AP టాలీవుడ్‌పై సినిమాటోగ్రఫీ మంత్రి పెద్ద ప్రకటన!
టాలీవుడ్ నేడు ప్రపంచ స్థాయి సినిమాలను అందిస్తోంది. గత దశాబ్ధంతో పోలిస్తే, ఈ దశాబ్ధంలో సినిమా కంటెంట్ పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
By: Tupaki Desk | 19 May 2025 9:53 AM ISTటాలీవుడ్ నేడు ప్రపంచ స్థాయి సినిమాలను అందిస్తోంది. గత దశాబ్ధంతో పోలిస్తే, ఈ దశాబ్ధంలో సినిమా కంటెంట్ పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. మునుముందు తెలుగు సినిమా కథలు, కాన్సెప్టులు మరింత మారనున్నాయి. భవిష్యత్ లో హాలీవుడ్ కి ధీటుగా ఎంపిక చేసుకునే కథ- కాన్వాసు, తారాగణం కూర్పు, విజువలైజేషన్‌లో, సంగీతంలో చాలా మార్పులు రాబోతున్నాయి. ఇప్పటికే హాలీవుడ్ స్టాండార్డ్స్ ని అందుకుని సినిమా స్థాయిని పెంచారు మన ఫిలింమేకర్స్.
ఇలాంటి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో సినీపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వాలు చేస్తున్నది ఏమిటి? అంటే.. దానికి సమాధానం - గుండు సున్నా! ప్రభుత్వ పెద్దలు కేవలం డిప్లమాటిక్ ప్రకటనలకు పరిమితమయ్యారు మినహా పరిశ్రమ కోసం నిజాయితీగా చేస్తున్నదేమీ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకుముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు సినీపరిశ్రమ కోసం గద్దర్ అవార్డులు అందజేస్తామని ప్రకటించారు. దీనికి తెలుగు సినీపెద్దలు హర్షం వ్యక్తం చేసారు. ప్రభుత్వానికి సహకరించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని అన్నారు. కానీ ఇంతలోనే వేడి తగ్గిపోయింది. ఇటీవల గద్దర్ అవార్డుల గురించి మరో అధికారిక అప్ డేట్ లేకపోవడంతో లైట్ తీస్కున్నారనే విమర్శలొస్తున్నాయి.
మరోవైపు తెలంగాణ నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు నంది అవార్డులు ఎలానూ ఉన్నాయి. కానీ ఏపీ రాజధాని సమస్య సహా చాలా ఇతర సమస్యలతో పోరాడుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఎఫ్‌డిసి నిర్వీర్యంగా ఉందనే విమర్శల నడుమ అప్పుడప్పుడూ కంటితుడుపు ప్రకటనలతో సరిపుచ్చుతోంది. తెలుగు సినీపరిశ్రమ ఏపీలో అభివృద్ధి చెందుతుందని ఎఫ్.డి.సి పెద్దలు ప్రకటిస్తుంటారు కానీ దానికి ప్రణాళిక ఏమిటన్నది ఎవరికీ ఏమీ తెలియదు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మైక్ ముందుకు వచ్చిన ప్రతిసారీ ఆంధ్రప్రదేశ్ సినిమా అభివృద్ధి గురించి మాట్లాడతారు. కానీ మొదటి అడుగు అయినా ఎప్పటికి పడుతుందో ఎవరికీ అర్థం కాదు. రాష్ట్రంలో సినిమా స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రీరికార్డింగ్ థియేటర్ల ఏర్పాటు, సినిమా అభివృద్ధికి షూటింగ్ లొకేషన్లకు మౌళిక వసతుల వృద్ధి వంటి అంశాలను కందుల ప్రస్థావిస్తున్నారు. కానీ కార్యచరణ మాత్రం శూన్యంగా మారింది.
ఇలాంటి సమయంలో మరోసారి ఆయన విశాఖ నగరంలో తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధి జరుగుతుందని, హైదరాబాద్ తరహాలో విశాఖలో పరిశ్రమను అభివృద్ధి చేస్తామని రొటీన్ గా ప్రకటించారు. తెలంగాణ కంటే ఏపీ అద్భుత సౌందర్యం, ప్రకృతి వనరులతో సహజమైన లొకేషన్లను కలిగి ఉందని అయితే సినిమాల చిత్రీకరణకు వెళ్లేందుకు అనుకూల వాతావరణం కల్పించాల్సి ఉందని, వసతులు పెంచాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు దీనిపై ఆలోచిస్తున్నారని కూడా అన్నారు. అయితే ఇది కూడా ఆచరణకు రాని, మరో డిప్లమాటిక్ ప్రకటన అని నమ్మేలా ఉందని ప్రజల నుంచి విమర్శలొస్తున్నాయి. అలాగే నంది అవార్డుల పునరుద్ధరణకు పరిశ్రమ పెద్దలు, కళాకారులతో సమావేశం ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కానీ దానికి కచ్ఛితమైన ప్రణాళికను మాత్రం సిద్ధం చేసిందే లేదు!
