తోంది. రాజమౌళి, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నాయి. ఇది అసాధారణ పరిణామం.
ఇటీవల బాలీవుడ్, కోలీవుడ్ స్టార్లు కూడా టాలీవుడ్ గొప్పతనాన్ని అంగీకరిస్తున్నారు. పొరుగు హీరోలు నిరభ్యంతరంగా టాలీవుడ్ మార్కెట్‌పై కన్నేశారు. తెలుగు పరిశ్రమను కలుపుకుని ద్విభాషా చిత్రాల్లో నటించాలని ఉవ్విళ్లూరుతున్నారు. కోలీవుడ్ హీరోలు ఇప్పుడు దీనికి మినహాయింపు కాదు. కేవలం తమిళంలో రాణిస్తే సరిపోదు.. తెలుగు ఆడియెన్ కి కనెక్టయితేనే పాన్ ఇండియా సక్సెస్ సాధ్యం.
కారణం ఏదైనా ఇప్పుడు ధనుష్, సూర్య, అజిత్ సహా చాలా మంది హీరోలు తెలుగు మార్కెట్ ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. దళపతి విజయ్ కూడా తెలుగు మార్కెట్ ని విడిచిపెట్టడం లేదు. తమిళ హీరోలు నటించిన సినిమాలను రెగ్యులర్ గా తెలుగులోకి అనువదించి రిలీజ్ చేయడం పెద్ద వ్యూహం.
ఇక ఈ వ్యూహంలో కోలీవుడ్ విలక్షణ హీరో ధనుష్ ఇతరుల కంటే మరింత ముందున్నాడు. అతడు నేరుగా తెలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. సర్, కుబేర లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తెలుగులో హ్యాట్రిక్ సినిమాకి సన్నాహకాల్లో ఉన్నాడు. ఇటీవల చాలా మంది తెలుగు దర్శకులు, నిర్మాతలతో చర్చలు జరిపిన అతడు తనకు నచ్చిన ఒక కథను ఓకే చేసాడు. తాజా సమాచారం మేరకు ధనుష్ నటించే మూడో తెలుగు సినిమా దాదాపు ఖరారైనట్టే. నీది నాది ఒకే కథ, విరాట పర్వం వంటి చిత్రాలను దర్శకత్వం వహించిన వేణు ఉడుగుల తో ధనుష్ పని చేస్తారని సమాచారం. చర్చలు చివరి దశలో ఉన్నాయి. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వచ్చే ఏడాది ప్రారంభించే అవకాశం ఉందని తెలిసింది. ధనుష్ ఇటు తెలుగు, అటు హిందీ మార్కెట్ ని కూడా గట్టిగా ఒడిసిపట్టాలని పంతంతో ఉన్నాడు. అందుకే అతడు నేరుగా హైదరాబాద్ - ముంబైతో సత్సంబంధాలను బలంగా కొనసాగిస్తున్నాడు.
