రెండు పడవల మీద ప్రయాణం.. సునాయాసంగా దాటేస్తున్న సెలబ్రిటీస్!
ఇక్కడ ఒక్కసారి అడుగుపెడితే ఇక చదువుకు ఫుల్‌స్టాప్ పడిపోయినట్టే అని అనుకుంటారు.
By: Madhu Reddy | 12 Feb 2026 4:00 PM ISTసినిమా గ్లామర్ ప్రపంచం గురించి ఓ అపోహ అందరికి వుంటుంది. ఇక్కడ ఒక్కసారి అడుగుపెడితే ఇక చదువుకు ఫుల్‌స్టాప్ పడిపోయినట్టే అని అనుకుంటారు. కానీ, ఇప్పటి తరం హీరోయిన్లు ఆ ఆలోచనను పూర్తిగా మార్చేస్తున్నారు. షూటింగ్ సెట్స్‌లో మేకప్‌తో కనిపిస్తూనే, క్యారవాన్‌లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. నటనను కెరీర్‌గా, విద్యను సంస్కారంగా భావిస్తూ అటు సెట్స్‌లో 'యాక్షన్' చెబుతూనే, ఇటు ఎగ్జామ్ హాల్‌లో పెన్ను తిప్పుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు మన టాలీవుడ్ భామలు. మరి ఆ సెలబ్రిటీస్ గురించి మనము చూసేద్దాం..
చదువులోనూ 'టాప్' అంటున్న భామలు:
ఈ కోవకు చెందిన వారిలో మొదటగా మనం చెప్పుకోవాల్సింది ప్రేమమ్ తో పరిచయం అయిన సాయి పల్లవి గురించి. ఈమె కేవలం డాన్సర్, నటి మాత్రమే కాదు.. జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ కూడా. అయితే, సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా తన మెడికల్ వృత్తిని పూర్తిచేశారు. అలాగే ఇక మన సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షూటింగ్ గ్యాప్‌లో కూడా మెడికల్ బుక్స్ చదువుతూ కనిపించేది. మీకు తెలుసా? ఈమె ఇటీవల ఎంబీబీఎస్ పట్టా కూడా పొందింది. ఇక యంగ్ హీరోయిన్ శివానీ రాజశేఖర్ అటు సినిమాలపైన దృష్టి పెడుతూ డాక్టర్ పట్టా పొందారు.
ఇక మన మీనాక్షి చౌదరి మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచిన డెంటల్ సర్జరీ (BDS) పూర్తి చేసింది. ఇకపోతే, ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి కూడా షూటింగ్స్ చేస్తూనే తన డిగ్రీ చదువును కొనసాగిస్తోంది. వీరితో పాటు టాలీవుడ్‌లో మరికొందరు కూడా చదువు లో సత్తా చాటారు. వారిలో అనుపమ పరమేశ్వరన్.. ఈమె కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌లో పట్టా పొందారు. ఇక పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న సైకాలజీ మరియు జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేశారు. అలాగే సంయుక్త మీనన్ ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా పొందింది. ఇంకా ఎందరో టాలీవుడ్ హీరోయిన్స్ చదువు లో సత్తా చాటినవారే అవటం విశేషం.
ఇక ఏ రంగంలో ఉన్నా చదువు అనేది ఒక ఆయుధం అని ఈ తారలు నిరూపిస్తున్నారు. రెండు పడవల ప్రయాణం ప్రమాదం అని అంటారు కానీ, పట్టుదల ఉంటే ఆ ప్రయాణాన్ని సునాయాసంగా సాగించవచ్చని ఈ తారలు నిరూపించారు. వీరంతా కేవలం డబ్బు కోసమో, గ్లామర్ కోసమో చదువును వదిలేయడం లేదు. ఒకవేళ రేపు సినిమా అవకాశాలు తగ్గినా, తమ కాలి మీద తాము నిలబడాలనే ముందుచూపుతో ఉండటం నిజంగా గర్వకారణం. వీరిని చూసైనా నేటి యువత చదువు ప్రాముఖ్యతను తెలుసుకోవాలి.
