మళ్లీ ఆ హ్యాట్రిక్ డేస్ వస్తాయా?
టాలీవుడ్‌లో హ్యాట్రిక్ హిట్ మాట విని చాలా ఏళ్లవుతోంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస హిట్‌లతో హ్యాట్రిక్ హిట్‌లని సొంతం చేసుకున్న హీరోలున్నారు.
By: Tupaki Desk | 20 Dec 2025 8:00 PM ISTటాలీవుడ్‌లో హ్యాట్రిక్ హిట్ మాట విని చాలా ఏళ్లవుతోంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస హిట్‌లతో హ్యాట్రిక్ హిట్‌లని సొంతం చేసుకున్న హీరోలున్నారు. కానీ ఇప్పడు ఆ మాటే వినిపించడం లేదు. ఒక్క హిట్టుకే సంబరాలు చేసుకుంటున్నారు. అప్పట్లో వంద రోజుల వేడుకలు చేసుకుంటే ఆ తరువాత 50 రోజులు వేడుకలకు పడిపోయారు. ఇప్పుడు డేస్ కాదు ముఖ్యం ఎంత కలెక్ట్ చేసింది అన్నదే చూస్తున్నారు. బడ్జెట్‌కు మించి డబుల్ ప్రాఫిట్‌ని రాబట్టిందా అది హట్టే అని సంబరాలు చేసుకునే సంస్కృతి మొదలైంది.
కెరీర్ తొలి నాళ్లలో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ బ్యాక్‌టు బ్యాక్ సక్సెస్‌లని సొంతం చేసుకుని హ్యాట్రిక్ హిట్‌లని తమ ఖాతాలో వేసుకున్న వారే పవన్ కల్యాణ్ `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`తో కెరీర్ ప్రారంభించాడు. దీనికి తరువాత చేసిన `గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి..ఇలా వరుసగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచి పవన్‌కు డబుల్ హ్యాట్రిక్‌ని అందించాయి.
ఇక సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న మహేష్ కూడా వరుస హిట్‌లతో హ్యాట్రిక్‌ని సొంతం చేసుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించినా హీరోగా మాత్రం కె. రాఘవేంద్రరావు రూపొందించిన `రాజకుమారుడు`తో ఎంట్రీ ఇచ్చాడు. ఇది హిట్ అవగానే ఆ వెంటనే చేసిన `యువరాజు`, వంశీ, మురారి వంటి సినిమాలు కూడా బ్యాక్‌టు బ్యాక్ విజయాల్ని దక్కించుకుని మహేష్ కెరీర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్‌లని అందించాయి.
ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాడు. ఫస్ట్ మూవీ `ఈశ్వర్`తోనే తానేంటో నిరూపించుకున్నాడు. ఆ తరువాత చేసిన రాఘవేంద్ర, వర్షం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచి ప్రభాస్‌ని స్టార్ హీరోగా నిలబెట్టిన విషయం తెలిసిందే. ఈ హ్యాట్రిక్ హిట్‌ల జాబితాలో అల్లు వారి అబ్బాయి అల్లు అర్జున్ కూ చోటుంది. గంగోత్రితో శభాష్ అనిపించుకున్న బన్నీ ఆ తరువాత క్లాస్, మాస్ టచ్‌తో చేసిన ఆర్య, బన్నీ, సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాల్ని దక్కించుకుని తనకు హ్యాట్రిక్‌ని అందించాయి. ఈ నేపథ్యంలోనే మన క్రేజీ స్టార్స్ మళ్లీ హ్యాట్రిక్ హిట్‌లని సొంతం చేసుకోవాలని, అలనాటి రోజుల్ని మళ్లీ గుర్తు చేయాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
