ఇమేజ్ ను పక్కనబెడితే కనక వర్షమే!
ఒకప్పుడు సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే భారీ బడ్జెట్లు, వందల కోట్ల వ్యయంతో కూడిన విజువల్ ఎఫెక్ట్స్, స్టార్ హీరోల ఇమేజ్ మాత్రమే సరిపోతాయని భావించేవారు.
By: Srikanth Kontham | 26 Aug 2026 7:00 PM ISTఒకప్పుడు సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే భారీ బడ్జెట్లు, వందల కోట్ల వ్యయంతో కూడిన విజువల్ ఎఫెక్ట్స్, స్టార్ హీరోల ఇమేజ్ మాత్రమే సరిపోతాయని భావించేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుల అభిరు చి కూడా మారుతోంది. ప్రస్తుతం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి భారీ హంగులు మాత్రమే సరిపోవని, తెరపై కనిపించే కథలో బలం ఉండాలని చిత్ర పరిశ్రమ స్పష్టంగా గ్రహిస్తోంది. ఈ కొత్త ట్రెండ్‌కు నిదర్శనంగా ఇటీవలి కాలంలో వచ్చిన అనేక సినిమాలు నిలుస్తున్నాయి. స్టార్ ఇమేజ్‌ను నమ్ముకోకుండా విభిన్నమైన కథాంశాలతో వస్తోన్న చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద భారీ ఆదరణ లభిస్తోంది.
సమంత ప్రధాన పాత్రలో రిలీజ్ అయిన `మా ఇంటి బంగారం`, అఖిల్ అక్కినేని నటించి `లెనిన్`, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన `కొరియన్ కనకరాజు`, మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం `ఇరుముడి` వంటి ప్రాజెక్ట్‌లు కొత్త కోణానికి అద్దం పడుతున్నాయి. ఈ చిత్రాలన్నీ సాధారణ ఇమేజ్ హంగులకు దూరంగా పూర్తిగా కంటెంట్ ... పాత్రల చుట్టూ తిరిగే కథాంశాలతో రూపుదిద్దుకున్నాయి. స్టార్ హీరోల ఇమేజ్, భారీ మార్కెట్ సమీకరణాలను పక్కన పెట్టి దర్శకుని విజన్‌ను నమ్మి చేసిన చిత్రాలివి. ప్రేక్షకులు కూడా రొటీన్ కమర్షియల్ ఫార్ములాను పక్కన పెట్టి కొత్తదనం ఉన్న కథలను ఎప్పుడూ ఆదరిస్తారని ఈ చిత్రాల ఫలితాలో మరోసారి నిరూపితమవుతోంది.
ఇతర భాషల ప్రేక్షకులు సైతం బలమైన కంటెంట్ ఉన్న తెలుగు చిత్రాలకు బ్రహ్మరథం పడుతున్నారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. భాషా భేదాలతో సంబంధం లేకుండా ఎమోషనల్ కనెక్ట్ ఉన్న సినిమాలను గ్లోబల్ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్న తీరు అద్భుతంగా ఉంది. దీంతో నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ రిస్క్‌ల కంటే కంటెంట్ బేస్డ్ సినిమాల వైపు మొగ్గు చూపడానికి ఆసక్తిగా ఉన్నారు. ఇది తెలుగు పరిశ్రమ పరిధిని మరింత విస్తృతం చేస్తోంది.
నటీనటులు కూడా రెగ్యులర్ ఇమేజ్ ట్రాప్ నుంచి బయటపడి విలక్షణమైన పాత్రలు చేయడానికి ఈ ట్రెండ్ ఎంతగానో దోహదపడుతోంది. ప్రయోగాత్మక చిత్రాలు సైతం కమర్షియల్‌గా మంచి విజయాలను నమోదు చేయోచ్చ ని నిరూపితమవుతుండటంతో దర్శక నిర్మాతల్లో కొత్త ఉత్సాహం వెల్లువెత్తుతోంది. భవిష్యత్ లో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల హవా మరింత ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇమేజ్ కంటే కంటెంటే రాజు అనే నిజాన్ని టాలీవుడ్ మరోసారి బలంగా చాటి చెబుతోంది.
భారీ బడ్జెట్ల ప్రయోగాలు విఫలమైన చోట బలమైన కథాంశాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ సరికొత్త ధోరణి ఇండియన్ సినిమా స్థాయిని మరింత పెంచి భవిష్యత్తులో మరిన్ని గొప్ప చిత్రాలు రావడానికి బాటలు వేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
