మైత్రీ తప్పేంటి? తగ్గించాల్సింది వాళ్ళు కదా..
ముఖ్యంగా మీడియం రేంజ్ నిర్మాతలు ఇలాంటి రెమ్యూనరేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని, దీనివల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు.
By: M Prashanth | 4 April 2026 12:20 AM ISTసోషల్ మీడియాలో రెమ్యూనరేషన్ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా పెద్ద బ్యానర్లు, హీరోల మధ్య జరుగుతున్న డీల్స్ ఇప్పుడు మీడియం రేంజ్ నిర్మాతలకు ఆందోళనగా మారుతున్నాయి. ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఆ సంస్థ ఇప్పటికే ఇండస్ట్రీలో పెద్ద బ్యానర్ గా నిలదొక్కుకుంది. స్టార్ హీరోలతో పాటు మీడియం రేంజ్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంది.
అయితే ఇటీవల కోలీవుడ్ కు చెందిన కొందరు టైర్-2 హీరోల రెమ్యూనరేషన్ డిమాండ్లు చర్చకు దారి తీస్తున్నాయి. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న యాక్టర్ సూరి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం భారీగా రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ విషయంలో కూడా ఇదే తరహా చర్చ జరుగుతోంది. ఆయన తన రాబోయే సినిమా కోసం దాదాపు రూ.50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ ప్రాజెక్ట్ ను కూడా మైత్రీ మూవీ మేకర్సే నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో చర్చ మొదలైంది. భారీ బ్యానర్లు ఇలాంటి పెద్ద మొత్తంలో చెల్లించడం వల్ల, మిగతా నిర్మాతలపై ఒత్తిడి పెరుగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా మీడియం రేంజ్ నిర్మాతలు ఇలాంటి రెమ్యూనరేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని, దీనివల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఆ వ్యవహారంలో మైత్రీ మూవీ మేకర్స్ ను తప్పుబట్టలేమని కొందరు ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎందుకంటే, హీరోలు డిమాండ్ చేసిన మేరకు రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే ప్రాజెక్ట్ ముందుకు సాగడం కష్టమవుతుంది. సినిమా చేయాలంటే హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే.
అందుకే నిర్మాతలు కూడా ఆ డిమాండ్లకు ఒప్పుకోవాల్సి వస్తుందని చెప్పాలి. ఇది పూర్తిగా డిమాండ్-సప్లై పరిస్థితి అని చెప్పాలి. ఒక హీరోకు మార్కెట్ ఉంటే, ఆయన ఎక్కువ రెమ్యూనరేషన్ కోరడం సహజమే. నిర్మాతలు కూడా ఆ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇది ఒక పరిమితి వరకు మాత్రమే సానుకూలంగా ఉంటుంది.
ప్రస్తుతం థియేట్రికల్ కలెక్షన్లు, ఓటీటీ డీల్స్, శాటిలైట్ హక్కులు బడ్జెట్ ను ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో రెమ్యూనరేషన్లు నియంత్రణలో లేకపోతే, సినిమా బిజినెస్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే చాలా మంది నిర్మాతలు హీరోలు తమ రెమ్యూనరేషన్ ను కొంతవరకు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. అందరూ కలిసి పనిచేసే విధంగా ఉంటేనే ఇండస్ట్రీ స్టేబుల్ గా ముందుకు సాగుతుందని భావిస్తున్నారు. భారీ బ్యానర్లు ఇచ్చే రెమ్యూనరేషన్లు ఇతర నిర్మాతలపై ప్రభావం చూపుతున్నాయనే వాదన ఒకవైపు ఉండగా, హీరోల మార్కెట్ విలువకు అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నాయనే వాదన మరోవైపు వినిపిస్తోంది.
