మన డైరెక్టర్.. బయటి హీరో.. బ్లాక్ బస్టరే
ఒకప్పుడు మన హీరోలు వేరే భాషల దర్శకుల వెంట పడేవాళ్లు. ముఖ్యంగా తమిళ దర్శకులంటే తెగ మోజు ఉండేది.
By: Tupaki Desk | 21 Jun 2025 7:00 AM ISTఒకప్పుడు మన హీరోలు వేరే భాషల దర్శకుల వెంట పడేవాళ్లు. ముఖ్యంగా తమిళ దర్శకులంటే తెగ మోజు ఉండేది. ఇక్కడ ఆ దర్శకులు చేసిన సినిమాల సక్సెస్ రేట్ అంతంతమాత్రమే అయినా.. వాళ్ల వెంట పడడం మానేవారు కాదు మన హీరోలు. ఒకప్పటితో పోలిస్తే తమిళ దర్శకులు తెలుగులో చేస్తున్న సినిమాలు తగ్గినా సరే.. ఎప్పుడో ఒకసారి ఓ సినిమా వచ్చినా అది బోల్తా కొడుతూనే ఉంది.
లింగుస్వామితో రామ్ చేసిన ది వారియర్ పెద్ద డిజాస్టర్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య చేసిన కస్టడీ గురించి చెప్పాల్సిన పని లేదు. అంతకంటే ముందు మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన స్పైడర్ కూడా ఆల్ టైం డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఇక ఏడాది లెజెండరీ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ కలయికలో వచ్చిన గేమ్ చేంజర్ సైతం తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. మన హీరోలకు తమిళ దర్శకులు ఇలా షాకుల మీద షాకులు ఇస్తుంటే.. మన దర్శకులు తమిళ, మలయాళ హీరోలకు వరుసగా బ్లాక్‌బస్టర్లు అందిస్తుండడం విశేషం.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి కల్ట్ మూవీస్ చేశాడు. వీటిలో దేనికి అదే సాటి. మలయాళంలో గొప్ప కంటెంట్ ఉన్న సినిమాలు వస్తుంటాయి కానీ.. అక్కడ దుల్కర్ చేసిన సినిమాలు కూడా వీటిని బీట్ చేయలేవంటే అతిశయోక్తి కాదు. ఇక తమిళ హీరో ధనుష్ తెలుగులో రెండు అద్భుతమైన చిత్రాల్లో నటించాడు. ఇప్పటికే వెంకీ అట్లూరితో సార్ సినిమా చేసి పెద్ద హిట్ అందుకున్నాడు. అది గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడేమో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అతను నటించిన కుబేర అదిరిపోయే టాక్ వస్తోంది.
ధనుష్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశాడు. ఎన్నో అవార్డులూ అందుకున్నాడు. కానీ కుబేరలో చేసిన దేవా అనే బిచ్చగాడి పాత్రను వాటన్నింటికీ మించి కొనియాడుతున్నారు. తన కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇదే. అంతే కాదు ఈ సినిమా ధనుష్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గానూ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా వరుసగా తెలుగు దర్శకులకు పరభాషా కథానాయకులకు ఘనవిజయాలు అందిస్తుండడం విశేషమే. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సూర్య సైతం వెంకీ అట్లూరి సినిమాతో ఇలాగే విజయాన్నందుకుంటాడేమో చూడాలి.
