Begin typing your search above and press return to search.

చంద్రబాబుతో టాలీవుడ్ ప్రముఖుల భేటీ.. సమస్యలు క్లియర్ అవుతాయా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు సమావేశం కానున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Jun 2025 3:47 PM IST
చంద్రబాబుతో టాలీవుడ్ ప్రముఖుల భేటీ.. సమస్యలు క్లియర్ అవుతాయా?
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు సమావేశం కానున్న విషయం తెలిసిందే. జూన్ 15వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సీఎంతో టాలీవుడ్ ప్రముఖుల సమావేశం జరగనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.

ముందుగా జూన్ 22వ తేదీ అనుకోగా.. ఆ తర్వాత ఆదివారమే సమావేశం అయ్యేందుకు సినీ ఇండస్ట్రీ పెద్దలు నిర్ణయించారు. అయితే తనతో చర్చించేందుకు సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా కలిసి రావాలని చంద్రబాబు ఇప్పటికే సూచించారు. రేపు జరగనున్న సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారధ్యం వహించనున్నారు.

సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలతోపాటు ఇటీవల టాలీవుడ్ లో నెలకొన్న పరిణామాలపై ముఖ్యమంత్రితో ఇండస్ట్రీ ప్రముఖులు చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ చేసుకునేందుకు కావాల్సిన అనుమతులు, లొకేషన్ విషయం, పన్నుల విధానం తదితర అంశాలపై సీఎంతో ఇండస్ట్రీ పెద్దలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఏపీలో ఉన్న థియేటర్స్ సదుపాయాలతో పాటు అన్ని విషయాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అధికారులు రంగంలోకి దిగారు. పలు ప్రాంతాల్లో ఉన్న థియేటర్స్ లో తనిఖీలు చేపట్టారు. ఇప్పుడు ఆ విషయంపై కూడా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.

కాగా, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటుతున్నా.. సీఎంను టాలీవుడ్ నుంచి ఎవరూ వచ్చి కలవకపోవడంతో డిప్యూటీ సాబ్ పవన్ ఇటీవల తీవ్రంగా మండిపడ్డారు. తాను చెప్పినా.. కూడా కలవలేదని చెప్పారు. అందుకే తమకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను అదే విధంగా స్వీకరిస్తారని వార్నింగ్ ఇస్తూ నోట్ కూడా రిలీజ్ చేశారు.

ఇకపై సినీ ప్రముఖులు తనను ఎవరూ వ్యక్తిగతంగా కలవొద్దని చెప్పారు. ఆ తర్వాత పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. మంత్రి దుర్గేష్ తాము ఎవరికీ ఇబ్బంది పెట్టమని, అంతా కలిసి వస్తే చర్చలకు సిద్ధమని చెప్పారు. ఇప్పుడు అలాంటి పరిణామాల మధ్య జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ప్రభుత్వం, ఇండస్ట్రీ పెద్దల మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయో వేచి చూడాలి.