ఆగస్టు బాక్సాఫీస్.. అసలు సవాల్ ఇదే!
వాతావరణ శాఖ రిపోర్ట్స్ చూస్తుంటే ఆగస్టు నెల మొత్తం వర్షాలు దంచికొట్టేలా ఉన్నాయి. బయట వర్షాలు పడుతుంటే, థియేటర్లలో మాత్రం సినిమాల వర్షం కురవబోతోంది.
By: M Prashanth | 4 Aug 2026 11:23 AM ISTవాతావరణ శాఖ రిపోర్ట్స్ చూస్తుంటే ఆగస్టు నెల మొత్తం వర్షాలు దంచికొట్టేలా ఉన్నాయి. బయట వర్షాలు పడుతుంటే, థియేటర్లలో మాత్రం సినిమాల వర్షం కురవబోతోంది. ఒకేసారి పదికి పైగా క్రేజీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలతో పాటు, చిన్న సినిమాలు కూడా ఈ నెలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వరుసగా క్యూ కట్టాయి. లైనప్ లో క్రేజీ సినిమాలు ఉన్నప్పటికీ, మేకర్స్ కు ఈ నెల ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి.
ఒకవైపు వర్షాల ఎఫెక్ట్ గట్టిగా ఉంటుంది. వానల్లో జనాలు ఇల్లు దాటి థియేటర్స్ కు రావాలి అంటే కంటెంట్ లో స్ట్రాంగ్ దమ్ము ఉండాలి. జస్ట్ యావరేజ్ లేదా ఓకే ఓకే అనే టాక్ వస్తే జనాలు రిస్క్ తీసుకుని బయటకు రారు. దీనికి తోడు తెలంగాణ, నైజాం ఏరియాల్లో బోనాల హడావుడి నడుస్తోంది. నేటి జెన్ జీ అంతా ఈ సెలబ్రేషన్స్ లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. కాబట్టి వాళ్ళ అటెన్షన్ ను థియేటర్ల వైపు తిప్పడం మామూలు విషయం కాదు. కంటెంట్ తో ఏదో ఒక మ్యాజిక్ చేయాల్సిందే.
ఈ నెలలో టాలీవుడ్ నుంచి రాబోతున్న సినిమాల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు 'కొరియన్ కనకరాజు'. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ హారర్ కామెడీ మూవీ మీద మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో రాబోతున్న ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా 'ఇరుముడి' కూడా ఇదే నెలలో రిలీజ్ కానుంది. డిఫరెంట్ ఎమోషన్స్ తో వస్తున్న ఈ రెండు ప్రాజెక్టులు బాక్సాఫీస్ దగ్గర నిలబడాలంటే వర్షాలను దాటుకుని బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం తప్పనిసరి.
మరోవైపు కేజీఎఫ్ స్టార్ యష్ మోస్ట్ ఏవైటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్' నెల చివరలో రానుంది. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈ నెలలోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'డీసీ' సినిమా కూడా ఆగస్టులోనే రిలీజ్ కానుంది. ఇవన్నీ భారీ అంచనాలు ఉన్న సినిమాలు అయినా కూడా వాతావరణం, ఫెస్టివల్ మూడ్ ను బ్రేక్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది.
పాన్ ఇండియా క్రేజ్ తో పాటు కంటెంట్ డ్రివెన్ కథలకు కూడా ఈ ఆగస్టులో స్కోప్ కనిపిస్తోంది. మలయాళం నుంచి దుల్కర్ సల్మాన్ స్పోర్ట్స్ యాక్షన్ సినిమా 'ఐ యామ్ గేమ్', పృథ్వీరాజ్ సుకుమారన్ క్రైమ్ థ్రిల్లర్ 'ఖలీఫా' రేసులో ఉన్నాయి. దీక్షిత్ శెట్టి పీరియడ్ డ్రామా 'కేజేక్యూ', రూరల్ ఎంటర్టైనర్ 'పల్లబురుసు' తమ కంటెంట్ తో మ్యాజిక్ చేయడానికి వస్తున్నాయి. ఎమ్.ఎస్. రాజు తీసిన మిస్టిక్ హారర్ థ్రిల్లర్ 'అగాధ' లాంటి విభిన్నమైన చిత్రాలు కూడా రిలీజ్ కు రెడీ అయ్యాయి. చిన్న సినిమాలకు మౌత్ టాక్ మాత్రమే ఏకైక బలం. లైనప్ ఎంత పెద్దగా ఉన్నా వానలు, ఫెస్టివల్ మూడ్ దాటుకుని జనాలను థియేటర్లకు రప్పించాలంటే సినిమాలకు ఎక్స్‌ట్రార్డినరీ రివ్యూస్ రావాల్సిందే.
