Begin typing your search above and press return to search.

ప్రొడ్యూసర్స్ మీట్: తలుపులను తన్నుకుంటు వెళ్లిపోయిన అగ్ర నిర్మాత?

అదే సమయంలో, థియేటర్ అద్దె కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఎగ్జిబిటర్లు, జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లను మూసివేస్తామని నిర్మాతలకు ముందుగా లేఖ రాయాలని నిర్ణయించారు

By:  Tupaki Desk   |   21 May 2025 11:28 PM IST
ప్రొడ్యూసర్స్ మీట్: తలుపులను తన్నుకుంటు వెళ్లిపోయిన అగ్ర నిర్మాత?
X

తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. థియేటర్ యాజమాన్యానికి వచ్చే ఆదాయం తగ్గిపోవడం, టికెట్ ధరలు పెరగడం, సరైన కంటెంట్ లేని చిత్రాలు విడుదలవుతుండటంతో పాటు ఓటీటీ కంటెంట్ కు అలవాటు పడడంతో ప్రేక్షకులు థియేటర్లను దగ్గర నుండి తప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో షెడ్యూల్ చేసిన సినిమాలకు థియేటర్లు దొరకడం కూడా కష్టంగా మారుతోంది. అదే సమయంలో, థియేటర్ అద్దె కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఎగ్జిబిటర్లు, జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లను మూసివేస్తామని నిర్మాతలకు ముందుగా లేఖ రాయాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంతో సమస్యను పరిష్కరించేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ ఉదయం డిస్ట్రిబ్యూటర్ల సమావేశం, సాయంత్రం నిర్మాతల సమావేశంగా రెండు విడతలుగా జరగ్గా, 40 మంది వరకు హాజరయ్యారు. ఉమ్మడిగా తీసుకున్న అభిప్రాయం ఏమిటంటే... సమ్మె లాంటి దశకు వెళ్లకుండా, థియేటర్లు నడుస్తూనే సమస్యను పరిష్కరించుకోవాలని.

గతంలో షూటింగ్ స్టాప్ చేసినా, థియేటర్లు మూసినా పెద్దగా ఉపయోగం లేదన్న అనుభవంతో ఈసారి సంయమనం పాటించాలని భావించారు. పైగా జూన్ నెలలో వరుసగా భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో ఇప్పుడు థియేటర్లు మూసేస్తే ఆర్థికంగా పెద్ద నష్టం వాటిల్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన డిమాండ్ల పట్ల కొందరు నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముఖ్యంగా రెంటల్ పద్ధతిని మార్చి షేరింగ్ బేస్ మోడల్ ప్రవేశపెట్టాలన్న సూచనపై అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై ఫిలింఛాంబర్ లో తీవ్ర వాదనలు చోటుచేసుకున్నాయి. వాయిదా పడిన నిర్ణయాలతో సమావేశం క్లిష్టంగా ముగిసింది. ఇవన్నీ జరుగుతుండగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కోపంతో సమావేశం మధ్యలోనే హాలులో తలుపులు తన్నుకుంటూ బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం.

షేరింగ్ బేస్ విషయంలో సురేష్ బాబు అభిప్రాయాన్ని సరైన విధంగా పరిగణించకపోవడమే దీనికి కారణంగా చర్చల్లో ఉంది. ఈ సంఘటన సమావేశానికి ప్రధాన చర్చగా మారింది. ఇక ఈ సమావేశంలో రెంటల్ మోడల్ వల్ల వచ్చే లాభనష్టాలు, షేరింగ్ మోడల్ వల్ల వచ్చే పారదర్శకత, థియేటర్ల లాభాల సరిపంపిణీ లాంటి అంశాలపై వాడివేడిగా చర్చలు జరిగినట్లు సమాచారం.

ప్రొడ్యూసర్లంతా వచ్చే వారంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో మరోసారి భేటీ కావాలని భావిస్తున్నారు. ఆ సమయంలో ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం జూన్ నుంచి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉండటం, బడ్జెట్ పరంగా వందల కోట్ల పెట్టుబడులు దాగి ఉండటంతో, సినిమాలు విడుదలకు బ్రేక్ వేయడమంటే డైరెక్ట్‌గా పరిశ్రమకే పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. అందుకే అన్ని వర్గాలు త్వరగా పరిష్కారానికి రావాలని కోరుకుంటున్నారు.