Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ విలవిల

కానీ గత మూడు వారాలుగా టాలీవుడ్‌ బాక్సాఫీస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   13 July 2025 10:00 PM IST
టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ విలవిల
X

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ రేటు అనేది చాలా తక్కువ అనే విషయం తెల్సిందే. ప్రతి వారం లెక్కకు మించి సినిమాలు వస్తూ ఉంటాయి. వాటిల్లో ఒకటి రెండు మాత్రమే ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. అందులోనూ కొన్ని మాత్రమే హిట్‌గా నిలుస్తాయి, కొన్ని సూపర్‌ హిట్‌గా, చాలా తక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్‌ విజయాలను సొంతం చేసుకుంటాయి. నెలలో పదుల సంఖ్యలో సినిమాలు విడుదలైతే అందులో కనీసం మూడు నాలుగు సినిమాలు అయినా బాక్సాఫీస్‌ వద్ద ఒక మోస్తరు వసూళ్లు లేదా భారీ వసూళ్లు సాధిస్తూ ఉండేవి. కానీ గత మూడు వారాలుగా టాలీవుడ్‌ బాక్సాఫీస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ కనిపిస్తోంది.

గత నెలలో వచ్చిన ధనుష్‌, శేఖర్‌ కమ్ముల 'కుబేర' సినిమా టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసింది. మొదటి వారం రోజుల పాటు ఆ సినిమా మంచి వసూళ్లు సాధించడంతో బాక్సాఫీస్‌ వద్ద కళకళ కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లతో పాటు, మల్టీప్లెక్స్‌ల్లో జనాలు కనిపించారు. ఆ తర్వాత కన్నప్ప సినిమా వచ్చిన రెండు మూడు రోజులు ఒక మోస్తరుగా బాక్సాఫీస్‌ వద్ద జనాలు సందడి కనిపించింది. ప్రభాస్ ఉన్నాడు, ఎక్కువ సమయం ఉన్నాడు అంటూ ప్రచారం చేయడంతో జనాలు థియేటర్ల వద్ద క్యూ కట్టారు. కానీ ప్రభాస్ ప్రజెన్స్‌కి ప్రాముఖ్యత లేదు, సినిమాలో ఆయన పాత్ర నిడివి తక్కువ ఉందని క్లారిటీ రావడంతో ప్రేక్షకులు కన్నప్పను దూరం పెట్టారు.

కన్నప్ప సినిమా తర్వాత వచ్చిన దాదాపు అన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. ప్రతి వారం మూడు నాలుగు సినిమాలు వచ్చాయి. ఏ ఒక్కటి తెలుగు బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరు వసూళ్లను సాధించి పెట్టలేదు. గత వారం వచ్చిన సినిమాలను జనాలు కనీసం పట్టించుకోలేదు. అంతకు ముందు వారం వచ్చిన తమ్ముడు సినిమా బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడింది. నితిన్‌ కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా కనీసం వీకెండ్‌ వరకు కూడా థియేటర్‌లో జనాలను రప్పించలేక పోయింది. థియేట్రికల్‌ రిలీజ్ అయిన సినిమాల కంటే ఓటీటీ సినిమాల పట్ల ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. ఈ నెల చివరి వారంలో పవన్‌ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా రాబోతున్న విషయం తెల్సిందే. అప్పటి వరకు థియేటర్ల పరిస్థితి ఇలాగే విల విల అన్నట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్న పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమాతో మరో విజయాన్ని దక్కించుకుంటాడనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. క్రిష్, జ్యోతికృష్ణల దర్శకత్వంలో రూపొందిన హరి హర వీరమల్లు సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి పాజిటివ్‌ రెస్పాన్స్ రావడంతో ఓపెనింగ్స్ భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి.