Begin typing your search above and press return to search.

వీళ్లు మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేది ఎప్పుడు?

ఏ ముహూర్తాన రాజ‌మౌళి `బాహుబ‌లి`ని ప్రారంభించి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా విడుద‌ల చేశాడో ఆ క్ష‌ణం నుంచి టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో టెన్ష‌న్ మొద‌లైంది.

By:  Tupaki Desk   |   7 April 2025 10:30 AM
వీళ్లు మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేది ఎప్పుడు?
X

ఏ ముహూర్తాన రాజ‌మౌళి `బాహుబ‌లి`ని ప్రారంభించి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా విడుద‌ల చేశాడో ఆ క్ష‌ణం నుంచి టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో టెన్ష‌న్ మొద‌లైంది. ఈ సినిమాతో ప్ర‌భాస్‌ని పాన్ ఇండియా స్టార్‌గా నిల‌బెట్టి మిగ‌తా హీరోల‌కు టార్గెట్‌లు సెట్ చేసిన జ‌క్క‌న్న ఆ త‌రువాత కూడా అదే స్థాయిలో సినిమాలు చేస్తుండ‌టం తెలిసిందే. `బాహుబ‌లి` బ్లాక్ బ‌స్ట‌ర్‌తో టాలీవుడ్ సినిమా స్వ‌రూప‌మే మారిపోయింది. మార్కెట్ స్థాయి కూడా పెర‌గ‌డంతో ప్ర‌తి హీరో ఇప్పుడు పాన్ ఇండియా జ‌పం చేస్తున్నాడు.

హీరోల‌తో పాటు ద‌ర్శ‌కుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. రాజ‌మౌళి సెట్ చేసిన టార్గెట్ బీట్ చేయ‌లేక‌పోయినా ఆ స్థాయికి ద‌రిదాపుల్లోకి వెళ్లే సినిమాలు అయినా చేయాల‌ని క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. కానీ మ‌న డైరెక్ట‌ర్ల‌కు హీరోలు దొర‌క‌డం లేదు. దీంతో ఏళ్ల త‌ర‌బ‌డి స్టార్స్ కోసం మ‌న డైరెక్ట‌ర్లు వేచి చూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. కొంత మంది ద‌ర్శ‌కులు స్టార్ల కోసం ఎదురు చూస్తూ ఏళ్లు గ‌డిపేస్తుంటే మ‌రి కొంత మంది మాత్రం ఎలాంటి సౌండ్ చేయ‌కుండా సైలెంట్ అయిపోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ఈ లిస్ట్‌లో ముందు వ‌రుస‌లో వినిపిస్తున్న పేరు వంశీ పైడిప‌ల్లి. మున్నా, బృందావ‌నం, ఎవ‌డు, ఊపిరి, మ‌హ‌ర్షి, వార‌సుడు వంటి సినిమాల‌తో స్టార్ డైరెక్ట‌ర్‌గా గుర్తింపు పొందిన వంశీ నుంచి సినిమా వ‌చ్చి రెండేళ్లు దాటింది. ఆయ‌న నుంచి 2023 జ‌న‌వ‌రిలో వ‌చ్చిన మూవీ `వార‌సుడు`. దీని త‌రువాత ఆయ‌న మ‌రో సినిమా ప్ర‌క‌టించ‌లేదు. అంత‌కు ముందు మ‌హేష్‌తో భారీ ప్రాజెక్ట్ అనుకున్నా అది కుద‌ర‌లేదు. ఇప్ప‌టికైనా వంశీ పైడిప‌ల్లి మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌స్తాడా అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కామెంట్ చేస్తున్నాయి.

ఇక ఈయ‌న త‌రువాత వ‌రుస‌లో ఉన్న డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ అడ్డాల‌. `కొత్త బంగారు లోకం`తో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు పొందిన శ్రీ‌కాంత్ అడ్డాల ఆ త‌రువాత ఆశించిన విజ‌యాల్ని ద‌క్కించుకోలేక‌పోయాడు. అసుర‌న్ రీమేక్ `నార‌ప్ప‌`తో స‌క్సెస్‌ని ద‌క్కించుకున్నా కానీ ఆ త‌రువాత `పెద‌కాపు -1`తో మ‌ళ్లీ ఫ్లాప్‌ని ఎదుర్కొన్నారు. ఈయ‌న నుంచి ఏడాదిన్న‌ర కావ‌స్తున్నా మ‌రో ప్రాజెక్ట్ గురించి ప్ర‌క‌ట‌న లేదు. ఇక శివ నిర్వాణ ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. `ఖుషి` సినిమాతో ఫ‌ర‌వాలేదు అనిపించిన ఈ డైరెక్ట‌ర్ ఏడాదిన్న‌ర‌గా సైలెంట్ అయిపోయారు.

స్టైలిష్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న సురేంద‌ర్‌రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. అఖిల్‌తో `ఏజెంట్‌` మూవీని రూపొందించి డిజాస్ట‌ర్ ని మూట‌గ‌ట్టుకున్న ఈయ‌న నుంచి సినిమా వ‌చ్చి రెండేళ్ల‌కు పైనే అవుతోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో సినిమా చేయాల‌నుకున్నారు. `ఏజెంట్‌` ఫ్లాప్‌, ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీ కావ‌డంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయినా స‌రే ఈ డైరెక్ట‌ర్ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని ఇంత వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. ఈ డైరెక్ట‌ర్లు ఈ ఏడాదైనా కొత్త ప్రాజెక్ట్‌ల‌ని ప్ర‌క‌టించి మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌ని సినీ ప్రియులు కోరుకుంటున్నారు.