సక్సెస్ కోసం రూట్ మారుస్తున్న టైర్ 2 హీరోలు.. వర్కౌట్ అవుతుందా?
ఇండస్ట్రీలోనే కాదు ఏ రంగంలో అయినా సరే సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఆ విజయాన్ని అందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
By: Madhu Reddy | 16 July 2026 11:02 AM ISTఇండస్ట్రీలోనే కాదు ఏ రంగంలో అయినా సరే సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఆ విజయాన్ని అందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మిగతా రంగాలను కాస్త పక్కన పెడితే సినిమా రంగంలో సక్సెస్ లభిస్తేనే మనుగడ ఉంటుంది. లేకపోతే తట్టా బుట్టా సర్దేయాల్సిందే. ఇక సినిమా ఇండస్ట్రీలో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని.. మంచి కథ ఓరియెంటెడ్ తో ఆడియన్స్ ముందుకు వస్తే ఖచ్చితంగా ఆ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఎక్కడైనా బెడిసి కొట్టింది అంటే ఆ హీరో నిలదొక్కుకోవడం కష్టమే. ఇకపోతే టైర్ 2 హీరోలలో కొంతమంది మంచి విజయాలను అందుకుంటుంటే మరికొంతమంది సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ హీరోలు ఎప్పుడూ ఒకే జానర్ లో సినిమాలు చేయకుండా.. అప్పుడప్పుడు రూట్ మార్చి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
వాస్తవానికి స్టార్ హీరోల సినిమాలకు స్టార్ అనే ఒక బ్రాండ్ వారికి తోడైంది కాబట్టి వారి సినిమాలకు మినిమం కలెక్షన్లు వస్తాయన్న గ్యారెంటీ ఉంటుంది.మరోవైపు ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త హీరోలు ఎలాగో చిన్న కథలతోనే వస్తారు కాబట్టి ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే వాళ్లకు మళ్లీ ఇంకో ఛాన్స్ దొరుకుతుంది. కానీ ఎటొచ్చి ఇబ్బంది టైర్ 2 హీరోలకే.. వీరు ఎప్పుడూ కూడా స్టార్ హోదాను దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవేళ తమ సినిమాలు బెడిసి కొట్టాయి అంటే ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఈ మధ్యకాలంలో హీరోలు సక్సెస్ కోసం రూట్ మార్చి హారర్ జోనర్ ను ఎంచుకుంటున్నారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
అందులో భాగంగానే ప్రముఖ హీరో సాయిధరమ్ తేజ్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా విరూపాక్ష సినిమా చేసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఒకప్పుడు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. సక్సెస్ కోసం హార్రర్ జానర్ ను నమ్ముకొని మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఒకప్పుడు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో, మాస్ యాక్షన్ చిత్రాలతో ఆకట్టుకున్న ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ లో భైరవం తర్వాత చేసిన కిష్కిందపురి సినిమా కూడా హారర్ జోనర్ లోనే మంచి విజయాన్ని అందించింది.
ఇక ఆది సాయికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరైన సక్సెస్ కోసం దశాబ్ద కాలానికి పైగా ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్ శంబాల అనే హారర్ సినిమా చేసి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ జానర్ లోకి అడుగుపెట్టిన మరో హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ . ఇండో కొరియన్ నేపథ్యంలో హారర్ కామెడీగా రాబోతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సత్యా, వరుణ్ తేజ్ , రితిక నాయక్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల టీజర్ విడుదల చేయగా.. ఊహించని అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ కూడా తొలిసారి హారర్ కామెడీ జానర్ లోకి అడుగు పెట్టాడు. అటు టీజర్ తో పాటూ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమాతో ఆయన కచ్చితంగా సాలిడ్ హిట్ అందుకుంటారనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా టైర్ 2 హీరోలు ఇప్పుడు హారర్ జోనర్ ను నమ్ముకుని మంచి సక్సెస్ అందుకుంటున్నారు అనే కామెంట్లు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.
