మిస్ ఐనా.. కాకున్నా.. మిస్ వరల్డ్ పై టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ఫోకస్
ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న పోటీల విషయానికి వస్తే.. మిస్ వరల్డ్ కిరీటం ఎవరికి దక్కుతుందో అనే ఆసక్తి నెలకొంది. భారత్ నుంచి 1966లో తొలిసారిగా రీటా ఫారియా విజేతగా నిలిచింది.
By: Tupaki Desk | 4 May 2025 3:00 PMహైదరాబాద్ వేదికగా జరగనున్న మిస్ వరల్డ్ పోటీలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వీటిని ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది. మే 10 నుంచి 31వ తేదీ వరకు జరిగే పోటీలకు ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన అందగత్తెలు మన దేశానికి చేరుకుంటున్నారు.
మిస్ బ్రెజిల్ జెస్సికా స్కాండియుజి పెడ్రోసో హైదరాబాద్ లో కాలుపెట్టారు. మొత్తం 120 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ అందాల పోటీల్లో భారత్ తరఫున రాజస్థాన్ యువతి ప్రాతినిధ్యం వహించనున్నారు. పాల్గొంటున్నది 120 దేశాల వారే అయినా.. 150 పైగా దేశాలలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. 8 తేదీ నాటికి మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనే యువతులు హైదరాబాద్ చేరుకోనున్నారు.
ఈ నెల 10న గచ్చిబౌలిలో మొదలయ్యే పోటీలు 31న గ్రాండ్ ఫైనల్స్ తో ముగియనున్నాయి. కాగా, 1996 తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. అప్పట్లో బెంగళూరులో జరిగిన పోటీలను బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు చెందిన ఏబీసీఎల్ కార్పొరేషన్ నిర్వహించింది.
ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న పోటీల విషయానికి వస్తే.. మిస్ వరల్డ్ కిరీటం ఎవరికి దక్కుతుందో అనే ఆసక్తి నెలకొంది. భారత్ నుంచి 1966లో తొలిసారిగా రీటా ఫారియా విజేతగా నిలిచింది. 1994లో ఐశ్వర్యారాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ టైటిల్స్ సాధించారు.
గమనార్హం ఏమంటే.. మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన భారతీయ యువతుల్లో రీటా ఫారియా తప్ప అందరూ సినీ రంగంలో కాలుపెట్టారు. మరి హైదరాబాద్ లో జరుగుతున్న పోటీల పైనా సినీ రంగం కన్ను ఉంటుంది అనడంలో సందేహం లేదు.
టాలీవుడ్ డైరక్టెర్ల కన్ను?
మిస్ వరల్డ్ పోటీల విజేతలకు ఎలాగూ సినీ, మోడలింగ్ అవకాశాలు వెల్లువెత్తుతాయి. కానీ, అందరూ విజేతలుగా నిలవలేరు కదా..? అయితే, పాల్గొనే వారంతా అందగత్తెలే అనే సంగతి మర్చిపోవద్దు.
అసలే టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తోంది. సందీప్ రెడ్డి వంగా వంటి తెలుగు దర్శకులు బాలీవుడ్ వరకు వెళ్లి సంచలనాలు రేపుతున్నారు. ఇక ఎస్ఎస్ రాజమౌళి వంటి దర్శకుల సంగతి చెప్పక్కర్లేదు. పలువురు టాలీవుడ్ దర్శకులు పాన్ ఇండియా స్థాయి సినిమాలు తీస్తున్నారు. తెలుగులోనే అనిల్ రావిపూడి వంటివారు అద్భుతమైన కామెడీ టైమింగ్ తో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఇలాంటివారి ఫోకస్ తాజాగా మిస్ వరల్డ్ పోటీలపై ఉంటుంది అనడంలో సందేహం లేదు.
మరి హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీల నుంచి ఎంతమంది సినీ రంగంలో అడుగుపెడతారో చూద్దాం..