Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ఖాళీ..!

ఈ వారంలో పెద్ద సినిమాలు ఏమీ లేవు. విడుదలైన సినిమాలు కూడా పెద్దగా బజ్‌ను క్రియేట్‌ చేయడంలో విఫలం అయ్యాయి.

By:  Tupaki Desk   |   11 July 2025 1:04 PM IST
టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ఖాళీ..!
X

ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు సైతం చిన్న వసూళ్లే నమోదు అవుతున్నాయి. ఇటీవల నితిన్‌ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన 'తమ్ముడు' సినిమా వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. నితిన్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన సినిమాల జాబితాలో తమ్ముడు నిలిచింది. దాంతో ఒక మోస్తరు అంచనాలు పెరిగాయి. పబ్లిసిటీ కూడా భారీగా చేశారు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడంలో విఫలం అయింది. ఆ సినిమాకు సోలో రిలీజ్ ఛాన్స్ దక్కినా పెద్దగా ప్రయోజనం లేదు. ఈ వారంలో పెద్ద సినిమాలు ఏమీ లేవు. విడుదలైన సినిమాలు కూడా పెద్దగా బజ్‌ను క్రియేట్‌ చేయడంలో విఫలం అయ్యాయి.

ఈ వారం ప్రేక్షకుల ముందుకు సుహాస్‌ నటించిన 'ఓ భామ అయ్యో రామ' అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకు పబ్లిసిటీ బాగానే చేసినా కూడా పెద్దగా జనాల దృష్టిని ఆకర్షించలేదు. సినిమా విడుదలైన తర్వాత వచ్చే పబ్లిక్‌ టాక్‌తో సినిమా ఏమైనా పుంజుకుంటుందేమో చూడాలి. ఇప్పటి వరకు థియేటర్ల వద్ద జనాలు లేక వెలవెల పోతున్నాయి. సుహాస్‌ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమాకు డీసెంట్‌ ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నారు. కానీ కొన్ని సెంటర్స్ మినహా ఎక్కడా మినిమం బుకింగ్ నమోదు కావడం లేదని తెలుస్తోంది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తే ఫస్ట్‌ షో నుంచి పబ్లిక్‌ సినిమా వైపు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి.

గత వారం ప్రేక్షకులు సినిమాను చూసేందుకు థియేటర్‌కి వెళ్దామంటే మంచి సినిమాలు లేకుండా పోయాయి. ఉన్న సినిమాల్లో ఏ ఒక్కటి కనీసం బాగుంది అనిపించుకోలేదు. దాంతో గత వారం బాక్సాఫీస్ వద్ద సందడి వాతావరణం లేదు. కనీసం ఈ వారంలో అయినా థియేటర్ల వద్ద సందడి ఉంటుందని అనుకుంటే అది కూడా కనిపించడం లేదు. సుహాస్‌ సినిమాతో పాటు ఆర్కే నాయుడు చిత్రం '100' విడుదలైంది. చక్రవాకం సీరియల్‌తో మంచి గుర్తింపు దక్కించుకున్న ఆర్ కే నాయుడు విభిన్నమైన కాన్సెప్ట్‌తో 100 సినిమాను చేశాడు. ఆ సినిమాకు సైతం పెద్దగా బజ్‌ క్రియేట్‌ కాలేదు. ఇప్పటి వరకు సినిమా కు మినిమం ఓపెనింగ్స్ నమోదు కాలేదు.

ఆ రెండు సినిమాలతో పాటు వర్జిన్ బాయ్స్ అనే సినిమా సైతం ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా మందికి ఆ సినిమా వచ్చిన విషయం కూడా తెలియదు. చాలా తక్కువ థియేటర్‌లలో విడుదలైన ఆ సినిమాకు సైతం ఓపెనింగ్స్ కనిపించడం లేదు. పరిస్థితి చూస్తూ ఉంటే పవన్‌ కళ్యాణ్‌ 'హరి హర వీరమల్లు' సినిమాతో వచ్చే వరకు పరిస్థితి ఇలాగే కొనసాగే పరిస్థితి ఉంది. ఆ సినిమా హిట్‌ అయితే అప్పుడు ప్రేక్షకులు థియేటర్‌లకు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు ప్రేక్షకులు థియేటర్‌ల వైపు చూసే పరిస్థితి లేదు. ఈ మూడు వారాల బాక్సాఫీస్‌ ఖాళీగానే ఉంటుంది. వచ్చే వారంలో కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో సినీ ప్రేమికులకు నిరాశ తప్పదు.