Begin typing your search above and press return to search.

తెలుగు హీరోల ఫ్యాన్స్ X దర్శన్ ఫ్యాన్స్.. ఏం జరుగుతోంది?

సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోలకు చెందిన ఫ్యాన్స్ మధ్య ఎప్పటికప్పుడు డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి.

By:  Tupaki Desk   |   6 July 2025 11:14 PM IST
తెలుగు హీరోల ఫ్యాన్స్ X దర్శన్ ఫ్యాన్స్.. ఏం జరుగుతోంది?
X

సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోలకు చెందిన ఫ్యాన్స్ మధ్య ఎప్పటికప్పుడు డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఏదో ఒక టాపిక్ తో తరచూ గొడవపడుతుంటారు.. తిట్టుకుంటూ ఉంటారు.. పరస్పరం నిందించుకుంటూ ఉంటారు.. పోస్ట్ పెడుతుంటారు.. కానీ ఇప్పుడు ఒక్కసారిగా అంతా ఒక్కటయ్యారు.

కన్నడ హీరో దర్శన్ అభిమానులపై మనోళ్లు మండిపడుతున్నారు. వారు పెడుతున్న తప్పుడు పోస్టులకు దీటైన సమాధానమిస్తున్నారు. విమర్శలకు సరైన కౌంటర్స్ ఇస్తున్నారు. హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. హత్య కేసులో నిందితుడైన హీరోను మళ్లీ సపోర్ట్ చేస్తారా అని ఫైర్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే?

కర్ణాటకలో దర్శన్ ఫ్యాన్ రేణుకా స్వామి మర్డర్ కేసు ఎలాంటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. నటి పవిత్ర గౌడకు అతడు అసభ్యకరమైన సందేశాలు పంపించాడనే కారణంతో హత్య చేయించినట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసులో దర్శన్‌, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ సహా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఆ తర్వాత రేణుక స్వామి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే సమయంలో దర్శన్‌, పవిత్ర గౌడతోపాటు పలువురు నిందితులు కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించగా.. డిసెంబరులో వీరికి బెయిల్‌ మంజూరు అయింది. దీంతో వారంతా బయటకు వచ్చారు.

ఇప్పుడు.. మళ్లీ సినిమాలు చేసేందుకు దర్శన్ రెడీ అవుతున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ తెగ పోస్టులు పెడుతున్నారు. ప్రతి విషయంలో కూడా దర్శన్ ను సమర్థిస్తున్న వారు.. ఇప్పుడు ట్వీట్లు చేస్తూ ఎలివేషన్ ఇస్తున్నారు. అది నచ్చని టాలీవుడ్ నెటిజన్లు.. హత్య కేసు నిందితుడికి ఎలివేషన్ ఎందుకని క్వశ్చన్ చేస్తున్నారు.

దీంతో అది మింగుడుపడని దర్శన్ అభిమానులు.. టాలీవుడ్ హీరోలపై తప్పుడు విమర్శలు చేస్తున్నారు. అసభ్య పదాలు వాడుతూ పోస్టులు పెడుతున్నారు. వరస్ట్ హ్యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇంకేముంది.. వెంటనే టాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ అంతా ఒకటై వారికి కౌంటర్స్ పైన కౌంటర్స్ ఇస్తున్నారు. గట్టిగా ఆన్సర్స్ ఇస్తూ బుద్ధి చెబుతున్నారు.