సోషల్ మీడియాలో క్రేజ్... వెండితెరపై ఫెయిల్?
ఒకప్పుడు సినీ పరిశ్రమలో కొత్త నటులను వెతికే విధానం పూర్తిగా భిన్నంగా ఉండేది.
By: Sravani Lakshmi Srungarapu | 25 Feb 2026 6:00 PM ISTఒకప్పుడు సినీ పరిశ్రమలో కొత్త నటులను వెతికే విధానం పూర్తిగా భిన్నంగా ఉండేది. ప్రముఖ యాక్టింగ్ స్కూల్స్, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ల తలుపులు తట్టడం ద్వారా టాలెంటెడ్ యూత్ ను దర్శకనిర్మాతలు ఎంపిక చేసుకునేవారు. అలా వెలుగులోకి వచ్చిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, లోకనాయకుడు కమల్ హాసన్, నజీరుద్దీన్ షా లాంటి మహానటులెంతో మంది ఉన్నారు. ట్రైనింగ్, యాక్టింగ్, స్టేజ్ ఎక్స్‌పీరియెన్స్.. అవే అప్పట్లో అవకాశాలకు ప్రధాన ప్రమాణాలుగా నిలిచేవి.
కానీ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్నవారికి సినీ అవకాశాలు ఈజీ అవుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పాపులారిటీ సంపాదించిన పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇప్పుడు వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు.
బాలీవుడ్ లో రాణిస్తున్న పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు
అలా అవకాశాలు అందుకున్నా వారే భువన్ బామ్, ప్రజక్త కోలి, కుష కపిల, హర్ష్ బెనివాల్. భువన్ బామ్ దిండోర, తాజా కబర్ లాంటి ప్రాజెక్టులతో ఓటీటీ ప్రపంచంలో సక్సెస్ అందుకుంటే, ప్రజక్త కోలి జగ్ జగ్ జీయో ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. కుష కపిల, ఘోస్ట్ స్టోరీస్, సుఖీ లాంటి సినిమాల్లో కనిపించగా, హర్ష్ బెనివాల్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2తో స్క్రీన్ పై మెరిశారు. సోషల్ మీడియాలో వారికున్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా బాలీవుడ్ నిర్మాతలు వారికి ఈ ఛాన్సులు ఇస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది.
టాలీవుడ్ లో రాణించలేకపోతున్న తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్లు
కానీ ఈ విషయంలో టాలీవుడ్ పరిస్థితి భిన్నంగా ఉంది. సోషల్ మీడియా వల్ల మంచి గుర్తింపు పొందిన షణ్ముఖ్, దీప్తి సునైనా, నయని పవని, కుషిత కలపు లాంటి ఇన్‌ఫ్లుయెన్సర్లు సినిమాల్లో ఛాన్సులు అందుకున్నప్పటికీ, వాటితో బిగ్ స్క్రీన్ పై భారీ సక్సెస్ ను అందుకోలేకపోయారు. మొదట్లో సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ద్వారా వారికి అవకాశాలొచ్చినప్పటికీ, తర్వాత బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయారు. టాలీవుడ్ లో సోషల్ మీడియా నేపథ్యంతో వచ్చి మంచి గుర్తింపును తెచ్చుకుంది వైష్ణవి చైతన్య మాత్రమే. బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి అందులో తన యాక్టింగ్ తో మంచి ప్రశంసలు అందుకున్నారు వైష్ణవి. ఆమె తప్ప సోషల్ మీడియా నుంచి వచ్చిన మరెవరూ సక్సెస్ ను అందుకోలేకపోయారు.
దీన్ని బట్టి చూసుకుంటే సోషల్ మీడియాలో వచ్చే ఫేమ మాత్రమే ఇండస్ట్రీలో రాణించడానికి సరిపోదని, దానికి యాక్టింగ్, మంచి కథలను సెలెక్ట్ చేసుకోవడంతో పాటూ స్క్రీన్ ప్రెజెన్స్ లాంటి విషయాలు కూడా ఎంతో కీలకమని అర్థమవుతుంది. మొదట్లో క్రేజ్ కారణంగా ఒకట్రెండు ఛాన్సులొచ్చినా, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి టాలెంటే ముఖ్యమని స్పష్టమవుతోంది. అయితే సినిమాల్లో అనుకున్న సక్సెస్ రాకపోవడంతో కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లుతిరిగి యూట్యూబ్, ఇన్‌స్టాలో కమర్షియల్ కంటెంట్, బ్రాండ్ ప్రమోషన్స్ ను చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. మొత్తానికి, బాలీవుడ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ టు యాక్టర్ ట్రెండ్ వేగంగా పెరుగుతుండగా, టాలీవుడ్‌లో మాత్రం ఆడియన్స్ ఇంకా టాలెంట్ కు ప్రాధాన్యమిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
